ఫోన్ ట్యాపింగ్ విచారణ అనేది గుంపుమేస్త్రీ, గుంటనక్క ఆడుతున్న డ్రామా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత ఆరోపించారు. గుంపు మేస్త్రీ, గుంటనక్క కలిసే ఉన్నారని, నా లాంటి బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని స్పష్టం చేశారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.
“బీసీలకు గ్రామపంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్యాయం చేసింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ 42 శాతం రిజర్వేషన్ మాట ఎత్తకుండానే ముందుకు వెళ్తోంది. ఈ విషయాన్ని బీసీలు ప్రశ్నించకుండా ఉండేందుకు గుంపుమేస్త్రీ, గుంటనక్క కలిసి డ్రామా చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో కావాలనే ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. గుంపు మేస్త్రీ, గుంటనక్క కలిసే ఉన్నారు. ఈ విచారణ ద్వారా ఏమీ జరగదు. నాలాంటి బాధితులకు ఏమాత్రం న్యాయం జరిగే అవకాశం లేదని నాకు తెలుసు. మున్సిపల్ ఎన్నికలు పట్టణాల్లో జరుగుతాయి కనుక ప్రజలను డైవర్ట్ చేయటానికే ఈ డ్రామా. అసలు బీసీల కోసం బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించటం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడ కూడా 42 శాతం రిజర్వేషన్లు రావటం లేదు. కాంగ్రెస్ బీసీలకు న్యాయం చేయాలన్న విషయాన్నే ఆలోచించటం లేదు. కచ్చితంగా ఈ రెండు పార్టీలు బీసీలను మోసం చేస్తున్న విషయాన్ని ప్రజలు గ్రహించాలి. మున్సిపల్ ఎన్నికలకు తొందరేమీ లేదు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు వెళ్లాలి. మెజార్టీగా ఉన్న ప్రజలకు రాజ్యాధికారం ఉన్నప్పుడే న్యాయం జరుగుతుంది.
జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా అవతరించలేదు. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, యువత, మహిళలు ఎవరైనా మమ్మల్ని సంప్రదిస్తే వారికి మద్దతిస్తాం. నాతో పాటు జాగృతి నాయకులు వారి కోసం ప్రచారం నిర్వహిస్తాం.

రాజకీయాల్లోకి రావాలనుకునే యువత, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మున్సిపల్ ఎన్నికలు ఉపయోగించుకోండి. రాజకీయ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు మీకు ట్రైనింగ్ గా ఈ ఎన్నికలు ఉపయోగపడతాయి. యువత, మహిళలు, బీసీలు, ఎస్సీ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నా. బీసీ బిడ్డలను కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేస్తోంది. సికింద్రాబాద్ జిల్లా కావాలని అడిగిన వాళ్లను గత పదేళ్లలో బీఆర్ఎస్ అణిచివేసింది. కానీ ఇప్పుడు మాత్రం సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లా కావాలని కేటీఆర్ అడగటం విచిత్రంగా ఉంది. జిల్లాల పునర్విభజన అనేది ఇప్పుడు జరగటం సాధ్యం కాదు. కానీ ఎప్పుడు పునర్విభజన జరిగినా సరే సికింద్రాబాద్ ను జిల్లా చేయాల్సిందే. అదే విధంగా మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు పేరును ఏదైనా ఒక జిల్లాకు పెట్టాలి. మొన్నటి కులగణనలో బీసీలకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసింది. బీసీ కులాల లెక్కను తక్కువ చేసి చూపించి మోసం చేసింది. ఐతే కేంద్రం చేయనున్న కులగణన ద్వారా కాంగ్రెస్ చేసిన మోసాన్ని బయటపెట్టే అవకాశం మనకు వచ్చింది. ఈ విషయంలో బీసీలు, బీసీ మేధావులు ఆలోచించాలి. జాగృతి తరఫున బీసీల విషయంలో ఒక ముందడుగు వేస్తున్నాం. కులగణనలో పద్మశాలి సామాజిక వర్గం ఉంటే అందులో ఉండే ఉపకులాలను చూపిస్తూ తక్కువ గా చూపిస్తారు. కానీ జాగృతి తరఫున మేము ప్రతి కులానికి సంబంధించిన సమాచారం సేకరిస్తాం. బీసీలకు అన్యాయం జరగకుండా నివేదిక సిద్ధం చేస్తాం. త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం కూడా మేము నిర్వహిస్తాం. మా ప్రయత్నం నచ్చితే బీసీలు, బీసీ మేధావులు మాతో కలిసి పనిచేయండి. బీసీ కులాల పేర్లు, ఉపకులాలకు అన్యాయం జరగకుండా మేము అధ్యయనం చేస్తున్నాం. నిజానికి ప్రభుత్వమే ఈ పనిచేయాలి. కానీ గుంపు మేస్త్రీ మీద నాకు నమ్మకం లేదు.”








