పెద్ద కాంట్రాక్టర్ ను కాపాడేందుకు ప్రయత్నం, కాంగ్రెస్ ఓ లూజర్ పార్టీ.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది జాగృతి పార్టీయే, పీసీసీ నేత వస్తే జాగృతిలో నేషననల్ కన్వీనర్ పోస్ట్ ఇస్తాం

మేఘా అనే తిమింగలాన్ని రక్షించేందుకు బీఆర్ఎస్ చిన్న చేప చుట్టూ సింగరేణి టెండర్ల వ్యవహారాన్ని తిప్పుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మేఘా కృష్ణారెడ్డికి రూ. 25 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నదని విమర్శించారు. సింగరేణి కాంట్రాక్టుల అంశంపై తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో కవిత ఆదివారం మీడియాతో మాట్లాడారు.  

తిమింగలానికి తోడిపెట్టేందుకే

“కార్మికులకు వంద అన్యాయాలు జరిగినా సరే బీఆర్ఎస్ మాట్లాడలేదు కానీ ఒక తిమింగళం లాంటి కాంట్రాక్టర్ కు అన్యాయం జరిగితే ముందుకు వస్తున్నారు. 2015 లో మనకు నైనీ ముందుగా ఆలాట్ అయ్యింది. 

2021 లో అదానీ 44 శాతం ఎక్సెస్ గా టెండర్ వేస్తే ఆయనకు కాంట్రాక్ట్ ఇవ్వలేదు. మధ్యలో సింగరేణి వేరే కంపెనీ వాళ్లకు మట్టి తీసే టెండర్ ఇచ్చింది. దానికి డిజీల్ ఖర్చులతో సహా ఇచ్చారు. కానీ గుంటనక్క అబద్దం చెప్పారు. కేటీఆర్ ఏ విషయమైనా అధ్యయనం చేసి మాట్లాడుతారని అనుకునేదాన్ని. కానీ ఆయన మాట్లాడుతుంటే దారుణం అనిపించింది. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్సెస్ టెండర్లు ఇవ్వలేదని అన్నారు. కానీ చాలా టెండర్లను ఎక్సెస్ కు ఇచ్చారు. 36, 16, 7, 8  శాతం ఎక్సెస్ కు ఇచ్చారు. సైట్ విజిట్ అనే నిబంధన సింగరేణిలో గతంలో కన్వెయర్ బెల్ట్ లాంటి వాటికి ఉండేది. ఇప్పుడు ఓబీకి కూడా సైట్ విజిట్ పెట్టారు. దీన్ని ఎక్స్ పోజ్ చేయటం మంచిదే. కానీ బీఆర్ఎస్ హయాంలో అసలు ఎక్సెస్ గా టెండర్లు పోలేదని అబద్దాలు చెప్పటం సరికాదు. గుంటనక్క, నమస్తే తెలంగాణ, టీ న్యూస్, కేటీఆర్ కలిసి చిన్న చేపను పెద్దగా చూపి పెద్ద చేపను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సింగరేణి కాంట్రాక్ట్ ల విషయంలో సృజన్ రెడ్డి చిన్న చేప. అతనికి వచ్చింది కేవలం రూ. 250 కోట్ల కాంట్రాక్ట్ మాత్రమే. అతను సీఎం బావమరిది అని ఆయనను పెద్దగా చేసి చూపెట్టి రూ. 25 వేల కోట్ల కాంట్రాక్ట్ చేపట్టే మేఘా కృష్ణారెడ్డి గురించి మాట్లాడటం లేదు. అసలు సృజన్ రెడ్డికి కాంట్రాక్టులు ఇచ్చిందే గుంటనక్క. అప్పుడు సీఎం బావమరిది అని వీళ్లకు తెలియదా?  సైట్ విజట్ నిబంధన కారణంగా కొంతమందికి అవకాశాలు దెబ్బతింటాయి. కానీ గుంటనక్క చెప్పని విషయమేమిటంటే మట్టి తవ్వే పేరుతో మేఘా కృష్ణారెడ్డి సంస్థకు అనుభవం ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా రూ. 25 వేల కోట్ల కాంట్రాక్టును పెద్ద చేపకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.” 

