జాగృతి జిల్లా నేత మిట్టపల్లి శ్రీనివాస్ ముదిరాజ్ | సిద్దిపేట
తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల కవిత అవడం ఖాయమని తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు సిద్ధరబోయిన శ్రీనివాస్ ముదిరాజ్ (మిట్టపల్లి) అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ జాగృతి నాయకులు మాట్లాడారు. ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి అన్ని మున్సిపాలిటీలలో పోటీ చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులకే తమ పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో సిద్ధిపేటలో బీఆర్ఎస్ పార్టీ పునాదులు పెకిలించడం ఖాయమన్నారు. మరి కొద్ది రోజుల్లోనే సిద్దిపేట నుండి కల్వకుంట్ల కవిత ఎన్నికల సమర శంఖం పూరిస్తారని వెల్లడించారు. సిద్దిపేట ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు కవితకు ఉందని, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జాగృతి అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు వర్కోలు శ్రీనివాస్, ఏ. బాలయ్య, కొనాయపల్లి రాజు పలువురు పాల్గొన్నారు.








