-కల్వకుంట్ల కవిత
1.89 లక్షల ఉద్యోగాల భర్తీకి బడ్జెట్ లో ప్రొవిజన్ పెట్టాలి.. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి
12 న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ.
(తెలంగాణ జాగృతి కార్యాలయం, బంజారాహిల్స్)
మున్సిపల్ ఎన్నికల్లో సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చి బూతులు తిట్టుకోవటానికే ప్రధాన పార్టీలు ప్రాధాన్యమిచ్చాయని తెలంగాణ జాగృతి అధినేత్రి, మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత విమర్శించారు. సమస్యలను పక్కనపెట్టి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి సర్దుబాట్లు చేసుకున్నాయని ఆరోపించారు. బంజారాహిల్స్ లోని జాగృతి ప్రధాన కార్యాలయంలో మంగళవారం కవిత మీడియా సమావేశంలో మాట్లాడారు. బుధవారం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఓవైసీ బ్రదర్స్ పొద్దు తిరుగుడు పువ్వుల లాంటి వారని ఎద్దెవా చేశారు. అధికారం ఎక్కడుంటే వాళ్లు అటు ఉంటారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హామీలు నెరవేర్చేందుకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కవిత డిమాండ్ చేశారు.

బీసీ సబ్ ప్లాన్ ప్రకటించాలి
రాష్ట్రానికి నష్టం జరిగే నిర్ణయాలు తీసుకున్నా సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం లేదు. జనగణనలో కులగణనకు సంబంధించి ఓబీసీ కాలం పెట్టకపోయినా సీఎం ప్రశ్నించడం లేదు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేదు. ఈ ముఖ్యమంత్రి కేంద్రానికి పూర్తిగా సహకరిస్తున్నారు. ఉపాధి హామీకి సంబంధించి రాష్ట్రాలకు 40 శాతం వాటా అంటే దాని గురించి ఆందోళన చేయలేదు. కానీ పేరు మార్పు గురించి మాత్రమే సీఎం మాట్లాడారు. లేబర్ కోడ్ బిల్లు విషయంలో స్పందించటం లేదు. ఈ నెల 12 న లేబర్ కోడ్ బిల్లుకు వ్యతిరేకంగా జరిగే బంద్ కు జాగృతి మద్దతు ఇస్తున్నది. ఇక ఈ నెల 26 న రాష్ట్ర బడ్జెట్ రాబోతున్నది. గుణాత్మక మార్పునకు అవకాశం ఉన్న బడ్జెట్ ఇది. 2028, 2029 లో ఎప్పుడు ఎన్నికలు ఉన్నా సరే అప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టలేరు. ఈ ప్రభుత్వం వచ్చాక సంపద పెంచాల్సింది పోయి ఏడువేల కోట్ల రూపాయల విలువైన భూములు అమ్ముకున్నారు. రెవెన్యూ డిఫిసిట్ రూ. 9 వేల కోట్లు ఉంది. సంపద సృష్టి లేదు. అప్పులు మాత్రం 122 శాతం ఎక్కువగా చేశారు. ఫించన్ల కోసం గత బడ్జెట్ లో పెట్టిన లక్షా 21 వేల కోట్ల రూపాయల్లో రూ.51 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. పేదలకు ఇచ్చే పెన్షన్లకు కోత పెట్టి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చారు. కమీషన్లు ఎక్కువ వచ్చే చోట డబ్బులు ఖర్చు చేశారు.
కాంట్రాక్టర్లకు పెట్టుకున్న లక్ష్యం కన్నా కూడా ఎక్కువ గా ఇచ్చారు. గత 9 నెలల్లో పేదవాళ్లకు తగ్గిస్తూ…కాంట్రాక్టర్లకు ఎక్కువగా నిధులు ఇచ్చారు. వచ్చే బడ్జెట్ ను కచ్చితంగా 3 లక్షల 25 వేల కోట్లుగా పెట్టే అవకాశం ఉంది. కనుక బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లలో ఇచ్చిన మాట ప్రకారం నిధులు కేటాయించాలి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చెప్పినట్లుగా ఏటా బీసీలకు 20 వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాలి.. బీసీ సబ్ ప్లాన్ ప్రకటించాలి. అవ్వ తాతలకు, మహిళలకు ఇస్తామన్న హామీలు నెరవేర్చాలి. ఫించన్ల కోసం బడ్జెట్ డబుల్ చేయాలి. రూ.35 వేల కోట్లు కేటాయించాలి. పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లకు నిధులు కేటాయించలేదు. 8 లక్షల ఇళ్లకు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఉద్యమకారులకు ఇస్తామన్న హామీల అమలుకు నిధులు కేటాయించాలి. ఆటోడ్రైవర్ల భృతి రూ.12 వేల కోసం నిధులు ఇవ్వాలి. కళాకారులకు రాష్ట్రం రూ.500తో పెన్షన్ స్టార్ చేస్తే కేంద్రం రూ.13 వేలకు పైగా ఇస్తుంది. దాని కోసం బడ్జెట్ లో ప్రొవిజన్ పెట్టాలి.
