ఫీజుల పెంపుతో ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల తల్లితండ్రుల్లో ఆందోళన
ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తేవాలి
ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో తెలంగాణ వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి
-తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
(జాగృతి కార్యాలయం, బంజారాహిల్స్)
ఒకేసారి 30 నుంచి 40 శాతం ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రులను ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని.. అందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నిర్వహించి బిల్లు పాస్ చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
బడ్జెట్ స్కూళ్ల బకాయిలు విడుదల చేయాలి
“రాష్ట్రంలో మొత్తం 39,641 స్కూళ్లుంటే అందులో దాదాపుగా 62 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో 27, 581 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 12, 061 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వం పాఠశాలల్లో 24 లక్షల మంది చదువుతుంటే 38 లక్షల మంది ప్రైవేట్ లో చదువుతున్నారు. ప్రైవేట్ లో మళ్లీ 350 స్కూళ్లు స్పెషలైజ్డ్ గా ఉన్నాయి. వాటిల్లో 3 లక్షల మంది చదువుతున్నారు. నారాయణ, చైతన్య లాంటి 1200 కార్పొరేట్ స్కూళ్లు ఉన్నాయి. వాటిల్లో 5 లక్షల మంది చదువుతున్నారు. మిగతా స్కూళ్లలో మిగిలిన విద్యార్థులు చదువుతున్నారు. 236 బడ్జెట్ స్కూళ్లలో 30 వేల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం రూ.42 వేలు ఇస్తున్నది. ఇది మన రాష్ట్రంలోని పాఠశాల విద్యకు సంబంధించిన స్వరూపం. ఐతే ఏప్రిల్ కూడా రాకముందే ప్రైవేట్ స్కూళ్లు 25 నుంచి 30 శాతం ఫీజులు పెంచుతున్నాయి. లక్ష రూపాయలు ఫీజు ఉంటే ఇప్పుడు మరో రూ.30 వేలు భారం పడబోతున్నది. దీనిపై హైదరాబాద్ లో చాలా స్కూళ్ల వద్ద పేరెంట్స్ ధర్నాలు చేస్తున్నారు. పైగా ప్రతినెల ఫీజు తీసుకోవల్సింది పోయి ఒకేసారి 60 శాతం ఫీజు కట్టాలంటూ ఫోర్స్ చేస్తున్నారు. దీని కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారీగా భారం పడే పరిస్థితి వచ్చింది.”

ఫీజు నియంత్రణ బిల్లు తేవాలి
“బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు నియంత్రణ చేయలేదంటూ ఈ ముఖ్యమంత్రి గతంలో విమర్శించారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి ముూడేళ్లు గడుస్తోంది. ఇప్పటి వరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదు. మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో ఒకరిని ఒకరు తిట్టుకోవటానికే సరిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చి ముూడేళ్లైనా ఫీజు నియంత్రణ జరగకపోవటం సిగ్గుచేటు.
స్కూళ్ల ముందు పేరెంట్స్ ధర్నా చేస్తున్న ఈ సమయంలోనైనా ప్రభుత్వంలో కదలిక రావాలి.
అర్జెంటుగా అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నిర్వహించాలి. ఫీజు నియంత్రణ కమిటీని వేయాలి. మొన్నటి విద్యా కమిషన్ రిపోర్ట్ చెత్తగా ఉన్నప్పటికీ అందులో ఒక పాయింట్ బాగుంది. ఏటా ఫీజును 7 నుంచి 8 శాతం పెంచుకోవచ్చని సూచించారు. కనీసం దాన్ని ప్రభుత్వం అమలు చేయాలి. 8 శాతం కన్నా ఎక్కువ ఫీజు పెంచితే కఠిన చర్యలు ఉండాలి. ఒకేసారి 30 నుంచి 40 శాతం పెంపు అంటే పేద, మధ్య తరగతి వాళ్లకు కష్టమవుతుంది. మీరు ఫీజులు పెంచిన విధంగా పిల్లల తల్లితండ్రులకు జీతాలు పెరగవు. ఫీజులు పెంచినప్పటికీ నారాయణ, చైతన్య లాంటి స్కూళ్లలో టీచర్లకు జీతాలు పెంచరు. పీఎఫ్ కూడా ఇవ్వటం లేదు. ప్రైవేట్ టీచర్ల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్లలో ఫుడ్ కూడా బాగుండటం లేదు. మేము డిమాండ్ చేస్తేనే ఫుడ్ సెక్యురిటీ టాస్క్ ఫోర్స్ ను వేశారు. నారాయణ, చైతన్య వంటి స్కూళ్లలో ఒకే దగ్గర పదివేల మందికి ఫుడ్ తయారు చేస్తున్నారు. కొంచెం ఫుడ్ పాయిజన్ అయినా సరే పదివేల మంది విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కార్పొరేట్ స్కూళ్లలో ఫుడ్ శాంపిళ్లను చెక్ చేయాలని డిమాండ్ చేస్తున్నా.”
