గుంపు మేస్త్రికీ ప్రధాన గూఢచారిగా పని చేసి నిజమైన ఉద్యమకారులకు ద్రోహం చేసిందే సంతోష్ రావని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మాజీ ఎంపీ సంతోష్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కోసం పిలిచిన నేపథ్యంలో కవిత స్పందించారు. 

కేసీఆర్ కు దూరం చేశాడు

“బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు దూరం కావటానికి కారణం సంతోష్ రావు. 

గద్దర్ లాంటి నాయకులు గంటలు గంటలు గేట్ బయట వేచి చూడటం, ఈటల లాంటి వారు బయటకు రావటానికి కూడా ఈ సంతోష్ రావే కారణం. కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో సగం ఇడ్లి తిన్నారా.. పూర్తిగా ఇడ్లి తిన్నారా అన్న సమాచారాన్ని కూడా గుంపు మేస్త్రీకి చేరవేసేది సంతోష్ రావే. గుంపుమేస్త్రికి ప్రధాన గూఢచారి సంతోష్ రావు. అందుకే ఆ గూఢచారిని శిక్షిస్తాడని నేను నమ్మటం లేదు. సంతోష్ రావును సిట్ పిలవటం మంచిదే. కానీ ఆయనకు శిక్ష పడటం అనుమానమే. ఇటువంటి దుర్మార్గుడికి కేటీఆర్, హరీష్ రావు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్థం కావటం లేదు. నేను గతంలో చెప్పిన దయ్యాల్లో మొదటి దయ్యమే సంతోష్ రావు. నిజంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే కచ్చితంగా ఈ దుర్మార్గుడికి శిక్ష పడుతుంది. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసులు తమ పని తాము చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కోసారి మన నీడ కూడా మన కళ్లను కప్పే పరిస్థితి వస్తుంది. ఉద్యమకారులను కేసీఆర్ కు దూరం చేసిన పాపం కచ్చితంగా ఈ దుర్మార్గుడికి తగులుతుంది.”