-కల్వకుంట్ల కవిత

  • మేం పార్టీ పెడతామనగానే బీఆర్ఎస్ లీడర్లు కారు కూతలు కూస్తున్నరు
  • బీఆర్ఎస్, బీజేపీ పొత్తుకు మున్సిపల్ ఎన్నికలు తొలిమెట్టు
  • ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, జాగృతికి చెందిన 40 మంది అభ్యర్థుల గెలుపు
  • మా లాంటి కొత్త తరహా రాజకీయాల చేసే వారిని ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారు
  • అల్టర్ నేట్ లేకనే ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేశారు

(హైదరాబాద్)

ప్రజల సమస్యలు పట్టని పార్టీలతో విసుగు చెందినా గత్యంతరం లేకనే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి మద్దతుతో పోటీ చేసిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా రాష్ట్రంలో ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని అర్థమైందన్నారు. ఈ ఎన్నికల ద్వారా బీఆర్ఎస్, బీజేపీ దోస్తానా స్పష్టమైందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి గెలుపు ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని వెల్లడించారు. తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయంలో ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్ కన్వీనర్ అంబటి జోజిరెడ్డి, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ తో కలిసి కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. 

ఫలితాలు ఉత్సాహాన్నిచ్చాయి

ఈ ఎన్నికల్లో మాలాంటి న్యూ ప్లేయర్ ను ప్రజలు ఆదరించారు. త్వరలోనే మేము రాజకీయ పార్టీగా మారబోతున్నామని చెప్పి ఎన్నికల్లో పోటీ చేశాం. సమయం తక్కువగా ఉన్నప్పటికీ మా కార్యకర్తల ఒత్తిడి మేరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో కలిసి పోటీ చేశాం. ప్రజలు మమ్మల్ని 40 స్థానాల్లో గెలిపించారు. అధికారికంగా 33 స్థానాలు అయినప్పటికీ కొంతమందికి బీ ఫామ్ ఇవ్వటంలో ఇబ్బంది అయ్యింది. అలా మరో ఏడు స్థానాల్లో మా అభ్యర్థులే గెలిచారు. వడ్డెపల్లిలో మాకు క్లియర్ మాన్ డేట్ ను ప్రజలు కట్టబెట్టారు. కానీ కాంగ్రెస్ వాళ్లు ప్రలోభాలు పెట్టి వారిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఛైర్మన్ ఎన్నిక వరకు ఏమీ జరుగుతుందో తెలియదు. అందుకే దాని గురించి మాట్లాడటం లేదు. ఇక నారాయణ్ పేటలో మాకు వైస్ ఛైర్మన్ ఆఫర్ చేస్తున్నారు. ఐతే దీనిపై లోకల్ నాయకత్వాన్నే నిర్ణయం తీసుకోమని చెప్పటం జరిగింది. గతంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్  తమకు 17 స్థానాలు వచ్చుడే ఎక్కువ అన్నట్లుగా మాట్లాడారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కు 5 శాతం సీట్లు కూడా రాలేదని అంటున్నారు. కాంగ్రెస్ అపొజిషన్ లో ఉన్నప్పుడు ఉన్న స్థానాలతో ఆయన పోల్చుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దానితో పోల్చుకుంటే బీఆర్ఎస్ చాలా స్థానాలు కోల్పోయింది.

అధికార దుర్వినియోగం

ఈ ముఖ్యమంత్రి గారు నేనే రాజు, నేనే మంత్రి అంటున్నారు. పదేళ్లు ముఖ్యమంత్రి నేనే. నాకు ఆరు నెలలు బోనస్ వస్తుందని చెబుతున్నారు. ముందు రైతులకు ఇస్తామన్న బోనస్ ఇవ్వాలి. అదే విధంగా మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎం కుర్చీ లాక్కుంటా అని రాజ్ గోపాల్ రెడ్డి అంటున్నాడు. అందుకే ప్రజలకు ఇచ్చిన హామీలపై ముందు దృష్టి పెట్టాలి. ప్రజలకు అల్టర్ నేట్ లేకపోవటంతోనే కాంగ్రెస్ కు ఓటు వేశారు. ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ ఎక్కడ కూడా నిలబెట్టుకోకుండానే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచింది. ఎన్నికల్లో చాలా చోట్ల కూడా రీ కౌంటింగ్ పేరుతో  కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ఇక మున్సిపల్ ఎన్నికల వాతావారణాన్ని తెలంగాణ ఆడబిడ్డగా పరిశీలించి చూస్తే చాలా బాధనిపించింది. గ్రామపంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో చట్టాలను, పరిమితులను ముఖ్యమంత్రి పూర్తిగా ఉల్లంఘించారు. గ్రామ పంచాయితీ ఎన్నికల సమయంలో పట్టణాల్లో, మున్సిపల్ ఎన్నికల సమయంలో గ్రామాల్లో ప్రభుత్వ ఖర్చుతో ప్రచారం నిర్వహించారు. అయినా కూడా ఈసీ పట్టించుకోలేదు. ప్రతిపక్షాలు ప్రశ్నించలేదు.  ఇక కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసేలా బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. తెలంగాణకు రూపాయి ఇవ్వని బీజేపీ కరీంనగర్ మేయర్ స్థానం తప్ప అన్ని చోట్ల అష్టకష్టాలు పడింది.

