అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి – 5 గ్రామాలు తెలంగాణలో కలపాలి (భద్రాచలం)
గిరిజనుల అభివృద్ధి కోసం ఇంతవరకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేశారో సీఎం శ్వేతపత్రం రిలీజ్ చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గిరిజనులు, ఆదివాసీలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. జాగృతి జనంబాటలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన కవిత భద్రాచలంలో మీడియా సమావేశం నిర్వహించారు.




కార్పొరేషన్ నిర్వీర్యం
గిరిజన కార్పొరేషన్ లో 30 ఏళ్లుగా రిక్రూట్ మెంట్లు లేవు.
గొత్తి కోయగూడెంలో 72 ఆదివాసీ కుటుంబాలను రోడ్డున పడేశారు. వాళ్లకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి. లేదంటే రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం. కొత్తగూడెంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం మంత్రులు కృషి చేయాలి.
ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలి. అందుకోసం బీజేపీ నేతలు, చంద్రబాబు నాయుడు సహకరించాలి. ఓసీ-2 మైన్ ను ప్రైవేట్ పరం చేసే కుట్రను అడ్డుకుంటాం. సింగరేణి కార్మికుల సమస్యపై జాగృతి నిరంతరం పోరాటం చేస్తుంది. భద్రాద్రి రామాలయానికి రేవంత్ ఇస్తానన్న నిధులు వెంటనే విడుదల చేయాలి. “
నిర్వాసితులకు అన్యాయం
జాగృతి సంస్థ 19 ఏళ్లుగా ప్రజల కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకోటానికి జనంబాట కార్యక్రమం పెట్టుకున్నాం. అన్ని జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటన చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం. వచ్చామా.. పోయామా అన్నట్లు కాకుండా ముందే మా టీమ్ సమస్యలను గుర్తిస్తోంది. దాని గురించి జనం బాట పర్యటనలో తెలుసుకొని సావధానంగా వాటి పరిష్కారానికి కూడా పోరాటం చేస్తున్నాం. ఇప్పటి వరకు 13 జిల్లాలు పర్యటించాం. 14 వ జిల్లాగా కొత్తగూడెం వచ్చాం. కొత్తగూడెం అనగానే చాలా కంపెనీలు, సింగరేణి సంస్థతో ఎంతో అభివృద్ది చెందిందని భావిస్తాం. వాళ్లకు హైదరాబాద్ వచ్చే అవసరమే ఉండదని మేము అనుకుంటాం. కొత్తగూడెం ప్రజలు కూడా చాలా గర్వంగా చెప్పుకునే వాళ్లు.
కానీ అదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ ప్రాంతంలో ట్రైబల్స్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. గిరిజనులకే ఎంపీ, ఎమ్మెల్యే, మున్సిపల్, పంచాయితీ సీట్లు ఎక్కువగా ఉన్నాయి. మొన్నటి పంచాయితీ ఎన్నికల్లో బీసీలకు జీరో శాతం రిజర్వేషన్లు అంటే ఇక్కడ ఎంత ట్రైబల్ జనాభా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ గిరిజన కార్పొరేషన్ మాత్రం నిర్వీర్యం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందో దాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తోంది. గిరిజనుల అభివృద్ది కోసం కార్పొరేషన్ కు కనీసం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఈ భూమి మూలవాసులకు ఒక్క మంచి అయినా చేశామా అన్నది ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. ఆదివాసీలు, గిరిజనుల కోసం ప్రత్యేకంగా బీఈడీ కాలేజ్ ఉంది. కానీ వాళ్ల కోసం ఒక్క ట్రైబల్ డీఎస్సీ కూడా వేయలేదు.
గిరిజనులంటే ఈ ప్రభుత్వాలకు ఎంత నిర్లక్ష్యమో గుత్తి కోయ తాండా వాసులను చూస్తే తెలుస్తుంది. సింగరేణి గనుల విస్తరణ కోసం గుత్తి కోయ తాండా మొత్తాన్ని తీసేశారు. దాదాపు 72 కుటుంబాలకు లక్ష రూపాయలు చేతిలో పెట్టి వాళ్లను పంపించేశారు. అసలు సింగరేణి ఎకరం భూసేకరణ చేసినా సరే పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలి.
కానీ వారు గిరిజనులు అడగలేరని వారికి కేవలం లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గిరిజనులు, ఆదివాసీలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి శ్రద్ధ లేదు.
మణుగూరు థర్మల్ పవర్ స్టేషన్ కారణంగా భూమి కోల్పోయిన వారికి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు?
