జంగారెడ్డి గూడెంలో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం పేదల భూములు బలవంతంగా గుంజుకుంటున్నారని తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాగృతి జనంబాటలో భాగంగా ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసిత రైతులతో సమావేశమయ్యారు. మూడు సార్లు ట్రిపుల్ ఆర్ కోసం అలైన్మెంట్ మార్చి పెద్దవాళ్ల భూములు కాపాడటానికి తమ భూములు లాక్కుంటున్నారని రైతుల కవితకు మొర పెట్టుకున్నారు.
నిర్వాసిత రైతులకు అండగా ఉంటానని కవిత హామీ ఇచ్చారు.


రైతుల పొట్ట కొట్టొద్దు
“ట్రిపుల్ ఆర్ కోసం మొదట శాటిలైట్ సర్వే చేసి కొండలు, సాగుయోగ్యం కాని భూముల నుంచి అలైన్మెంట్ ఖరారు చేశారు.. అప్పుడు కొంత మేరకు సాగు భూములు కూడా సేకరించాలని నిర్ణయించారు. కొందరు పెద్దల భూములను తప్పించడానికి మళ్లీ మళ్లీ సర్వే చేసి వారి భూములు తప్పించారు.. ట్రిపుల్ ఆర్ కోసం ఇది మూడో అలైన్మెంట్.. ఇక్కడి చిన్న రైతులకు ఉన్న కొద్దిపాటి భూములను ట్రిపుల్ ఆర్ పేరుతో లాక్కున్నారు. ట్రిపుల్ ఆర్ భూముల సమస్య మొత్తం 8 జిల్లాల్లో ఉన్నది.. 50 ఎకరాలు ఉన్న రైతుకు ఐదు ఎకరాలు పోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు.. చిన్న రైతుల భూములు పోతే వాళ్లు జీవనోపాధి కోల్పోతారు.. దాన్ని మనమందరం వ్యతిరేకించాలి. జంగారెడ్డిగూడెంతో పాటు సమీప గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళనకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. జనవరి 5న ట్రిపుల్ ఆర్ తో నిర్వాసితులయ్యే 8 జిల్లాల రైతులతో హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఆ తర్వాత 8 జిల్లాల రైతులను తీసుకొని ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుస్తాం. పట్టణాలను బైపాస్ చేస్తూ రింగ్ రోడ్డు వెళ్ళాలి.. కానీ సెన్స్ లేకుండా భువనగిరి మధ్య నుంచి చౌటుప్పల్ మధ్యలో నుంచి ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఖరారు చేశారు.. అది ఎట్లా రింగ్ రోడ్డు అయితది. రాజకీయాలతో సంబంధం లేకుండా తప్పు ఎవరు చేసినా తప్పు అనే చెప్తాం.. మీ అందరితో కలిసి నడుస్తాం.”










