ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటావా?
రేవంత్ రెడ్డి…నువ్వు అజ్ఞానం, అహంకారంతో వీర్ర వీగుతున్నావు
విద్యావ్యవస్థను నిర్వీర్యం చేయాలనే నీ కుట్రలను గుర్తించినందుకే నీలో ఈ అసహనం
-తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు ఇస్మాయిల్
(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్):
ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు ఆయన అజ్ఞానం, అహంకారానికి నిదర్శనమని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు ఇస్మాయిల్ విమర్శించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా శుక్రవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ నిర్మాణంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులపై ఎందుకంత అసహనమని సీఎంను ప్రశ్నించారు. వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇంత అసహనమెందుకు?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజ్ఞానం, అహంకారంతో వీర్రవీగుతున్నాడని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు ఇస్మాయిల్ విమర్శించారు. దేశ నిర్మాణంలో కీలకంగా వ్యవహరిస్తున్న విద్యార్థుల పట్ల అంత అసహనమెందుకని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ సహా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు కావాలంటూ విద్యార్థులు కోరుతుండటంతోనే అసహనంతో రగిలిపోతున్నారన్నారు. ఇంతటి అజ్ఞానం, అహంకారంతో పాలన కొనసాగించలేరని ఇస్మాయిల్ అన్నారు. విద్యాశాఖ మంత్రిగానూ ఉన్న ముఖ్యమంత్రి మొత్తం విద్యావ్యవస్థను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 27 వేల ప్రభుత్వ స్కూళ్లను 4 వేలకు కుదించాలనే ప్రయత్నాన్ని విద్యార్థులు, మేధావులు, విద్యా వేత్తలు ప్రశ్నిస్తుండటంతోనే సీఎంలో అసహనం పెరిగిపోయిందన్నారు.
విద్యార్థులకు వెంటనే క్షమాపణ చెప్పాలి
విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని ఇస్మాయిల్ డిమాండ్ చేశారు. విద్యార్థులంతా ఫీజు రీయింబర్స్ మెంట్, ఉద్యోగాలు అడుగుతుండటంతో వాళ్లపై కోపం పెంచుకున్నారని అన్నారు. విద్యార్థుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సీఎం మాట్లాడటం సరికాదన్నారు. విద్యావ్యవస్థను సమూలంగా మార్పు చేసి విద్యార్థులు అడిగిన డిమాండ్లను పరిష్కరించటం మీ బాధ్యత కాదా అని ఇస్మాయిల్ ప్రశ్నించారు. విద్యా వ్యవస్థలో మార్పులు చేపట్టాల్సిన ముఖ్యమంత్రి అంత అసహనంగా మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు. వెంటనే విద్యార్థులకు క్షమాపణ చెప్పటంతో పాటు విద్యావ్యవస్థలో మార్పులు తేవాలని ఇస్మాయిల్ డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున తెలంగాణ రక్షణ సేన ఉద్యమిస్తుందని హెచ్చరించారు.








