కరవుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
వరుణయాగం చేసి ప్రజల ఖర్మ అన్నట్లుగా వదిలేశారు
కరవు, రైతు సమస్యలపై ప్రత్యేక కేబినెట్ ఏర్పాటు చేయాలి
రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందే
దక్షిణాది రాష్ట్రాలను కరవు నుంచి ఆదుకోకపోతే ప్రధాని మోడీని ప్రజలు క్షమించరు
పేపర్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలే క్షేమం
-తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత
(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్)
రాష్ట్రంలో కరవు ఏర్పడ్డానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాష్ట్రంలో ఏర్పడ్డ కరవు పరిస్థితిని ఎదుర్కొనేందుకు రైతుల సమస్యలు తీర్చేందుకు ప్రత్యేక కేబినెట్ సమావేశం పెట్టాలని డిమాండ్ చేశారు. ఎండలు కూడా విపరీతంగా పెరిగే పరిస్థితి ఉందని చెబుతున్నారని.. ఆ పరిస్థితిని తట్టుకునేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణసేన ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరవు పరిస్థితులు చూస్తుంటే కడుపు తరుక్కుపోతున్నదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లో కరవు తాండవిస్తున్నదని, భూగర్భ జలాలు కొన్ని చోట్ల 20 మీటర్ల లోతుకు పడిపోయాయని వెల్లడించారు. చాలా చోట్ల రైతన్నలు తమ పంటలు కాల్చుకుంటున్న దైన్యస్థితిని చూస్తున్నామన్నారు. జులైలో 1 శాతం తక్కువ వర్షపాతం నమోదైతే ఆగస్ట్ లో 38, సెప్టెంబర్ 30 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని వివరించారు. ఈ ఏడాది సూపర్ ఎల్ నినో ఉంటుందని ఆరు నెలల ముందే సైంటిస్టులు ప్రపంచాన్ని హెచ్చరించారని కవిత గుర్తు చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏనాడూ కనీసం రివ్యూ చేసి పరిస్థితిని తెలుసుకున్న పాపాన పోలేదని విమర్శించారు.
నీటి పారుదల, అగ్రికల్చర్, పవర్ మినిస్ట్రీలతో ముఖ్యమంత్రి సమీక్ష చేయాల్సింది పోయి పట్టించుకోలేదని దుయ్యబట్టారు. నాగార్జున సాగర్ కు పోయి వరుణయాగం చేసి దేవుడు వానలు కురిపిస్తే కురిపించినట్లు లేకుంటే మీ ఖర్మ అన్నట్లు వదిలేశాడని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఇప్పటికీ కోటి 20 లక్షల ఎకరాల పంట ఉందని, నవంబర్ వరకు ఆ పంటలకు సంపూర్ణంగా కరెంట్ ఇస్తేనే ఆ పంటలు బతుకుతాయని తెలిపారు. కరెంట్ ఉంటేనే బోర్ల ద్వారా రైతులు పంటలను కాపాడుకునే పరిస్థితి ఉందని కవిత తెలిపారు. కానీ రాష్ట్రంలో ఏ ఊళ్లో కూడా 6 నుంచి 7 గంటలు కూడా విద్యుత్ సరఫరా కావటం లేదని ఆరోపించారు.
ముఖ్యమంత్రి సొంతూరు కొండారెడ్డిపల్లిలో కూడా 7 గంటలు కరెంట్ వస్తలేదని చెప్పారు.
మీరు అడుక్కుంటారో, కొనుక్కుంటారో మాకు తెలియదు.. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందేనని డీమాండ్ చేశారు.
కేంద్రం ఆదుకోవాలి
మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ తర్వాత కరవు మండలాలను ప్రకటిస్తారని భావించామని కవిత అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలు కరవు మండలాలను ఇప్పటికే ప్రకటించాయని గుర్తు చేశారు. కరవు మండలాలను ప్రకటిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం అందే అవకాశం ఉంటుందని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం కరవు ఉందని చెబితే కేంద్రం నుంచి వచ్చే బృందాలు విజిట్ చేసి సాయం చేయటం కష్టమైన పనని చెప్పారు. కనీసం కరవు మండలాలను కూడా గుర్తించలేని అచేతన స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. రైతులను, పంటలను ఆదుకునేందుకు కచ్చితంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. కరవుతో అల్లాడుతున్న మహారాష్ట్ర సహా దక్షిణాది రాష్ట్రాలను ఆదుకోవాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో కేంద్రం సాయం చేయకపోతే కచ్చితంగా ప్రజలు క్షమించరని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేంద్రం రూపాయి కూడా ఎక్కువ సాయం చేయలేదని.. ఇప్పుడైనా తెలంగాణను ఆదుకోవాలని కోరారు. చాలా రాష్ట్రాల్లో అధికంగా కరెంట్ ఉత్పత్తి జరుగుతున్నదని, ఆ కరెంట్ ను దక్షిణాది రాష్ట్రాలకు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుణయాగం అంటూ రాష్ట్రాన్ని అచేతన స్థితిలో పెట్టారని.. మీరైనా ఆదుకోవాలంటూ ప్రధానిని కోరారు. కరెంట్ సప్లయ్ లేకపోవటం కారణంగా కూరగాయలు సహా అన్ని నిత్యవసరాల ధరలు పెరుగుతున్నాయని చెప్పారు.
సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అప్పు కట్టకపోవటంతో కరెంట్ సప్లయ్ ఇబ్బంది అవుతుందని తాము గతంలోనే చెప్పామని గుర్తు చేశారు. ఇప్పుడు సింగరేణి కరెంట్ ను వేరే రాష్ట్రాలకు అమ్ముతున్నదని, అప్పుడే బకాయిలు చెల్లించి ఉంటే ఇవ్వాళ ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. గతంలో తాము చెప్పిన అన్ని అంశాలను బేరీజు వేసి చూస్తే ఈ ప్రభుత్వం ఎంత అసమర్థ ప్రభుత్వమో అర్థమవుతుందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే 60 శాతం మంది రైతులు ఆగమయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
తాగునీటికీ కటకట
వర్షాభావంతో ఈ సమస్య ఇక్కడితోనే అయిపోదని, రానున్న రోజుల్లో తాగునీటి సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉందని కవిత చెప్పారు. ఇప్పటికే అన్ని రిజర్వాయర్లలో నీళ్లు డెడ్ స్టోరేజీకి చేరాయని తెలిపారు. కనీసం కృష్ణాజలాలను కాపాడుకునేందుకు కూడా ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదని చెప్పారు. మన నీళ్లను మహబూబ్ నగర్ నుంచి కుప్పం తరలిస్తున్నా ముఖ్యమంత్రి పట్టించుకోలేదని విమర్శించారు. నార్లపూర్ రిజర్వాయర్ కు కొంత ఖర్చు చేసి ఉంటే ఇప్పుడు గ్రౌండ్ వాటర్ ఉండేదని అభిప్రాయపడ్డారు. కల్వకుర్తి పూర్తి కెపాసిటీతో నీళ్లను నింపుకునే అవకాసం ఉండేదన్నారు. కానీ మూడేళ్లలో ఆ చిన్న పని కూడా చేయలేకపోయారని ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. కానీ ఇప్పుడు కర్ణాటకను అడిగి నీళ్లు తెస్తున్నామని బిల్డప్ ఇస్తున్నారని, ఓ పక్క బిల్డప్ లు ఇస్తూనే మరోపక్క చంద్రబాబు కు నీళ్లను గిప్ట్ ప్యాక్ చేసి పంపిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలను ప్రభుత్వానికి తెలిపేందుకు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంఛార్జీలు ప్రతి గ్రామానికి వెళ్తారని కవిత చెప్పారు. కరవు సమస్యలను ప్రభుత్వానికి తెలిపేందుకు తాము ప్రత్యేక కార్యాచరణ చేపడతామని వెల్లడించారు. అదే విధంగా భవిష్యత్తులో స్కూళ్లలో బాత్ రూములు, కనీస సౌకర్యాలు ఉన్నాయో లేదా అన్న దానిపై కూడా పరిశీలనకు పార్టీ బృందాన్ని నియమిస్తామని తెలిపారు.
ఆపరేషన్ కోడ్ బ్లూ
ఆపరేషన్ కోడ్ బ్లూ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటళ్లలో పరిస్థితులను టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలుసుకుంటున్నారని కవిత చెప్పారు. భూపాలపల్లి హాస్పిటల్లో సీలింగ్ కూలిన ఘటనను తామే వెలుగులోకి తెచ్చామని చెప్పారు. రిమ్స్ సంఘటనపై తాము పోరాటం చేస్తే ప్రభుత్వం అదే రోజు రూ.11 కోట్లు రిలీజ్ చేసిందని గుర్తు చేశారు. భూపాలపల్లి ఘటనకు సంబంధించి వీడియో తీసిన మా పార్టీ కార్యకర్తను పోలీసులు బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న వాళ్లను బెదిరించటం కాకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్న వాళ్లపై చర్యలు తీసుకునేలా పోలీసులు పని చేయాలని సూచించారు. 317 జీవో బాధితులను ఈ ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నదని కవిత చెప్పారు. రూపాయి ఖర్చు లేకుండా తీర్చే సమస్యను కూడా మూడేళ్లుగా నానుస్తున్నారని అన్నారు. పైగా ఆందోళన చేస్తున్న టీచర్లను గాంధీ జయంతి రోజు ఈడ్చుకెళ్లి వారిపై లాఠీఛార్జ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ సిద్దాంతాలను పాటిస్తామని చెప్పే కాంగ్రెస్ పార్టీ గాంధీ జయంతి రోజే ఇలా చేయవచ్చా అని ప్రశ్నించారు. 317 బాధితుల్లో పోలీసులు కూడా ఉన్నారని.. వారికోసం కూడా మేమే పోరాటం చేయాల్సి ఉంటుందన్న విషయం అర్థం చేసుకోవాలని చెప్పారు.
పేపర్ బ్యాలెట్లే నయం
ఈవీఎంలు స్థానంలో పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు జరగాలని కవిత సూచించారు. అప్పుడు మాత్రమే పారదర్శకంగా ఎన్నికలు జరగుతాయని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లోనూ పేపర్ బ్యాలెట్ ద్వానే ఎన్నికలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. ఈవీఎంలను మ్యానిపులేట్ చేసే అవకాశం ఉందని అభివృద్ధి చెందిన దేశాలు భావిస్తున్నాయని చెప్పారు. మళ్లీ దేశంలో పేపర్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిగేందుకు టీఆర్ఎస్ పార్టీ తరఫున ఢిల్లీ వరకు వెళ్లి పోరాటం చేస్తామని వెల్లడించారు. సర్ ప్రక్రియలో జరిగిన తప్పిదాలకు సీఈసీ రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం కాదని, టెంపరరీ సొలుష్యన్ కాకుండా వ్యవస్థలో మార్పు వచ్చే విధంగా పర్మినెంట్ సొల్యుషన్ ఉండాలన్నారు.
ఖైరతాబాద్ ఉప ఎన్నికకు ఇంకా సమయం పట్టవచ్చని కవిత అన్నారు. ఖైరతాబాద్ సహా రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికలు అనేవి తమ పార్టీ అజెండా చెప్పుకునేందుకు ఓ అవకాశంగా భావిస్తామన్నారు.








