బీసీలను పదే పదే మోసం చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్

మహత్మా ఫూలే విగ్రహ ఏర్పాటులో ఎందుకింత నిర్లక్ష్యం?

బీసీలను అవమానిస్తూ, చులకన చేస్తే తగిన మూల్యం తప్పదు

ప్రభుత్వాన్ని హెచ్చరించిన జాగృతి బీసీ నేతలు

(హైదరాబాద్):

మహత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకంత నిర్లక్ష్యమని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి ప్రశ్నించారు. జాగృతి బీసీ నాయకులతో కలిసి శనివారం ఐ మ్యాక్స్ సమీపంలోని లేక్ వ్యూ పార్క్ మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ప్రాంగణంలో ఆందోళన నిర్వహించారు. ఈనెల 9వ తేదీన సీఎం ఫూలే విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని ప్రచారం చేసుకుని ఆయన జయంతి రోజు నాటికి కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి బీసీలంటే ఎందుకంత చులకన అని ప్రశ్నించారు. మహత్మా ఫూలే కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా ఆ స్థానంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాన్ని పెట్టే కుటిల యత్నం చేశారని మండిపడ్డారు. బీసీ సంఘాలు, జాగృతి నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో ఆ ప్రయత్నం మానుకున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం విషయంలో ఇలాగే చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు బీసీ లను తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటూ పదే పదే మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చుకొని 13 ఏళ్లు గడిచిన తర్వాత కూడా జయశంకర్ సార్ విగ్రహం లేకపోవటమంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ లు సిగ్గుపడాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న బీసీలను బీఆర్ఎస్, కాంగ్రెస్ లు మోసం చేశాయని జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా శ్రీనివాస్ అన్నారు. తెలంగాణలో బీసీలకు స్థానం లేకుండా కుట్ర చేస్తున్నారన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రెండేళ్లుగా బీసీల కోసం పోరాటం కొనసాగుతుందని ఇంకా బీసీలను మోసం చేసే ప్రయత్నాలు చెల్లవన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఘోరంగా మోసం చేసిందని జాగృతి అధికార ప్రతినిధి పడాల మనిజా గౌడ్ అన్నారు. మహిళ బిల్లులో బీసీలకు సబ్ కోటా అని అడుగుతున్న ముఖ్యమంత్రి ముందు కాంగ్రెస్ ఇస్తామన్న 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. బీసీల్లో చైతన్యం పెరిగిందని…గతంలో మాదిరిగా మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బీసీ జాగృతి అధ్యక్షుడు ఎత్తరి మారయ్య హెచ్చరించారు. బీసీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని జాగృతి నేత గొంగళ్ల రంజిత్ కుమార్ విమర్శించారు. సమాజాన్ని చైతన్య పరిచేందుకు జీవితమంతా కృషి చేసిన సంఘ సంస్కర్త పూలే గారి విషయంలో ఇంత నిర్లక్ష్యమా అని విమర్శించారు. బీసీ గా పుట్టటమే ఫూలే చేసిన తప్పా అని ప్రశ్నించారు.