జల్, జమీన్, జంగల్ అని పోరాడిన గిరిజన, ఆదివాసీలను పట్టించుకోకపోవటం దారుణం. వాళ్ల తరఫున జాగృతి ముందుండి పోరాటం చేస్తుంది. గిరిజనులకు, ఆదివాసీలకు రిజర్వేషన్లు ఉన్నాయని చాలా మంది అంటుంటారు. కానీ రిజర్వేషన్ల ఉద్యోగాలు సాధించే విద్యార్హత, స్కిల్స్ వాళ్లకు నేర్పించమా? గుత్తికోయ తాండా ప్రజలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాల్సిందే. లేదంటే హైదరాబాద్ లోనే ఉన్న రాష్ట్రపతి గారిని కలిసి వారి సమస్యను వివరిస్తాం. కొత్తగూడెంలో ఉన్న ఐటీడీఏ కు నిధులు రావటం లేదు.
ఆదివాసీలు, గిరిజనులను రేవంత్ రెడ్డి, సీతక్క మభ్య పెట్టి అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే శ్వేత పత్రం అంటారు. గిరిజనుల అభివృద్దిపై శ్వేత పత్రం విడుదల చేయాలి. గిరిజనుల విద్య, వారిని ఎంపవర్ చేసేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి. ఒక్క గిరిజనుడినైనా బిజినెస్ మెన్ గా తీర్చిదిద్దారా అని అడుగుతున్నా? గిరిజనుల విషయంలో సింగరేణి కూడా సానుకూలంగా స్పందించాలని కోరుతున్నా. “
ఇల్లందు కళ తప్పిస్తారా
బొగ్గుగనులకు పుట్టినిల్లు ఇల్లందు. అలాంటి ఇల్లందులో మైన్ లను మూసేస్తున్నారు. ఇల్లందును కళ లేకుండా చేస్తున్నారు. అది ఏ ప్రభుత్వం చేసిన అన్యాయమే.
నాగుల్ మీర్ దర్గాకు ఎందరో నాయకులు వచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కానీ అక్కడ కనీసం వాటర్ సౌకర్యం కూడా లేదు. వెంటనే నీళ్ల సౌకర్యం కల్పించాలి.
అక్కడే రామచంద్ర స్వామి టెంపుల్ కూడా ఉంది. దర్గా, ఆలయం అభివృద్ధి పై శ్రద్ధ పెట్టాలి. కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ లో కనీస సౌకర్యాలు లేవు. అవసరమైనంత మంది డాక్టర్లు లేరు. నిజానికి గవర్నమెంట్ టీచర్లు, డాక్టర్లు, ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు ఎక్కువ కష్టపడుతున్నారు. కానీ ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించకపోవటంతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇక్కడున్న ముగ్గురు మంత్రులు ఖమ్మం జిల్లాకు చెందిన వారే కావటంతో కొత్తగూడెం జిల్లాను పట్టించుకోవటం లేదంటున్నారు. కానీ కొత్తగూడెంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చేలా మంత్రులు కృషి చేయాలి. “
మణుగూరు మనుగడ ప్రమాదం
“ఓసీ- 2 గని మీద ఆధారపడి మణుగూరు ప్రజలు ఉన్నారు. కానీ ఆ మైన్ ను ప్రైవేట్ పరం చేస్తామని చెబుతున్నారు. అదే జరిగితే మణుగూరుకు మనుగడ ఉండదు. స్వయంగా సింగరేణి సీఎండీ బలరాం గారే మణుగూరు మైన్ మూసేస్తున్నామని చెప్పారు. దీంతో ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇక్కడి ప్రజల గురించి ప్రభుత్వం ఆలోచించాలి. ఇక సీతారామా పంప్ హౌస్ ను విజిట్ చేశాం. దీని కథ చాలా పెద్దది. ఈ ప్రాజెక్ట్ కొత్తగూడెంలోనే ఉంది. కానీ ఇక్కడ ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రావు. నాగార్జున సాగర్ నీళ్లు వస్తున్న చోటికే సీతారామా ద్వారా నీళ్లు వచ్చేలా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ రూ. 7 వేల కోట్లతో మొదలై 13 వేల కోట్ల నుంచి ఇప్పుడు 19 వేల కోట్లకు చేరింది. ఇక్కడున్న ముగ్గురు మంత్రులు కొత్తగూడెం జిల్లాకు కూడా నీళ్లు వచ్చే ఏర్పాట్లు చేయాలి.
భద్రాచలం చుట్టు ఉన్న ఐదు గ్రామాలను ఏపీ లో కలిపారు.
