సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సంబంధించిన సన్నాహక సమావేశం ఆదివారం తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడింది. ఈ సమావేశానికి బంజారా జాగృతి రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ నాయక్ అధ్యక్షత వహించగా, తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ జయంతిని ఏ విధంగా ఘనంగా జరుపుకోవాలి అనే అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా సేవాలాల్ మహారాజ్ ఆశయాలను, త్యాగాలను, సామాజిక విలువలను బంజారా ప్రజలలో బలంగా తీసుకెళ్లడం, యువతలో చైతన్యం కలిగించే కార్యక్రమాలు నిర్వహించడం, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడే విధంగా వేడుకలను రూపకల్పన చేయడం వంటి అంశాలపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో సేవాలాల్ మహారాజ్ బోధించిన ఐక్యత, న్యాయం, ధర్మం, సామాజిక సమానత్వం వంటి విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా తెలంగాణ జాగృతి, బంజారా జాగృతి కలిసి సమష్ఠిగా పని చేయాలని నిర్ణయించారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని కేవలం ఒక వేడుకగా కాకుండా, ఒక సామాజిక చైతన్య ఉద్యమంగా మార్చే విధంగా కార్యక్రమాలు రూపొందించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ జాగృతి, బంజారా జాగృతి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









