ఆలంపూర్ ఆసుపత్రి సందర్శన | (ఆలంపూర్)
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అరకొర వైద్యసేవలతో రోగులు ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాగృతి జనంబాటలో భాగంగా ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ వంద పడకల ఆస్పత్రిని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రోగులు, వైద్య సిబ్బందితో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చడానికి మంజూరైన వంద పడకల ఆసుపత్రి నిర్మాణంలోనూ నాణ్యత లోపించిందని కవిత అన్నారు. నిర్మాణం పూర్తయ్యాక మూడేండ్లు నిరుపయోగంగా ఉంచారని చెప్పారు. స్థానికుల ఒత్తిడితో తెరిచినా సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. తగినంత సిబ్బందిలేరని..ఐనా పరిమితంగా ఉన్న డాక్టర్లు, నర్సులే రోగులు అవసరాలు తీర్చడానికి కష్టపడుతున్నారని కవిత వెల్లడించారు. వంద పడకల దవాఖానాకు కావలసిన పరికరాలేవీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య పరీక్షల కోసం శాంపిళ్లను గద్వాలకు పంపాల్సి వస్తున్నదని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకుని అవసరమైన పరికరాలతో పాటు తగినంత మంది సిబ్బందిని కేటాయించాలని కవిత డిమాండ్ చేశారు.
ఘనస్వాగతం
అంతకుముందు బీచుపల్లి బ్రిడ్జి వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు జాగృతి నాయకులు, నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు స్వాగతం పలికారు. బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శాంతినగర్ లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.