ఆర్టీసీలో ఉద్యోగాల కోత
రైతులు, కౌలు రైతులకు ఇస్తామన్న హామీల కోసం రూ. 25 వేల కోట్లు పెట్టాలి. యాసంగి రైతు భరోసా ఇప్పటికీ విడుదల చేయలేదు. వెంటనే వాటిని రిలీజ్ చేయాలి. రైతు ఋణమాఫీ వందశాతం చేశామని సీఎం చెప్పారు. కానీ ఆయనకు నేను ఛాలెంజ్ చేస్తున్నా. నిజామాబాద్, మహబూబ్ నగర్, సచివాలయం ఎక్కడైనా సరే చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. రైతులకు రూ.44 వేల కోట్ల ఋణమాఫీ అన్నారు. కేబినెట్ లో రూ.28 వేల కోట్లు అన్నారు. కానీ రైతులకు ఋణమాఫీ చేసింది మాత్రం రూ.21 వేల కోట్లు మాత్రమే. రైతులకు కనీసం యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు. మైనార్టీ బడ్జెట్ విషయంలోనూ కాంగ్రెస్ కేటాయించిన నిధులను ఖర్చు చేయలేదు. విద్యార్థులకు రూ. 11 వేల కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ చేయాల్సి ఉంది. ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్ కారణంగా ఆడబిడ్డలు నష్టపోయే పరిస్థితి ఉంది. ఆర్టీసీ కార్మికుల సంఖ్య తెలంగాణ రాకముందు 52 వేలు. కానీ తెలంగాణ వచ్చాక 12 ఏళ్లలో వారి సంఖ్య 32 వేలకు చేరింది. చిన్న చిన్న కారణాలకే ఎంప్లాయిస్ ను ఉద్యోగాల నుంచి తొలగించారు. ఆర్టీసీలో తీసుకొచ్చే ఎలక్ట్రిక్ బస్సుల్లో ఆర్టీసీ వాళ్లనే నియమించాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ వేగవంతం చేయాలి. మహిళలకు ఇస్తామన్న స్కూటీ, తులం బంగారం వెంటనే ఇవ్వాలి. ఈ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ చేసింది. కానీ 11 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. మిగతా లక్ష 89 వేల ఉద్యోగాల జీతాల డబ్బులు బడ్జెట్ లో పెట్టాలి. జాబ్ క్యాలెండర్ వెంటనే వేయాలి. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో విద్యార్థులకు వివరించాలి. బీఆర్ఎస్ జాబ్స్ ఇవ్వలేదని చెప్పి మీరు కూడా జాబ్స్ ఇవ్వటం లేదు.

ప్రచారంలో బూతుల వర్షం
మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిస్తే…పెద్ద బూతుల వర్షం ముగిసినట్లు అనిపించింది. ఈ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడలేదు. ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం మాత్రమే చేశారు. మున్సిపల్ ఎన్నికలు కూడా పార్టీ గుర్తు లేకుండా జరిగితే బాగుండేది. బీజేపీ నుంచి జాతీయాధ్యక్షుడు వచ్చి ప్రచారం చేశారు. కానీ దురదృష్టం ఏమిటంటే మహబూబ్ నగర్ లో ఇప్పటికీ రెండు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి.
గతంలో ఎప్పుడు ఉన్న బస్సు సర్వీసే ఇప్పుడు ఉంది. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ మీద దృష్టి పెట్టలేదు. ప్రభుత్వ స్కూళ్లను చూస్తుంటే పిల్లలు తక్కువ, పంతుళ్లు ఎక్కువ ఉన్న పరిస్థితి ఉంది. బస్తీ దవాఖానాల్లో గోలీలు లేవు, డాక్టర్లు లేరు. వాటిపై రివ్యూ కూడా లేదు. రోడ్లపై, డ్రైనేజీలో చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకపోయింది. ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవటం లేదు. వ్యక్తులను తిట్టటానికే మున్సిపల్ ఎన్నికల ప్రచారం పరిమితమైంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మంచివాళ్లను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిశాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా సర్దుబాట్లు చేసుకున్నాయి. అందుకే మంచి వ్యక్తిని చూసి ఎన్నుకోండి. సింహం గుర్తుపై పోటీ చేస్తున్న మా అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో 111 మున్సిపాలిటీలు ఉంటే ఒక్క మున్సిపాలిటీకి మాత్రమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వచ్చింది. గుంపుమేస్త్రీ, గుంటనక్క స్నేహం కారణంగా సిద్ధిపేటకు మాత్రమే మంజూరు చేశారు. బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా గుంటనక్కకే పనులు అవుతున్నాయి.
గాలివాటం బ్రదర్స్
ఒవైసీ బ్రదర్స్ అధికారం చుట్టు తిరిగే సన్ ప్లవర్స్ లాంటి వాళ్లు. గతంలో రాయల తెలంగాణ అని తెలంగాణను వ్యతిరేకించారు. కానీ తెలంగాణ వచ్చాక కేసీఆర్ తో కలిసి అధికారంలో పాలు పంచుకున్నారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ తో జత కట్టారు. రాహుల్ గాంధీ కేంద్రంలో ఒవైసీ బ్రదర్స్ ను వ్యతిరేకిస్తారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం వారితో దోస్తానా చేస్తారు. జుబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కోసం ఓవైసీ బ్రదర్స్ అభ్యర్థినే పెట్టలేదు. రేవంత్ రెడ్డి వచ్చాక రంజాన్ తోఫా ఇవ్వలేదు. ముస్లింల కోసం రేవంత్ రెడ్డితో రంజాన్ తోఫా ఇప్పించాలి.
ఓల్డ్ సిటీలో అసలు అభివృద్ధి లేదు. ఓవైసీ సోదరులు ఓల్డ్ సిటీలో ఎందుకు ఉండటం లేదు?








