ఎయిమ్స్ ను సందర్శించిన జాగృతి అధ్యక్షురాలు, ట్రిపుల్ ఆర్ రైతులకు అన్యాయం చేయొద్దు | (బీబీనగర్)
ఎయిమ్స్ లాంటి ప్రతిష్ఠాత్మక దవాఖాన తెలంగాణకు మంజూరైతే దాన్ని పూర్తి చేయించుకునే శ్రద్ధ ఇక్కడి ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అత్యవసర వైద్యానికి కూడా మందులు అందుబాటులో లేవని చెప్పారు. జాగృతి జనంబాటలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన కవిత మంగళవారం బీబీనగర్ ఎయిమ్స్ ను సందర్శించారు. అనంతరం
రాయగిరిలో ట్రిపుల్ ఆర్ నిర్వాసితులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.







ఎయిమ్స్ ను వెంటనే పూర్తి చేయాలి
“ఇప్పటి వరకు 16 జిల్లాల్లో పర్యటించాం. మా చొరవతో చాలా సమస్యలు పరిష్కారమవుతుండటం సంతోషం. ఎయిమ్స్ ను సందర్శించి పరిశీలిస్తే ఇక్కడ ఎమర్జెన్సీ మందులు కూడా లేవు.
2014-2015 లో మేము పార్లమెంట్ లో పట్టుబట్టి తెలంగాణకు ఎయిమ్స్ వచ్చేలా చేసుకున్నాం. మొదటి బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఇది. నిమ్స్ ను మనం ఎయిమ్స్ చేసుకున్నాం. 2016 లో ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ కూడా ఇక్కడ ఎమర్జెన్సీ మందులు లేవు.
యాక్సిడెంట్ అయి ఇక్కడకు వస్తే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. కేంద్రం నుంచి రూ. 750 కోట్లు వచ్చినప్పటికీ కాంట్రాక్టర్ ఆలస్యం చేస్తున్నాడని చెబుతున్నారు. ఇంతమంచి ఇన్ స్టిట్యూట్ వచ్చినప్పుడు దాన్ని పూర్తి చేయించుకునే బాధ్యత మనదే.
ఇక్కడి ఎమ్మెల్యేలు, మంత్రులు కాంట్రాక్టర్ తో మాట్లాడి ఎయిమ్స్ ను పూర్తి చేయాలి.”
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం రైతులకు అన్యాయం
“భువనగిరిలోని రాయగిరి ప్రజల పరిస్థితి అన్యాయంగా తయారైంది.
ఇప్పటి వరకు వాళ్లు ఆరేడు ప్రాజెక్టుల కోసం భూమిని ఇచ్చి ఎంతో త్యాగం చేశారు. ఎలాగూ భూమి ఇస్తున్నారని ట్రిపుల్ ఆర్ కోసం కూడా వాళ్ల భూములు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే ఈ ఆలైన్ మెంట్ మూడు సార్లు మారింది. దీని వెనుక చాలా అవినీతి జరిగింది. ఎమ్మెల్యేలు వాళ్ల భూములు కాపాడుకోవటం కోసం ఆలైన్ మెంట్ మారుస్తున్నారు. ట్రిపుల్ ఆర్ ఆలైన్ మెంట్ మార్పిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజలకు మాటిచ్చారు. ప్రజలకు న్యాయం చేస్తారా లేదా అన్నది క్లారిటీ ఇవ్వాలి. ప్రియాంక గాంధీని కూడా తీసుకొచ్చి ఇక్కడి ప్రజలకు మాట ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ రైతులకు బేడీలు వేశారు. అప్పుడు నేను బీఆర్ఎస్ లోనే ఉండి మీకు ఏమీ చేయలేకపోయినందుకు నన్ను క్షమించండి. ఈ విషయం నా దృష్టికి రాలేదు. వచ్చి ఉంటే కచ్చితంగా మీకోసం పోరాటం చేసేదాన్ని. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ భూముల కోసం రైతుల భూములను బలి చేయటం దుర్మార్గం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ దుర్మార్గాన్ని కొనసాగిస్తుందా? చెప్పాలి? ఇక్కడ రైతులు భూములు ఇచ్చేదే లేదని చెబుతున్నారు. ప్రియాంక గాంధీ గారు వచ్చి ఇచ్చిన మాటను రేవంత్ సర్కార్ నిలబెట్టుకోవాలి.”