జర్నలిస్టులేమైనా టెర్రరిస్టులా

“మన రాష్ట్రంలో ఇప్పుడు దారుణమైన ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. మోస్ట్ అన్ పాపులర్ యూట్యూబ్ ఛానెల్ లో కథనాలు వేసినట్లు శాటిలైట్ ఛానెల్ లో కథనాలు వేస్తున్నారు. దళిత ఆడబిడ్డల మీద అలాంటి కథనాలు వేయటంపై మేము ఎంతో బాధపడ్డాం. గతంలో లైన్ అతిక్రమించిన యూట్యూబ్ ఛానెల్ వాళ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి లైన్ అతిక్రమించిన శాటిలైట్ ఛానెల్ ప్రతినిధులను కూడా అరెస్ట్ చేసింది. ఐతే జర్నలిస్టులను అరెస్ట్ చేసిన తీరును మేము ఖండిస్తున్నాం. వాళ్లేమీ టెర్రరిస్టులు కాదు. వాళ్లకు నోటీసులు ఇచ్చి వివరణ అడగాల్సింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని బీఆర్ఎస్ పార్టీ జర్నలిస్టులకు సపోర్టుగా నిలిచింది. కానీ కేటీఆర్ మీద ఇలాంటే కథనాలే వస్తే ఆయన అనుచరులు ఒక ఛానెల్ పై దాడి చేశారు. అక్కడ మహిళపై కథనాలు వేస్తే దాడి…ఇక్కడ మహిళలపై కథనాలు వస్తే జర్నలిస్టులకు సపోర్ట్ చేస్తారా? మహిళల విషయంలో బీఆర్ఎస్ వైఖరి ఇదేనా ? ఒక దళిత బిడ్డపై కథనాలు వస్తే ఆమెకు అండగా ఉండకపోవటాన్ని ప్రజలు గుర్తించాలి. ఆ ఛానెల్ లో కథనం తర్వాత ఆ కథనం బ్యాక్ గ్రౌండ్ అంటూ ఇంకొక పేపర్ లో కథనం వచ్చింది. ఆ కథనం ఆధారంగా భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టారు. 

భట్టిగారు ప్రెస్ మీట్ పెట్టగానే మా గుంటనక్క కూడా ప్రెస్ మీట్ పెట్టారు. గుంటనక్క ప్రెస్ మీట్ ను గుడ్డిగా ఫాలో అయి కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మొత్తానికి నైనీ కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇక్కడ విచిత్రాలు జరుగుతున్నాయి. మేము కాంట్రాక్టర్ల పక్షాన కాకుండా కార్మికుల పక్షాన మాట్లాడుతాం. రెండేళ్లుగా మేము కార్మికుల సమస్యల గురించి ఎన్నిసార్లు మాట్లాడినా భట్టి విక్రమార్క స్పందించలేదు.”

ఒడిశాకు జాగృతి బృందం

“హరీశ్ రావు మొత్తం దళిత కమ్యునిటీనే అవమానపరిచే విధంగా భట్టి విక్రమార్కకు లేఖ రాయను అంటున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మాత్రమే ఆయన లెటర్ రాస్తారంటా? అసలు సింగరేణిలో ఎండీవో అనే సిస్టమ్ పెట్టారు. అది ఉండకూడదు. గతంలో సింగరేణికి ఓపెన్ కాస్టులతో ఎంతో లాభం ఉండేది. కానీ ఎండీవో సిస్టమ్ తెచ్చి సంస్థకు నష్టం చేస్తున్నారు. దీంతో అసలే నష్టాల్లో ఉన్న సింగరేణి మరింత నష్టపోతున్నది. బీఆర్ఎస్ హయాంలోనే సింగరేణికి రూ. 25 వేల కోట్ల అప్పు పెట్టారు. కాంగ్రెస్ వచ్చాక ఆ అప్పు రూ. 50 వేల కోట్లు అయ్యింది. పవర్ సంస్థల నుంచి రావల్సిన బకాయిలు ఇవ్వటం లేదు. దీంతో సింగరేణి సంస్థ జీతాల కోసం కూడా అప్పు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. నైనీ టెండర్లు రద్దు చేసినట్లే ఎండీవో విధానాన్ని రద్దు చేయాలి. మనం కూడా నైనీ బ్లాక్ ఉన్న ఒడిశాకు వెళ్లి ఓపెన్ కాస్ట్ చేయాలి. దాని ద్వారా తెలంగాణ కార్మికులకు ఉద్యోగాలు వస్తాయి. సంస్థకు మేలు జరుగుతుంది. ఎంతో క్వాలిటీ ఉన్న తాడిచర్ల బ్లాకును కూడా ఎండీవో విధానం ద్వారా ఇచ్చారు. దీంతో సంస్థకు లీజు మాత్రమే వస్తుంది. గ్రేడ్ 9 క్వాలిటీ ఉన్న కోల్ ను పెద్ద చేప కోసం కాంట్రాక్ట్ ఇస్తున్నారు. సింగరేణి విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న డొల్ల విధానాన్ని మేము గమనిస్తున్నాం. బీఆర్ఎస్ అబద్దాలు చెప్పకుండా ప్రజలకు అన్నీ వాస్తవాలే చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు రాష్ట్ర ప్రభుత్వం కోరకుండా సీబీఐ వస్తుందా? కానీ గుంటనక్క మాత్రం భట్టి విక్రమార్కకు లేఖ రాయకుండా కిషన్ రెడ్డికి లేఖ రాస్తారంట. 

