ప్రభుత్వం ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో పేద అమ్మాయిలు చదువుకు దూరమవుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి జాగృతి ఆధ్వర్యంలో మూసారాంబాగ్ లో విద్యార్థులు నిర్వహించిన ర్యాలీలో కవిత పాల్గొని మద్దతు తెలిపారు. మలక్ పేట్ నియోజకవర్గంలో జాగృతి జనంబాట పాల్గొన్న సందర్భంగా కల్వకుంట్ల కవిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు స్కూటీలు, ఫీజు రీయింబర్స్ మెంట్ మొదలైన హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం మోసం చేస్తున్నదని కవిత దుయ్యబట్టారు.

” ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తామని చెప్పి ఇవ్వటం లేదు. ఫీజు రీయింబర్స్ మెంట్ మీద ఆధారపడి చాలా మంది చదువుకుంటున్నారు.

ఇప్పుడు ప్రభుత్వం కారణంగా తల్లితండ్రులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. చాలా మంది స్టూడెంట్స్ పాస్ అవుట్ అయి రెండేళ్లు గడుస్తున్నా వారికి సర్టిఫికెట్స్ ఇవ్వటం లేదు. దీంతో ఉద్యోగావకాశాలు వచ్చినా చేరలేని పరిస్థితి నెలకొన్నది. ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ ల కోసం పెద్ద ఎత్తున విద్యార్థులు కదలి వచ్చారు. ఈ జోష్ తో ప్రభుత్వంపై మరింత గట్టిగా విద్యార్థులు కొట్లాడుతారు. ప్రభుత్వం స్కాలర్ షిప్ లు ఇవ్వకపోతే అమ్మాయిలే ఇబ్బంది పడుతారు. వారినే తల్లితండ్రులు చదువు మానిపిస్తారు. ఇప్పుడిప్పుడే చాలా మంది పెరేంట్స్ అమ్మాయిలను కూడా చదివిస్తున్నారు. ప్రభుత్వం బకాయిలు ఇవ్వకపోతే మొదట నష్టం జరిగేది అమ్మాయిలకే. ముఖ్యమంత్రిని మేమంతా స్కాలర్ షిప్ లు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు మేలు చేయాలి.”









