42 ఎకరాల్లో విస్తరించి ఉన్న మలక్ పేట మార్కెట్ లో కనీస సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఒకప్పుడు హోల్ సేల్ మార్కెట్ గా హైదరాబాద్ నగరంలోనే వెలుగు వెలిగిన మలక్ పేట మార్కెట్ కు పూర్వ వైభవం రావాలన్నారు. జాగృతి జనంబాటలో భాగంగా కవిత గురువారం మలక్ పేట గంజ్ లో పర్యటించారు. మలక్ పేట్ గంజ్ ను సందర్శించి హమాలీలు, వ్యాపారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

“ఒకప్పుడు పాత హైదరాబాద్ కు కిరాణ సామగ్రి సరఫరాకు ఈ గంజ్ ప్రధాన కేంద్రంగా ఉండే. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున వ్యాపారం జరుగేది. ఇప్పుడు కాస్త తగ్గింది. వేరే మార్కెట్ యార్డులు పెరగటం, ట్రాన్స్ పోర్ట్ సౌకర్యాలు పెరగటంతో వ్యాపారం కాస్త తగ్గింది. అయినప్పటికీ ఇప్పటికీ హైదరాబాద్ లో మలక్ పేట్ గంజ్ పెద్ద మార్కెట్ యార్డ్ గా ఉంది. ఇక్కడి హమాలీల కోసం కేర్ తీసుకోవటం మంచి విషయం.
మన వాళ్ల కన్నా కూడా ఇతర రాష్ట్రాల హమాలీలే ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. ఐతే ఇక్కడ శానిటేషన్ మీద జీహెచ్ఎంసీ వాళ్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. లైట్లు, డ్రైనేజీ వ్యవస్థ బాగుండేలా చర్యలు చేపట్టాలి. ప్యూచర్ లో పెద్ద మార్కెట్ కోహెడకు వెళ్లినప్పటికీ ఇక్కడ కూడా మార్కెట్ ఇలాగే కొనసాగుతుంది.”