గుంటనక్క అడగగానే కిషన్ రెడ్డి ఏదో పేరుతో కమిటీ వేశారు. అందులో ఏజీఎం ర్యాంక్ ఉన్న మారుపల్లి వెంకటేష్ అనే అధికారి ఉన్నాడు. ఆయన సింగరేణి ఎండీని ప్రశ్నించి ఆయనకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వగలడా? అసలు ఏపీలో, తెలంగాణలో ఉన్న కొత్త బ్లాకులను సింగరేణికే ఇవ్వాలి. కిషన్ రెడ్డి ఈ బ్లాక్ సింగరేణికి వచ్చేలా కృషి చేయాలి. రూల్స్ అనకుండా మనకు వచ్చేందుకు ఆయన తరఫున ప్రయత్నం చేయాలి. గతంలో గుజరాత్ కు బొగ్గు బ్లాకులను తీసుకొని పోయిన ఘటనలు లేవా? కిషన్ రెడ్డి తెలంగాణ కోసం చేయకపోతే బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చి ఏం లాభం?”

Kavitha addressing media on Singareni tender issue

గుంటనక్కను ఫాలో అవుతున్న కేటీఆర్

“సింగరేణిలో కాంగ్రెస్ వాటాలు తేలలేదని గుంటనక్క అంటున్నారు. కానీ అసలు గుంటనక్క వాటాలు తేలకపోవటంతోనే అలా మాట్లాడుతున్నారు. పైగా ఆయన 2014 నుంచి విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పైనే విచారణ చేయమని అడుగుతున్నారు. పాపం కేటీఆర్ కూడా అదే ట్రాప్ లో పడి అదే విధంగా డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ లోనే ఉంటూ కేసీఆర్ కు గుంటనక్క ద్రోహం చేస్తోంది. గుంటనక్కను ఫాలో అయి గుడ్డిగా కేటీఆర్ గుంటలో పడ్డాడు. త్వరలోనే సింగరేణిలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికైనా కార్మికుల డిమాండ్లను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కార్మికుల రిక్రూట్ మెంట్లు, బిల్లులు వచ్చేలా చేయాలి. మాకు మైనార్టీ వాటా ఉందంటూ ఏమీ చేయలేమని కిషన్ రెడ్డి చెప్పటం కరెక్ట్ కాదు. జాగృతి తరఫున నైనీ బ్లాక్ ను విజిట్ చేసేందుకు ప్రత్యేక డెలిగేషన్ వెళ్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎవరైనా కార్మికుల పక్షాన ఉండాలి. కానీ కాంట్రాక్టర్ల కోసం పనిచేస్తున్నారు. జాగృతి మాత్రం ఎప్పటికీ కూడా కార్మికుల పక్షానే ఉంటుంది. వారి కోసం పనిచేస్తుంది. అయినా సరే సింగరేణికి రూ. 25 వేల కోట్ల నష్టం వస్తుంది కనుక నేను మాట్లాడుతున్నాను. న్యూస్ ఛానెల్ ను బ్యాన్ చేయటమేంటో కానీ త్వరలోనే ప్రజలు బీఆర్ఎస్ ను బ్యాన్ చేస్తారు.”

నన్ను బద్నాం చేసే వ్యాఖ్యలు

“నేను కాంగ్రెస్ కు వస్తానంటే మహేష్ కుమార్ గౌడ్ వద్దన్నానంటూ చెబుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లూజింగ్ పార్టీ. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచే పార్టీయే జాగృతి పార్టీ. మా పార్టీ కోసం మేము దూంధాంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మహేష్ గౌడ్ కు ఉన్న ఎక్స్ పీరియన్స్ కారణంగా ఆయనకే మేము జాగృతి పార్టీ నేషనల్ కన్వీనర్ పదవి ఇస్తాం. నేను కాంగ్రెస్ లోకి వస్తనని ఆయనకు కల వచ్చిందేమో…ఏదైనా బొట్టు పెట్టించుకుని ఎవరికైనా చూపించుకోవాలి. 

నా వ్యక్తిత్వాన్ని బద్నాం చేసేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మేము చాలా సీరియస్ గా ప్రజల కోసం పనిచేసే పొలిటికల్ పార్టీగా వస్తున్నాం. మేము సీరియస్ పొలిటికల్ పార్టీగా వస్తాము.”

ఫోన్ ట్యాపింగ్ దుర్వినియోగం

“ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఒక జోక్ అయిపోయింది. రెండేళ్లుగా సీరియల్ గా సాగదీస్తున్నారు. నా లాంటి బాధితులకు మేలు చేయటం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వారికి నోటీసులు ఇస్తున్నారా? బాధితులకు నోటీసులు ఇస్తున్నారా.. అర్థం కావటం లేదు. మున్సిపల్ ఎన్నికల కోసమే ప్రభుత్వం ఈ డ్రామా చేస్తోంది. టెర్రరిస్టుల కోసం చేయాల్సిన ఫోన్ ట్యాపింగును అన్ని ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయి.”