Kavitha addresses media on alternative politics in Telangana

పిక్చర్ అభీ బాకీ హై

“రాష్ట్రంలో ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఉంది. కచ్చితంగా మాలాంటి వాళ్లను ప్రజలు స్వాగతిస్తారని నమ్మకం ఉంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అట్టర్ గా ఫెయిల్ అయ్యింది. ప్రజలు మాకు గుడి కట్టారంటూ ప్రచారం చేసుకుంటున్న బీఆర్ఎస్ చాలా చోట్ల మూడు, నాలుగు స్థానాలకు పడిపోయింది. ఇక మేము రాజకీయ పార్టీగా వస్తామని అనగానే బీఆర్ఎస్ వాళ్లు ట్రోల్ చేయటం మొదలు పెట్టారు. వాళ్లకు ఏ సిర్ఫ్ ట్రైలర్ హై, పిక్చర్ బాకీ హై అని చెబుతున్నా. ఇప్పుడే కారుకూతలు కూయకండి అని హెచ్చరిస్తున్నా. ఉద్యమకారులకు మంచి చేయాలని నేను మాట్లాడితే నా మీద ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి అహంకారం తగ్గించుకొని ప్రజల మధ్యలో ఉండకపోతే ఇలాంటి ఫలితాలే వస్తాయి. బీఆర్ఎస్ గతంలో అపొజిషన్ లో ఉన్న కాంగ్రెస్ తో పోల్చుకుంటున్నది. అంతకుముందు 90 శాతం మున్సిపాలిటీల్లో గెలిస్తే ఇప్పుడు 16 మున్సిపాలిటీలకు పరిమితమయ్యారు. ప్రజల ప్రేమను ఎందుకు కోల్పోయారో ఆ పార్టీ నేతలు అర్థం చేసుకోవాలి. పార్టీలో నిన్న, మొన్నటి వరకు కూడా పనిచేసిన వారిని గాలికి వదిలేశారు. నార్త్ తెలంగాణలో బీజేపీకి ఫేవర్ గా బీఆర్ఎస్ పనిచేసింది. అందుకే బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోతున్నాయని నేను అంటున్నా. ఉత్తర తెలంగాణలో గతంలో మంత్రులుగా పనిచేసిన బీఆర్ఎస్ నేతలు చేతులేత్తేశారు. అసలు ప్రచారం కూడా పెద్దగా చేయకుండా బీజేపీకి సహకరించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ నార్త్ లో ఒకరికి ఒకరు సహకరించుకున్నారు. నేను ముందు నుంచి చెబుతున్నట్లుగా బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుకు ఇది తొలి మెట్టుగా భావించాలి. ఇక కొత్తగూడెంలో సీపీఐ అడగకుండానే వారికి మద్దతు అని కేటీఆర్ చెబుతున్నారు. గతంలో తోక పార్టీ అని చెప్పిన పార్టీకే ఇప్పుడు బీఆర్ఎస్ తోక పార్టీగా మారింది. సింగరేణిలో కార్మికుల హక్కులు పొగేట్టే విధంగా వ్యవహరించిన వారికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తోంది. 

అదే విధంగా సాంబశివరావు కాళేశ్వరం విషయంలో అసెంబ్లీలో కేసీఆర్ పై ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ పార్టీకి మద్దతివ్వటమంటే కేసీఆర్ పై చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ అంగీకరించినట్లే. పైగా సీపీఐ వాళ్లు కాంగ్రెస్ తో మిలాఖత్ అయి ఉన్నారు. అలాంటి వారికి బీఆర్ఎస్ మద్దతివ్వటమంటే నయవంచనే. కాంగ్రెస్ తప్పులను ఎత్తిచూపకుండా వదిలేయటంతోనే ఆ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది.”

పార్టీల మాయలో పడొద్దు

సింగరేణి కార్మికుల కోసం జాగృతి, హెచ్ఎంఎస్ మాత్రమే పనిచేస్తోంది. త్వరలో జరగబోయే సింగరేణి ఎన్నికల్లోనూ హెచ్ఎంఎస్, జాగృతి కలిసి పనిచేస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన వాళ్లంతా కూడా రేపటి తరం నాయకులు. పార్టీల మాయలో పడి వార్డు సమస్యలను వదిలేయవద్దు. రాజకీయాల్లో రాణించాలనుకునే యువ మిత్రులకు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రయోగం లాంటివి. ఆ ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయ ప్రక్రియను తెలుసుకోవాలి. గెలిపించిన అభ్యర్థులతో పనిచేయించుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే ప్రజలకు ఏ పార్టీ మీద నమ్మకం లేదని తెలుస్తోంది. అందుకే కొత్త తరహా రాజకీయాలను జాగృతి చేసి చూపిస్తుంది. 