అసలు ముంపుతో సంబంధం లేని గ్రామాలను ఏపీలో కలపటం అన్యాయం. ఆ ఐదు గ్రామాల ప్రజలు ఏ అవసరమున్నా భద్రాచలం రావలసి ఉంటుంది. కానీ వారికి భద్రాచలంలో ఆరోగ్యశ్రీ వర్తించటం లేదు. కనీసం తక్షణ రిలీఫ్ గా ఆరోగ్యశ్రీ వర్తించేలా చేయాలి. రాముల వారి మాన్యాలు కాపాడుకోవాలంటే పురుషోత్తమ పట్నంలో రిటైన్ వాల్ కట్టాల్సిందే. దీని కోసం బీజేపీ ఎంపీలు, పెద్ద నేతలు ప్రయత్నం చేయాలని కోరుతున్నా. అయోధ్య కన్నా కూడా భద్రాచల రాముల వారి చరిత్రే గొప్పది. స్వయంగా రాముల వారే దర్శనం ఇచ్చిన భద్రాచలం టెంపుల్ ను అభివృద్ధి చేసే మనసు బీజేపీకి రావటం లేదు. ఐదు గ్రామాల సమస్య బీజేపీ నేతలతోనే పరిష్కారమవుతుంది. వాళ్లే వెంటపడి చేయించాలి. చంద్రబాబు నాయుడిని కూడా ఈ సమస్య పరిష్కరానికి కృషి చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా.
ఈ ఐదు గ్రామాలను తెలంగాణకు ఇచ్చేయాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నా. “
దేవుడికిచ్చిన మాట తప్పిన సీఎం
“ఆశ్వారావుపేట పెద్ద వాగు ద్వారా తెలంగాణలో 3 వేల ఎకరాలు, ఆంధ్రాలో 13 వేల ఎకరాలు సాగు అవుతోంది.
కానీ రిపేర్ కు మాత్రం ఏపీ గవర్నమెంట్ పంతానికి పోయి ముందుకు రావటం లేదు. దీంతో తెలంగాణలోని రైతులు ఇబ్బంది పడుతున్నారు. కేవలం రూ. 2 కోట్లతో సమస్య పరిష్కారమవుతుంది. ఒక్కో నియోజకవర్గంలో తిరుగుతుంటే చాలా సమస్యలను ప్రజలు చెప్పారు. పినపాక లో పాలిటెక్నిక్ కాలేజ్, మణుగూరులో బస్ స్టాండ్ కావాలని ప్రజలు కోరుతున్నారు. ప్రసాద్ స్కీం కింద రాముల వారి టెంపుల్ అభివృద్ధికి రూ. 300 కోట్లు ఇ్వవాలి.
భద్రాచలం టెంపుల్ కు రూ. 350 కోట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ 6 గ్యారంటీలు, పెన్షన్లు ఇవ్వకుండా ఎలా మాట తప్పాడో…దేవుడి విషయంలోనూ అలాగే మాట తప్పారు.”
ఎయిర్ పోర్ట్ కావాలి
” ఇటీవల కొత్తగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా గతంలో ఉన్న మైన్స్ స్కూల్ నే ఎర్త్, సైన్స్ యూనివర్సిటీ చేస్తున్నామని చెప్పారు. కానీ రూపాయి కూడా ఇవ్వలేదు. సిబ్బంది లేరు. కోర్సులు లేవు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే మైన్స్ స్కూల్ ను కాకతీయ ఇంజనీరింగ్ యూనివర్సిటీ అని చెప్పి రూపాయి ఇవ్వకుండా మోసం చేసింది. గరిమెళ్ల పాడు నర్సరీ కి పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరముంది. అందుకోసం జాగృతి పోరాటం చేస్తుంది. కిన్నెర స్టీల్ ఏరియాను ఇండస్ట్రీయల్ ఏరియా చేస్తామని రేవంత్ రెడ్డి ప్రామిస్ చేశారు. కానీ మాట నిలుపుకోలేదు. కొత్తగూడెంలో ఎయిర్ పోర్ట్ కు మూడు చోట్ల స్థలాలు చూశారు. కానీ ఎయిర్ పోర్ట్ పనులు మొదలు కాలేదు. కొత్తగూడెంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలంటే ఎయిర్ పోర్ట్ రావాల్సిందే.
కొత్తగూడెం బై పాస్, సేతు వారధిని మంత్రులు సీరియస్ గా తీసుకొని పూర్తి చేయాలి. ఇక సింగరేణి విషయానికొస్తే కొత్త మైన్స్ లేవు. ఉన్న వాటిని మూసేస్తున్నారు. కార్మికులకు ఏమాత్రం ఈ ప్రభుత్వం మంచి చేయటం లేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి తన ఫుట్ బాల్ సరదా కోసం కార్మికుల సొమ్ము పదికోట్లు ఖర్చు చేశారు. “
జర్నలిస్టులను మోసగించిన రేవంత్
“మా కొత్తగూడెం పర్యటన కచ్చితంగా ఇక్కడి ప్రజలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. మేము వస్తున్నామని తెలియగానే ఎన్నో సమస్యలపై అవగాహన కల్పించిన ప్రెస్ మిత్రులకు ధన్యవాదాలు. ప్రజలను మోసం చేసినట్లే రేవంత్ రెడ్డి ప్రెస్ వాళ్లను కూడా మోసం చేశారు. ఎన్నికల్లో గెలవగానే ప్రెస్ వాళ్లకు ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేలా నిలదీసే సమయం వచ్చింది.”








