-తెలంగాణ జాగృతి నేతలు
(హైదరాబాద్)
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణ సమస్యలు పరిష్కరించడంలో విఫలమైన అధికార, విపక్ష పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని తెలంగాణ జాగృతి నేతలు ఆరోపించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మున్సిపాలిటీలకు ఏం చేశాం.. ఏం చేస్తామన్నది చెప్పి ఓట్లు అడగకుండా ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని విమర్శించారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జాగృతి ఉపాధ్యక్షుడు కోల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి మాట్లాడుతూ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికలను నిర్వహించినట్లుగానే ఆగమాగంగా మున్సిపల్ ఎన్నికలు పెడుతున్నారన్నారు. కానీ అసలు రాష్ట్రంలో మున్సిపాలిటీల పరిధిలో ఏం అభివృద్ధి జరిగింది.. గ్రామపంచాయితీలను మున్సిపాలిటీల్లో, మున్సిపాలిటీలను కార్పొరేషన్లలో కలపటం తప్ప ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క వర్షం పడితే ఆగమయ్యే పరిస్థితి ఉందని విమర్శించారు. మరి పదేళ్ల బీఆర్ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ హయాంలో ఏం అభివృద్ధి జరిగిందని నిలదీశారు.
సమస్యలు పట్టని బీఆర్ఎస్, కాంగ్రెస్
ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం, బీఆర్ఎస్ వాళ్లు జనాన్ని పోగు చేసి హంగామా చేయటం తప్ప ప్రజలకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించడం లేదని జాగృతి నేతలు విమర్శించారు. మున్సిపాలిటీల్లో చేసిన అభివృద్ధి ఏంటీ.. హైదరాబాద్ నగర సుందరీకరణ ఏమైందన్న దానిపై రెండు పార్టీల స్పందన లేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పదేళ్లు, కాంగ్రెస్ రెండేళ్లు అధికారంలో ఉండి కూడా ప్రజలకు ఏమీ చేశామన్నది చెప్పుకోలేని దౌర్భగ్య పరిస్థితుల్లో ఉన్నారన్నారు. కేవలం ప్రజల దృష్టి మరల్చేందుకు పథకం ప్రకారం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. చాలా మున్సిపాలిటీల్లో సమస్యలు తిష్ట వేశాయని తెలిపారు. తాగు నీళ్లు మోరి నీళ్లతో కలిసి కలుషితమవుతున్నాయి.. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదని చెప్పారు. సిటీలో పార్కుల స్థలాలు, చెరువులు కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. వాటి గురించి యువత ప్రశ్నిస్తే వారిని దిక్కున్న చోట చెప్పుకోండి అని అంటున్నారని ఆరోపించారు. కవితక్క జనంబాట కోసం వెళ్లినప్పుడు ప్రజలు ఎన్నో సమస్యలు చెప్పారని జాగృతి నేతలు వివరించారు. వాటిని కవితక్క ప్రభుత్వం దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. కానీ వాటిలో మీరు పరిష్కారం చేసిన సమస్యలు ఎన్ని ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగేందుకు వచ్చే అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను నిలదీయాలని సూచించారు. సమస్యల పరిష్కారం కోసం ఏం చేస్తారో చెప్పాలని అడగాలన్నారు. ప్రజల సమస్యలను వదిలి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న వాళ్లను కచ్చితంగా ప్రజలు శిక్షిస్తారని స్పష్టం చేశారు.
సింహం గుర్తుపై జాగృతి
ఈ ఎన్నికల్లో జాగృతి అభ్యర్థులు సింహం గుర్తు పైన పోటీ చేస్తున్నారని కోల శ్రీనివాస్, రంగు నవీన్ ఆచారి తెలిపారు. జాగృతి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జాగృతి మద్దతుతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి మన అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాల కోసం పనిచేసే కవితక్క కూడా త్వరలోనే పార్టీ పెట్టనున్నారని వెల్లడించారు. ఆమె పెట్టబోయే పార్టీ కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని చెప్పారు. కవితక్క మద్దతిస్తున్న అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. ప్రజల కోసం పనిచేసే అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.








