ఆశయాలు మరచిన బీఆర్ఎస్
ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న కాంగ్రెస్
నడిగడ్డ ప్రజలకు కవితమ్మనే పెద్ద దిక్కు
-నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్
(గద్వాల)
ఏ ఆకాంక్షలతో తెలంగాణ సాధించుకున్నామో ఆ ఆకాంక్షలను బీఆర్ఎస్ పూర్తిగా విస్మరించిందని నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ ఆరోపించారు. అమరుల ఆశయల సాధన దిశగా పార్టీ నడుపుతామని హామీ ఇచ్చిన బీఆర్ఎస్ ఫెయిల్ అయ్యిందని విమర్శించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో బుధవారం జాగృతిలో చేరడానికి నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ తన అనుచరులతో కలిసి బయలుదేరేముందు గద్వాలలో మీడియాతో మాట్లాడారు. 150 వాహనాల్లో వెయ్యి మంది నాయకులు, కార్యకర్తలతో గద్వాల నుంచి హైదరాబాద్ కు బయల్దేరిన రంజిత్ కుమార్ మాట్లాడుతూ..నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో గత ప్రభుత్వం ఏ మాత్రం న్యాయం చేయలేదన్నారు. పేదలు, రైతులు, మహిళలు ఇలా ఏ వర్గానికి న్యాయం చేయలేదని తెలిపారు. పైగా అహంకారపూరితంగా ప్రజల్లో విసుగు వచ్చేలా పాలన చేసిందని దుయ్యబట్టారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టారని చెప్పారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్వపు తెలంగాణలో ఉన్న దాని కన్నా కూడా దారుణ పరిస్థితులు నెలకొన్నాయని రంజిత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా రేవంత్ సర్కార్ ప్రయత్నించడం లేదన్నారు.
కవిత పైనే నమ్మకం
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, యువతకు న్యాయం చేసేందుకు కల్వకుంట్ల కవిత పార్టీ ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చారని రంజిత్ వెల్లడించారు.
తెలంగాణ ఆత్మ పురుడు పోసుకునేలా పార్టీ తేనున్నారని తెలిపారు. నడిగడ్డ పోరాట హక్కుల సమితి ద్వారా తాము ఈ ప్రాంతంలో విద్య, వైద్యం, మౌలిక వసతుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నామని చెప్పారు. సీడ్ పత్తి రైతుల సమస్యలు, పలు గ్రామాల్లో వీధి లైట్ల సమస్యలు, స్కూళ్లలో పిల్లలకు సౌకర్యాల విషయంలో మేము పోరాటం చేసిన సంగతి అందరికీ తెలుసన్నారు. పైగా ఇక్కడ కుటుంబ పాలన చేస్తున్న వారికి వ్యతిరేకంగా ఉద్యమం చేశామని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే తనకు ఈ ప్రాంతవాసులు ఎంతో మద్దతిచ్చారని తెలిపారు. ఎప్పటి నుంచో తాము ఎస్సీ, ఎస్టీ, బీసీల వాదాన్ని వినిపిస్తున్నామని రంజిత్ కుమార్ వివరించారు. కవిత కూడా అదే వాదంతో పార్టీ పెట్టేందుకు ముందుకు వస్తున్నారని, ఈ నేపథ్యంలో ఆమెతో కలిసి ముందుకు వెళ్లాలని మా నడిగడ్డ పోరాట హక్కుల సమితి ముఖ్య నాయకులం నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ విషయాన్ని కవితకు చెప్పగానే ఆమె మన జిల్లాలో ఉన్న నెట్టంపాడు సహా ఇరిగేషన్ సమస్యలు, విద్యా వ్యవస్థ పరిస్థితి, వలసలు అన్నింటిపై తనకు అవగాహన ఉందని చెప్పారన్నారు.
మన జిల్లా ప్రజలు పడుతున్న గోసను పట్టించుకుంటానని హామీ ఇచ్చారన్నారు. ఈ నెల 25 న కవిత పార్టీ పెట్టబోతున్న నేపథ్యంలో ముందుగానే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నామని రంజిత్ వెల్లడించారు. ఇవ్వాళ 150 కార్లలో హైదరాబాద్ కు వెళ్లి కవిత ఆధ్వర్యంలో వారు పెట్టబోయే పార్టీలో చేరబోతున్నామని వివరించారు. గతంలో ఏ విధంగా నాకు మద్దతిచ్చారో ఇప్పుడు కూడా అదే మద్దతు కొనసాగించాలని కోరారు.








