బాధితులతో సమావేశమైన జాగృతి అధ్యక్షురాలు | (తెలంగాణ జాగృతి కార్యాలయం, బంజారాహిల్స్)
మానసిక పరిపక్వత లేకుండా బతుకు దుర్భరంగా గడుపుతున్న వారికి పెన్షన్ తో పాటు ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. నెల రోజుల్లోగా ప్రభుత్వం స్పందించకపోతే నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. బోయిన్ పల్లి మనో వికాస్ నగర్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ ఎంపవరమెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీస్ (ఎన్ఐఈపీఐడీ) లో శిక్షణ పొందుతున్న ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు వారి తల్లిదండ్రులతో శనివారం కవిత సమావేశమయ్యారు. ఇటీవల జాగృతి జనంబాటలో భాగంగా ఎన్ఐఈపీఐడీని సందర్శించిన కవిత వారితో ప్తెరత్లంయేకంగా సమావేశం కావాలని భావించారు. వారికోసం ఏదైనా చేయాలన్న ఆలోచనతో జాగృతి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మానసికంగా బలహీనులైన వారిని ఆదుకోవలసిన అవసరం ప్రభుత్వంపై ఉందని కోరారు.





పెన్షన్లు ఇవ్వాలి
“మానసిక పరిపక్వత తక్కువగా ఉన్న పిల్లలకు ఏ ప్రభుత్వం వచ్చిన కూడా మేలు జరగలేదు.
మనదేశంలో మానసిక ఎదుగుదల తక్కువగా ఉన్న వారిని దివ్యాంగుల్లో కలపలేదు.
కానీ మేము పార్లమెంటులో పోరాటం చేస్తే 21 రకాల సమస్యలు ఉన్న వారిని కూడా దివ్యాంగులుగా పరిగణించారు. తెలంగాణలో కూడా దివ్యాంగుల తల్లితండ్రులకు ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని నేనే పోరాటం చేసి జీవో వచ్చేలా చేశాను. కానీ దురదృష్టవశాత్తు ఆ జీవో మాత్రం సరిగా అమలు కాలేదు. మూడేళ్ల క్రితం నేను ఎన్ఐఈపీఐడీ గురించి విన్నాను. మానసిక ఎదుగుదల తక్కువ ఉన్నపిల్లల తల్లితండ్రుల బాధలు నాకు తెలుసు. వారికి ఇళ్లు కూడా అద్దెకు దొరకవు. అందుకే వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలిని నా డిమాండ్. అదే విధంగా వారికి పెన్షన్ కూడా ఇవ్వాలి.”
ప్రభుత్వం స్పందించకుంటే నిరాహార దీక్ష
“రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉన్న వారు లక్ష మంది వరకు ఉంటారు. వారందరికీ పెన్షన్ ఇవ్వగలిగే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం పెన్షన్ ఇవ్వలేదంటే వారికి మనసు లేదని అర్థం చేసుకోవాలి. ప్రతి ప్రభుత్వ పథకంలో మెంటల్లీ, ఫిజికల్లీ ఛాలెంజ్ గా ఉన్న పిల్లల పేరెంట్స్ కు ప్రాధాన్యం ఇవ్వాలి. భర్త చనిపోయిన మహిళలు, ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ల విషయంలో ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందుకు కోసం నా వంతుగా శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తా. ముందుగా ప్రభుత్వానికి లేఖలు రాసి ఒక నెల సమయం ఇద్దాం. నెల రోజుల్లో స్పందించకపోతే మాత్రం కచ్చితంగా నేనే నిరాహార దీక్ష చేస్తా. ఇలాంటి వారికి ఇబ్బంది లేకుండా చూడటం ప్రజాప్రతినిధుల బాధ్యత. అదే విధంగా పిల్లలను అవమానించకుండా వారిని గౌరవించే మాదిరిగా ప్రభుత్వం పాలసీ రూపొందించాలి. దివ్యాంగులు, మెంటల్లీ ఛాలెంజ్ పిల్లల కోసం ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి. అయితే వాళ్లు పొలిటికల్ గాను రిప్రజెంటేషన్ ఉండాలని కోరారు. అందుకే మేము జాగృతిలో డిజేబిలిటీ విభాగాన్ని కూడా పెట్టాం. ఈ విభాగం నిత్యం దివ్యాంగుల సమస్యల కోసం పోరాటం చేస్తూనే ఉంటుంది. స్పైనల్ డిజేబిలిటీ ఉన్న వాళ్లను కూడా పెన్షన్లలో కలపాలి. ప్రభుత్వానికి ముందుగా ఒక నెల సమయం ఇద్దాం. తర్వాత పెన్షన్లు, ఇళ్లు ఇచ్చే వరకు ప్రభుత్వం వెంటపడతాం.”








