బ్రిడ్జిల నిర్మాణంలో జాప్యం వల్ల ప్రమాదాలు పెరిగి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అసంపూర్తిగా ఉన్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని తొందరగా పూర్తి చేయాలని కోరారు. మలక్ పేట నియోజకవర్గంలో జాగృతి జనంబాటలో భాగంగా పర్యటిస్తున్న కవిత అసంపూర్తిగా ఉన్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించారు. 

“సైదాబాద్ లో 2020 లో స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఐదేళ్లుగా పనులు మాత్రం ముందుకు పడలేదు. సిటీలో పెండింగులో ఉన్న అన్ని బ్రిడ్జిల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉప్పల్, మేడ్చల్ లో కూడా నెలకు ఐదారు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు.

బ్రిడ్జిల నిర్మాణం అనేది కచ్చితంగా మంచి కార్యక్రమమే. కానీ నిర్మాణంలో ఆలస్యం వల్ల ప్రమాదాలు పెరిగి ప్రాణనష్టానికి కారణమవుతున్నది.

అందుకే ప్రభుత్వం ముందు పెండింగ్ లో ఉన్న బ్రిడ్జిల పనులు పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టాలి. నేషనల్ హైవే వాళ్లకు, జీహెచ్ఎంసీ వాళ్లకు కో ఆర్డినేషన్ ఉండటం లేదు. కో ఆర్డినేషన్ తర్వాత కూడా ల్యాండ్ అక్విజేషన్, డిజైన్ మార్పు వంటి సమస్యలు ఉంటున్నాయి. ఇక్కడ ఎంపీ అసదుద్దీన్, ఎమ్మెల్యే కలిసి కో ఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయించాలి. జనం తరఫున ప్రశ్నించేందుకే జాగృతి ఈ కార్యక్రమాలు పెట్టుకుంది. 

మా పర్యటన ద్వారా కో ఆర్డినేషన్ మీటింగ్ అవుతుందని నమ్ముతున్నాం. ఇక కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది.

ప్రభుత్వం ఆరు గ్యారంటీలను గాలికి వదిలేసింది. వెంటనే వాటిపై దృష్టి పెట్టాలి. ఇచ్చిన హామీలను అమలు చేయాలి.”