-కల్వకుంట్ల కవిత
శాంతి భద్రతలపై సీఎం రేవంత్ నిర్లక్ష్యం
(కేతిరెడ్డిపల్లి-మొయినాబాద్ మండలం)
రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో హత్యకు గురైన న్యాయవాది స్వప్న కుటుంబ సభ్యులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం పరామర్శించారు. స్వప్న కుటుంబ సభ్యులను ఓదార్చి దైర్యం చెప్పారు. రోజురోజుకు మహిళల పట్ల అకృత్యాలు పెరుగుతున్నా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని కవిత ఆరోపించారు. స్వప్న కుటుంబ సభ్యులను ఓదార్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
పోలీసులు స్పందిస్తే ఘోరం జరిగేది కాదు
మొయినాబాద్ లోని కేతిరెడ్డి పల్లిలో లాయర్ స్వప్న ఉదంతం బాధ కలిగించింది. లాయర్ అయిన స్వప్న త్వరలోనే పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ ఈ లోపే కుటుంబ సభ్యుల చేతిలోనే హత్యకు గురికావటం జీర్ణించుకోలేని విషయం. అయితే స్వప్న ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా సరే పోలీసులు పట్టించుకోలేదు. కంప్లైంట్ ఇచ్చినప్పుడే పోలీసులు పట్టించుకుని ఉంటే ఇంత దారుణం జరిగేది కాదని అంతా చెబుతున్నారు. అన్ని సార్లు కంప్లైంట్ చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రజలకు వివరించాలి. హైదరాబాద్ కు కూత వేటు దూరంలోనే ఇలాంటి సంఘటన జరిగింది. అంటే పోలీసులంటే భయం లేని పరిస్థితి ఉంది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి మూడు నెలలలోపు నిందితులకు శిక్ష పడేలా చూడాలి. నలుగురు నిందితుల్లో ఒకరిపై గతంలోనే హత్యాయత్నం కేసు ఉంది. నిందితులకు త్వరితగతిన శిక్షపడకుంటే నేరస్థులకు భయం ఉండదు. స్వప్న కుటుంబ సభ్యుల్లో ఇద్దరు పెద్దవాళ్లు ఉన్నారు. వారి కుటుంబానికి మేము అండగా ఉంటాం.

లాయర్ల రక్షణ బిల్లుకు మోక్షం ఎప్పుడు
హైదరాబాద్ లో కూడా మహిళలపై నేరాలు తీవ్రంగా పెరిగిపోయాయి. గన్ తో బెదిరించి డబ్బులు తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాలి. పోలీసులకు సీరియస్ గా ఆర్డర్స్ ఇవ్వాలి. హత్యకు గురైన స్వప్న లాయర్ గా ఉన్నారు.
లాయర్ల రక్షణ కోసం అడ్వకేట్ పొటెక్షన్ యాక్ట్ అనే బిల్లుకు గతంలో సవరణలు చేశారు.
కానీ రెండేళ్లుగా ఆ బిల్లును పెండింగ్ లో పెట్టారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆ బిల్లును పాస్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. హైదరాబాద్ లో గతేడాది జరిగిన అగ్నిప్రమాదాల్లో 22 మంది చనిపోయారు. కానీ ముఖ్యమంత్రి కనీసం ఒక్కరి కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు. మున్సిపల్, హోం, విద్యశాఖ ఇలా చాలా శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉండటంతో ఆయన ఏమీ చూసుకోవటం లేదు. అందుకే హైదరాబాద్ లో నేరాలు తీవ్రంగా పెరిగాయి. గురుకులాల్లో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది. విద్యార్థులు పాము కాట్లకు బలవుతున్నారు. ముఖ్యమంత్రి తన శాఖలపై దృష్టి పెట్టి నేరాల అదుపునకు కృషి చేయాలి.








