సింగరేణి కార్మికుల కోసం నిరవధిక నిరాహార దీక్ష

మెడికల్ బోర్డుకు అప్లయ్ చేసుకున్న వారి వారసులందరికీ ఉద్యోగాలివ్వాలి

సింగరేణి లాభాల్లో కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలి

-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ నాయకులతో కలిసి సింగరేణి భవన్ ముట్టడి, ధర్నా

(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) :

 సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు రెండు నెలల్లోగా పరిష్కరించకుంటే హైదరాబాద్ లోని సింగరేణి భవన్ ఎదుట నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులను అన్ ఫిట్ చేయడంతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హెచ్ఎంఎస్, తెలంగాణ రక్షణ సేన నాయకులతో కలిసి సోమవారం లక్డీకాపూల్ లోని సింగరేణి భవన్ ను ముట్టడించారు. గంటకు పైగా నడి ఎండలో రోడ్డుపై బైఠాయించి కార్మికుల కోసం ఆందోళన చేపట్టారు. సింగరేణి యాజమాన్యం దిగివచ్చి తమతో చర్చలు జరిపే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ ఆందోళనతో సింగరేణి భవన్ ఎదుట పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. దీంతో సింగరేణి యాజమాన్యం తరపున అధికారులు బయటికి వచ్చి ఆందోళన చేస్తున్న కల్వకుంట్ల కవిత, హెచ్ఎంఎస్ నాయకులతో చర్చలు జరిపారు. సింగరేణి సీ అండ్ ఎండీ సెక్రటేరియట్ లో సమావేశంలో ఉన్నారని.. ఆయన ఆదేశాల మేరకు తాము చర్చలకు వచ్చామని తెలిపారు. సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కవిత స్పందిస్తూ సింగరేణి యాజమాన్యానికి రెండు నెలల సమయం ఇస్తున్నామని, అప్పటి వరకు పరిష్కారం కాకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సింగరేణిలో మెడికల్ బోర్డుకు అప్లయ్ చేసుకున్న వాళ్లందరినీ అన్ ఫిట్ చేసి వాళ్ల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు నెలల్లోగా ఈ ప్రక్రియ ప్రారంభం కావాలని.. లేదంటే హైదరాబాద్ లోని సింగరేణి భవన్ గేటు ఎదుట నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. దేశానికే వెలుగులిస్తున్న సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని యాజమాన్యం పట్టించుకోవటం లేదని విమర్శించారు. మూడు నెలల క్రితం తాము ఒత్తిడి తెస్తేనే మెడికల్ బోర్డు పెట్టారని.. కానీ మెడికల్ బోర్డుకు అప్లయ్ చేసుకున్న వారిలో 10 శాతం మందిని మాత్రమే అన్ ఫిట్ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత అన్ ఫిట్ కోసం అప్లయ్ చేసుకున్న వాళ్లందరినీ అన్ ఫిట్ చేసి వాళ్ల వారసులకు ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం డిపెండెంట్ ఉద్యోగాలను ఇవ్వకుండా కార్మికులను ఇబ్బంది పెట్టే పనిచేస్తుందన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు మీరు వేసే భక్షం కాదు, అది కార్మికుల హక్కు అని చెప్పారు. సింగరేణి లాభాల్లో 35 శాతం కార్మికులకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలియాస్ పేర్లతో ఉద్యోగాలు చేస్తున్న వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా విజిలెన్స్ విచారణతో ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఇలా వేధింపులకు గురి చేసి అక్రమంగా ఉద్యోగాల నుంచి తొలగించిన వాళ్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. సింగరేణి బాగుంటేనే తెలంగాణ బాగుంటుందని.. తెలంగాణకు సింగరేణి ఆత్మవంటిదన్నారు. అలాంటి సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ పోరాటం చేస్తుందన్నారు. సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం రూ.60 వేల కోట్లు బకాయిలు పెట్టటంతోనే సంస్థ ఇబ్బందుల్లో ఉందన్నారు. వెంటనే ఆ బకాయిలను చెల్లించి సంస్థను కాపాడాలని డిమాండ్ చేశారు. 

సింగరేణి ద్రోహుల చేతిలో ఉంది-రియాజ్ అహ్మద్

సింగరేణి సంస్థ ద్రోహుల చేతిలో బందీ అయ్యిందని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్ర సంస్థగా ఉండాల్సిన సింగరేణిని మంత్రుల చేతిలో కీలుబొమ్మగా మార్చేశారన్నారు. ఇకనైనా యాజమాన్యం వైఖరిలో మార్పు రావాలని డిమాండ్ చేశారు. డిపెండెంట్ ఉద్యోగాలు సహా కార్మికుల సంక్షేమం కోసం పనిచేయాలని సూచించారు. కొత్త బొగ్గు బావులను ప్రైవేట్ సంస్థలకు కాకుండా సింగరేణి ద్వారా నిర్వహించాలని.. నైనీ బ్లాక్ లో కూడా సింగరేణి నుంచి కార్మికులను నియమించాలన్నారు.