ప్రైవేటును ప్రోత్సహిస్తున్న సీఎం
“తెలంగాణలోని పలు కార్పోరేట్ స్కూళ్లలో ఫీజులు ఎక్కువ, చదువు తక్కువ అన్నట్లుగా పరిస్థితి ఉంది. లక్ష మంది విద్యార్థులు ఉంటే 100 మందికి మాత్రమే ర్యాంకులు వస్తాయి. వాటిని చూసి మనం ఆగమై మన పిల్లలను ఆయా స్కూళ్లలో చేర్పిస్తాం. ప్రైవేట్ ను నియంత్రించాల్సిన ముఖ్యమంత్రే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటళ్ల ఓపెనింగుకు వెళ్తున్నాడు. అంటే ప్రైవేట్ దోపిడీని ఎంకరేజ్ చేస్తున్నట్లుగా ఆయనే సంకేతాలు ఇస్తున్నాడు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇవ్వాల్సిన 42 వేల రూపాయలు ఇవ్వకపోవటంతో రూ.212 కోట్ల బకాయిలు అయ్యాయి. ఆయా స్కూళ్ల యాజమాన్యాలు పిల్లల వద్ద ఫీజులు వసూలు చేస్తున్నాయి. బీసీల్లో ఆదాయం తక్కువ ఉన్న పిల్లలకు కూడా రూ.42 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. పీఎఫ్, మ్యాచింగ్ గ్రాంట్ కట్టని, ఫుడ్ సరిగా లేని స్కూళ్లలో అధికారులు తనిఖీ చేయాలి. ఫీజు రీయింబర్స్ మెంటుకు సంబంధించి రూ.11 వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. వాటిలో ఇంజినీరింగ్ కాలేజీలకు సంబంధించి రూ.7500 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఫీజులు చెల్లించకపోవటంతో కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు. హైకోర్టు తీర్పు ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. కాలేజీ యాజమాన్యాలు పిల్లల సర్టిఫికెట్ల ను వెంటనే ఇవ్వాలని కోరుతున్నా. మీకు వచ్చే బకాయిలను మీ తరఫున పోరాటం చేసి ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తాం.”
తెలంగాణ వాళ్లకు అవకాశాలివ్వాలి
“కార్పొరేట్ స్కూళ్లు మాత్రమే కాకుండా నార్త్ నుంచి కూడా స్కూళ్లు వస్తున్నాయి. అలెన్, ఎక్స్ లెన్స్, రెజోనెన్స్, ఫిజిక్స్ వాలా అంటూ నార్త్ స్కూళ్లు పెడుతూ వాటిల్లో ఉద్యోగాలు నార్త్ వాళ్లకే ఇస్తున్నారు. తెలంగాణ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వని స్కూళ్లకు ప్రభుత్వం పర్మిషన్లు ఇవ్వవద్దు. అవసరమైతే తెలంగాణ ఉద్యమకారులకు పర్మిషన్లు ఇవ్వండి. వాళ్లైనా బతుకుతారు. అన్ని ప్రైవేట్ స్కూళ్లు బాగాలేవని నేను అనటం లేదు. కొన్ని స్కూళ్లు పిల్లలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాయి. పేరెంట్స్ కు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా వారిని పురుగుల్లా చూస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి. నారాయణ, చైతన్య లాంటి స్కూళ్లు ఏటా రూ.1500 కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. కానీ రకరకాల పేర్లతో ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పైగా ధోబి, ఫుడ్, పుస్తకాలు ఇలా దేనికి కూడా మన వాళ్లకు అవకాశం ఇవ్వటం లేదు. రూ.2 వేల పుస్తకాలకు రూ.15 వేలు వసూలు చేస్తున్నారు. నారాయణ, చైతన్య స్కూళ్ల వాళ్లకు ప్రత్యేకంగా ప్రింటింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఈ విధానాన్ని బీఆర్ఎస్ ఎంకరేజ్ చేసిందని కాంగ్రెస్ కూడా అలానే చేస్తే వారికి పట్టిన గతే వీరికీ పడుతుంది. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రే ఉండటం మన ఖర్మ. ఎన్నికల వరకు విద్యార్థుల అంశాన్ని రేవంత్ రెడ్డి వాడుకున్నాడు. గురుకులాల్లో విద్యార్థులు చనిపోతే కూడా కనీసం రివ్యూ చేయటం లేదు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నన్ను నిజామాబాద్ వరకే పరిమితం చేశారు. అయినప్పటికీ మన తెలంగాణ వాళ్లకు అన్యాయం జరగవద్దని నిజామాబాద్ జిల్లాకు నారాయణ, చైతన్య స్కూళ్లను రానివ్వలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మా జిల్లాకు కూడా ఆ స్కూళ్లు వచ్చేశాయి. ప్రభుత్వ పరంగా ఈ అంశంపై కచ్చితంగా ఒక స్టాండ్ తీసుకోవాలి. స్కూళ్లలో ఎంప్లాయిమెంట్ విషయంలో మన వాళ్లకు అవకాశం వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ స్కూళ్లలో వేలమంది చాలా తక్కువ జీతాలకు పనిచేస్తున్నారు. వారికి అన్యాయం జరగకుండా మేము పోరాటం చేస్తాం. మేము డిమాండ్ చేసిన అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే జాగృతి పక్షాన అన్ని స్కూళ్ల ముందు ధర్నా చేస్తాం.”








