అండమాన్ నికోబర్ దీవులకు ఆజాద్ హిందూ పేరు పెట్టాలని తెలంగాణ జాగృతి అధినేత్రి, మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను గౌరవిస్తూ అండమాన్ దీవులకు ఆ పేరు పెట్టాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎప్పటి నుంచో  కోరుతున్నదని గుర్తు చేశారు. జాగృతి కూడా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ల డిమాండ్ ను సపోర్ట్ చేస్తోందని స్పష్టం చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతలు జోజిరెడ్డి, ఆర్వీఆర్ ప్రసాద్, తేజ్ దీప్ రెడ్డితో కలిసి జాగృతి అధ్యక్షురాలు నివాళి అర్పించారు. నేతాజీ ఫొటోకు పూలమాల వేసి ఆయన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. పేరు మార్పును కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ నెల 26 న ట్విట్టర్ లో హాష్ ట్యాగ్ మూమెంట్ ను నడిపిస్తామని కవిత వెల్లడించారు. జాగృతి నెట్ వర్కుతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ డిమాండ్ వచ్చేలా చేస్తామని చెప్పారు. నిజానికి అండమాన్ నికోబార్ పేరును బ్రిటీష్ వాళ్లు పెట్టారని తెలిపారు. వారి పేర్లను కొనసాగించకుండా మన వీరుడి పేరు ఆ ఐలాండ్ కు పెట్టాలన్నారు. బీజేపీ ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ గౌరవార్థం జనవరి 26 న అండమాన్ పేరు మార్చుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Telangana Jagruthi tribute to Netaji Subhas Chandra Bose

స్వాతంత్రం కావాలంటే అది ఇస్తే రాదు, తీసుకోవాలని నేతాజీ దేశప్ఆరజలను చైతన్య పరిచారని చెప్పారు. యువత రక్తాన్ని ఇస్తే నేను స్వాతంత్రాన్ని తెస్తానని చెప్పారన్నారు. చాలా ఉన్నతమైన కుటుంబంలో పుట్టి మంచిగా స్థిరపడినప్పటికీ ఆయన స్వాతంత్ర్య పోరాటం చేశారని కవిత తెలిపారు. తండ్రి కోసం ఐఏఎస్ కూడా అయ్యారని, అప్పట్లోనే ఆరు పోస్టులకు గాను నాలుగో ర్యాంక్ తెచ్చుకున్నారని వివరించారు. కానీ ఐఏఎస్ గా ఉండి బ్రిటీష్ వాళ్ల కోసం నా దేశ పౌరులను ఇబ్బంది పెట్టలేనన్న ఆలోచనతో ఐఏఎస్ ను వదిలేసి అజాద్ హిందూ ఫౌజ్ ను ఏర్పాటు చేశారని చెప్పారు. 

దేశం బయటకు పంపించిన తర్వాత కూడా బయట ఉండి స్వాతంత్ర్య పోరాటం చేశారని తెలిపారు. ఆవేశం మాత్రమే కాకుండా దౌత్యపరంగా కూడా చాలా తెలివిగా పనిచేశారని గుర్తు చేశారు. దేశం బయట ఉండి కూడా బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టారన్నారు. 

సైన్యంలో మహిళలకు ప్రాధాన్యం

లక్ష్య శుద్ధి, చిత్త శుద్ధి ఉన్న నాయకులంతా కూడా నేతాజీని స్ఫూర్తిగా తీసుకోవాలని కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు మహిళలు రోడ్లు ఎక్కితే గానీ మాకు ఇచ్చే 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదని,  కానీ ఆ రోజుల్లో ఝాన్సీ లక్ష్మీబాయి పేరుతో మహిళలకు సైన్యంలో నేతాజీ అవకాశం ఇచ్చారన్నారు. మహిళలకు గన్ ఇచ్చి పోరాటం చేయాలని ఆయన ధైర్యం చెప్పారని కవిత తెలిపారు. నేతాజీ మన దేశం గర్వించదగ్గ మన సంపద అని, ఆయన స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చే ముందు అప్పటి బ్రిటీష్ ప్రధాని అట్లీ సైతం నేతాజీ గొప్పతనాన్ని వివరించారని కవిత తెలిపారు. నేతాజీ ఏర్పాటు చేసిన అజాద్ హిందూ ఫౌజ్ కూడా మమ్మల్ని భయపెట్టిందని అట్లీ అన్నారని తెలిపారు. అలాంటి గొప్ప నాయకులను గౌరవించుకునేలా ఆయన పేరును అండమాన్ దీవులకు పెట్టుకోవాలని కవిత కోరారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చుతామని బీజేపీ చెప్పిందని, కానీ అది రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్లు టెంపరరీగా హడావుడి చేశారని విమర్శించారు. నేతాజీ లాంటి నాయకుల లెగసీని కాపాడుకునేందుకు కచ్చితంగా అండమాన్ నికోబార్ దీవులకు అజాద్ హిందూ పేరు పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు.