మేఘా కృష్ణారెడ్డికి ధారాధత్తం చేసే కుట్ర
-తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
(హైదరాబాద్)
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ నెల 26 న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న సందర్భంగా ప్రతిరోజు ఒక్క అంశాన్ని ఆమె ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్టీసీని ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. మేఘా కృష్ణారెడ్డికి మొత్తం ఆర్టీసీని ధారాదత్తం చేసే ప్రయత్నం జరుగుతున్నదన్నారు. గత ప్రభుత్వమే ఆర్టీసీ విలీన ప్రక్రియ బిల్లును పూర్తి చేసిందని ఈ సందర్భంగా కవిత గుర్తు చేశారు. రేవంత్ సర్కార్ దాన్ని అమలు చేస్తే సరిపోతుందని సూచించారు. చిన్న, చిన్న కారణాలకే ఆర్టీసీలో వెయ్యి మంది ఉద్యోగులను తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24 న ఆర్టీసీ ఉద్యోగులు ఇచ్చిన ఛలో సెక్రటేరియట్ కార్యక్రమానికి జాగృతి పూర్తి మద్దతు ఇస్తుందన్నారు.

ఆర్టిసి ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దు
ఆర్టీసీ ఉద్యోగుల కాళ్లకు ముల్లు గుచ్చితే పంటితో తీస్తా అని రేవంత్ రెడ్డి చెప్పారని కవిత గుర్తు చేశారు. కానీ వారి గుండెకు గాయమైనా సరే పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకం మొదలైన నాటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులపై ఒత్తిడి పెరిగిందన్నారు. చిన్న కారణాలకే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారంటూ మండిపడ్డారు. ఒత్తిడి తట్టుకోలేక డ్రైవర్లు హార్ట్ ఆటాక్ తో చనిపోతున్నారని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బంది పెట్టవద్దని, చిన్నవారిపై ప్రతాపం చూపవద్దని ప్రభుత్వానికి సూచించారు. చిన్న కారణాలకే ఉద్యోగాలు తొలగించిన వారందరినీ వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కవిత కోరారు.
ఆర్టీసీని కాపాడుకుందాం
ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర ప్రభుత్వం చేస్తోందని కవిత ఆరోపించారు. మహాలక్ష్మి పథకం పెట్టి ఆర్టీసీకి రూ.300 కోట్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. కానీ ఆక్యుపెన్సీ పెరగటం కారణంగా రూ. 600 కోట్లు అవసరమవుతున్నాయన్నారు. మహాలక్ష్మి పథకం తర్వాత ఆర్టీసీని ఎన్ని నిధులు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రిటైర్ మెంట్ బెనిఫిట్లు, జీతాల పెంపు, వాళ్లు సేవింగ్ చేసుకున్న సొమ్ము వారికి ఇవ్వాలని కోరారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసుకుంటూ ఆర్టీసీకి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా ఆర్టీసీ ఉద్యోగులే ఉండాలని కవిత కోరారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ను కూడా ప్రభుత్వం ఆర్టీసీ కి ఇవ్వటం లేదన్నారు. ఆర్టీసీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు కూడా ఆర్టీసీ ఉద్యోగుల తరఫున జాగృతి ఫైట్ చేస్తుందని భరోసా ఇచ్చారు.
సచివాలయంలోనే మంత్రివర్గ సమావేశాలు జరగాలి
తెలంగాణ రాష్ట్ర కేబినేట్ ను సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి తీసుకెళ్లటం పై కవిత మండిపడ్డారు. ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపర్చటమేనని చెప్పారు. ఐతే గతంలో మంత్రివర్గం ఎర్రవెల్లికి వెళితే ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశాలు సచివాలయంలోనే జరగాలని అన్నారు. ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకొని కేటీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. ఎవరు ఉద్యమకారులో, ఎవరు ఉద్యమ ద్రోహులో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.








