సౌమ్య కుటుంబానికి జాగృతి అండ | నిమ్స్ హాస్పిటల్, హైదరాబాద్.
ప్రభుత్వ ఉదాసీనత కారణంగానే రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతున్నదని తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీగా చేస్తామన్న హామీ నిలబెట్ట్టుకోలేకపోయిందని విమర్శించారు. నిజామాబాద్ లో గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను, ఆమె కుటుంబ సభ్యులను మంగళవారం హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. సౌమ్య కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

స్కూళ్లలో కూడా డ్రగ్స్ ప్రవేశించాయి
“నిజామాబాద్ కు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను చూశాను.. ఆమె పరిస్థితి కొంచెం క్రిటికల్ గా ఉన్నప్పటికీ కాస్త ఇంప్రూమెంట్ ఉంది. ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ ను చంపే ధైర్యం గంజాయి బ్యాచ్ చేసిందంటే ప్రభుత్వం అంటే వారికి ఏ మాత్రం భయం లేదని స్పష్టమవుతున్నది. రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి ఫ్రీ చేస్తామని ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ దురదృష్టమేమిటంటే గ్రామాల్లో కూడా విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ దొరికే పరిస్థితి వచ్చింది. స్కూల్ లోకి కూడా గంజాయి, డ్రగ్స్ తీసుకొచ్చి పిల్లలను పాడు చేస్తున్నారు. దీని కారణంగా మా ఆడవాళ్లే బాధితులుగా మారే పరిస్థితి ఉంటుంది. గృహహింస ఘటనలు జరగటానికి డ్రగ్స్, గంజాయి కారణమవుతున్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మత్తు వదిలి డ్రగ్స్, గంజాయి మాఫియాపై వారి ప్రతాపం చూపాలి. అదే విధంగా ఎక్సైజ్, ఫారెస్ట్ సిబ్బందికి వెపన్స్ ఇవ్వాలి. వాళ్లకు ట్రైనింగులో గన్ ఫైరింగ్ ఉంటుంది. కానీ వెపన్స్ ఇవ్వటం లేదు. వారి వద్ద వెపన్స్ ఉంటే గంజాయి, డ్రగ్స్ మాఫియాకు కాస్త భయం ఉంటుంది. డ్రగ్స్, గంజాయి మహమ్మరిని తరిమికొట్టేందుకు జాగృతి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి. డ్రగ్స్, గంజాయి ముఠాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. సౌమ్య కుటుంబానికి జాగృతి తరఫున అండగా ఉంటాం.”