ఇప్పుడున్నది నకిలీ బీజేపీ -అంబటి జోజిరెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్ కన్వీనర్

జాగృతితో  కలిసి పోటీ చేసిన మా పార్టీ నేతలను చాలా మందిని ప్రజలు గెలిపించటం సంతోషం. భవిష్యత్తులోనూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, జాగృతి కలిసి పనిచేస్తాయి. 

వడ్డెపల్లిలో మేము ఉద్యమ సంస్థ జాగృతితో కలిసి పనిచేశాం. వడ్డేపల్లి మున్సిపాలిటీని కలిసే గెలుచుకున్నాం. దీనిపై దయచేసి మీడియా వాళ్లు కన్ ఫ్యూజ్ చేయవద్దు. కరీంనగర్ లో బీజేపీకి అసలు మెజార్టీ రాలేదు. దాంతో మా పార్టీ వాళ్లకు కండువా కప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న రాత్రి బండి సంజయ్ మా వాళ్లను బెదిరించి ఒకరికి కండువా కప్పారు. 

Telangana Jagruthi press conference after municipal election victory

కానీ వాళ్లు బీజేపీకి వెళ్లలేదు. మాతోనే ఉన్నారు. అసలు ఇప్పుడు బీజేపీ అనేది లేదు. మోడీ, అమిత్ షా ల పార్టీ మాత్రమే ఉంది. బీజేపీకి కొన్ని నైతిక విలువలు ఉండేవి. ఇప్పుడున్న వారు విలువలను వదిలేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పరిధిలోని ఒక్క మున్సిపాలిటీని కూడా ఆయన గెలిపించుకోలేదు. 1939 లో సుభాష్ చంద్రబోస్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ను స్థాపించారు. అలాంటి పార్టీ అభ్యర్థులను ఇండిపెండెంట్ అభ్యర్థులని బండి సంజయ్ అంటున్నారు. ఆయనకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అని కూడా తెలియదు. కరీంనగర్ లో బండి సంజయ్ రూ. 30 కోట్లు ఖర్చు చేశారు. లేకపోతే అసలు బీజేపీ ఆ మాత్రం కూడా గెలిచేది కాదు. అంటే ఆ పార్టీ ఓడిపోయినట్లే. ఒక్క పైసా ఖర్చు చేయకుండానే ప్రజలు మాకు 40 సీట్లు ఇచ్చారు. మేము కూడా బీజేపీ మాదిరిగా రూ. 30 కోట్లు ఖర్చు చేసి ఉంటే ఎన్నో సీట్లు వచ్చేవి. డబ్బులతో కాకుండా సుభాషిజంతో రావాలని మేము భావిస్తున్నాం. భవిష్యత్ లోనూ అదే విధంగా ముందుకు వెళ్తాం.

కాంగ్రెస్ గూండాయిజం -రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి

రామగుండం ఎమ్మెల్యే మా వాళ్లపై గుండాయిజం, రౌడీయిజం చేశాడు. గెలిచిన మా అభ్యర్థులకు కండువాలు కప్పి వాళ్ల పార్టీలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ మా వాళ్లు బెదరలేదు. ఎమ్మెల్యే బెదిరింపులకు భయపడలేదు. ఉత్తర తెలంగాణలో సీపీఐ పని ఖతమైంది. వాళ్లు ఒక్క సీటు గెలవలేదు. బీజేపీ ఒక్కటి మాత్రమే గెలిచింది. జాగృతి తరపున 34 మంది పోటీ చేస్తే ఆరుగురు గెలిచారు. అదే బీఆర్ఎస్ నుంచి 60 మంది పోటీ చేస్తే 16 మంది మాత్రమే గెలిచారు. సీపీఐ మాత్రం ఒక్కో చోట ఒక్కొక్కరితో సంసారం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. కార్మికుల విషయంలో వాళ్లు పొంతన లేని స్టేట్ మెంట్ చేస్తున్నారు. భవిష్యత్తులో కోల్ బెల్ట్ ఏరియాలో కార్మికుల కోసం పనిచేసే వాళ్లనే ప్రజలు గెలిపిస్తారు. గతంలో కార్మికుల హక్కుల కోసం కవిత ఎంతో పోరాటం చేశారు. కానీ కాంగ్రెస్ వచ్చాక ఒక్క బొగ్గు బాయి లేదు. అంతకుముందు 60 వేల కార్మికులు ఉంటే ఇప్పుడు 40 వేలే ఉన్నారు. నైనీ బ్లాక్ కుంభకోణం అనేది కాంట్రాక్టర్ల కొట్లాట. అన్ని పార్టీలు కూడా కార్మికుల కోసం కాకుండా కాంట్రాక్టర్ల కోసం పనిచేస్తున్నాయి. రానున్న రోజుల్లో హెచ్ఎంఎస్, జాగృతి, ఫార్వర్డ్ బ్లాక్ కలిసి కార్మికుల కోసం పనిచేస్తాయి.

Kavitha addresses media on alternative politics in Telangana

విలేకరుల సమావేశంలో ఫార్వర్డ్ బ్లాక్ సెంట్రల్ కమిటీ మెంబర్ ఆర్ వీ ఆర్ ప్రసాద్, జాగృతి ప్రధాన కార్యదర్శి ఎల్. రూప్ సింగ్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.