-జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్

ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడవొద్దు, పేర్లు మార్చడంలో కాంగ్రెస్ దిట్ట

గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చితే పేదవాళ్ల జీవితాలు మారవని జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ అన్నారు. పేదవాళ్లను మరింత పేదవాళ్లను చేసే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ఆరోపించారు. గాంధీ పేరు మారిస్తే కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతోందని, కానీ తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని, బతుకమ్మ చీరల పేర్లను మార్చారని ఆరోపించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

” ఉపాధి హామీ పథకం పేరు మార్చటమే కాకుండా దాన్ని నీరుగార్చే పద్దతుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బిల్లు ప్రవేశ పెట్టారు. వంద రోజుల పని దినాలను125 రోజులు చేయడం సంతోషమే. కానీ వంద రోజుల పని ఉన్నప్పుడే పేదలకు పని దొరకలేదు. ఇప్పుడు 125 రోజులు ఎలా పని కల్పిస్తారో చెప్పాలి. ఈ పథకానికి సంబంధించి కేంద్రం 90 శాతం నిధులు ఇస్తే రాష్ట్రం 10 శాతం భరించేది. 

కానీ ఇప్పుడు కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం అంటున్నారు. 40 శాతం భరించాలంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించదు. పేదలకు ఎక్కువ పని రోజులు ఇస్తామని చెప్పి అసలుకే ఎసరు పెడుతున్నారు. 

కచ్చితంగా బీజేపీ చేస్తున్న పని పేదలకు గొడ్డలి పెట్టుగా మారుతుంది. అందుకే గతంలో ఈ పథకం ఎలా ఉందో అదే విధంగా కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 

గాంధీ గారి పేరు మార్చి ఆయనను మరిపించాలనుకుంటే మీ ఖర్మ. గాంధీ గారి పేరు మారిస్తే కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతోంది. కానీ తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని, బతుకమ్మ చీరల పేర్లను మార్చారు. అప్పుడు తెలంగాణ ప్రజలు, మహిళలు బాధపడలేదా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఒకలా, లేదంటే ఒకలానా? ఇదే మీ పాలసీనా అని అడుగుతున్నాం. బతుకమ్మ అంటే ఈ ముఖ్యమంత్రికి నచ్చదా? ఉద్యమంలో లేని, జై తెలంగాణ అనని ఈ ముఖ్యమంత్రికి బతుకమ్మ ఎందుకు నచ్చుతుంది? డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేర్లను కూడా ఇందిరమ్మ ఇళ్లు అని అంటున్నారు. అసలు ఇందిరమ్మతో తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం? కాళేశ్వరం ప్రాజెక్టును కూడా ప్రాణహిత-చెవేళ్లగా పేరు మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పేర్లను మార్చే విషయంలో కాంగ్రెస్, బీజేపీలు తమ వైఖరి మార్చుకోవాలి. లేదంటే రెండు పార్టీలపై జాగృతి తరఫున పోరాటం చేస్తాం.”