-కల్వకుంట్ల కవిత
- తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ
- పాల్గొన్న పదికి పైగా ఉద్యమ సంఘాలు, పెద్ద సంఖ్యలో ఉద్యమ నాయకులు
- ఉద్యమసోయి లేని రేవంత్ రెడ్డి
- కోదండరాం, ఆకునూరి మురళిని చూసి రేవంత్ ను నమ్మారు
- త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నాం
- మాది ఫక్తు రాజకీయ పార్టీ కాదు, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ
- ప్రైవేట్ ఉద్యోగాల్లో తెలంగాణ బిడ్డలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
(బాగ్ లింగంపల్లి – ఆర్ టీసీ కళ్యాణ మండపం)
సబ్బండ వర్ణాల పోరాటంతో తెలంగాణ తల్లిని విముక్తి చేశాం.. ఇక తెలంగాణ ప్రజల బానిసత్వాన్ని కూడా తెంచుకోవటానికి మరో ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.

ఉద్యమకారులపై లాఠీ దెబ్బ పడాలంటే ముందు ఆ లాఠీ నా మీద పడాల్సిందేనని స్పష్టం చేశారు. మనకు పోరాటాలు కొత్త కాదు.. కానీ మనవాళ్లే చేసిన గాయంతో నొప్పి ఎక్కువ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో గురువారం నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభకు ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వందల మంది తెలంగాణ ఉద్యమకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అభివాదం చేశారు. జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరుల ఆత్మశాంతికి 2 నిమిషాలు మౌనం పాటించారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యానికి ముందు నుంచి ప్రతి మూడేళ్ల కోసారి తెలంగాణ ప్రాంత వాసులు ఆత్మగౌరవ పోరాటం చేయక తప్పటం లేదని గుర్తు చేశారు. సాయుధ రైతాంగపోరాటం, ముల్కి, నాన్ ముల్కి సహా తొలి, మలి దశ ఉద్యమాలతో దాదాపు 150 ఏండ్లుగా తెలంగాణ వాసులు రక్తమోడుస్తున్నారని కవిత చెప్పారు.
పునీత తెలంగాణ
నిజానికి రాష్ట్రం సిద్ధించగానే ఉద్యమకారులందరికీ మొదటి వరుసలోనే గౌరవం, ఆర్థిక వృద్ధి, రాజకీయ అవకాశాలు వస్తాయని భావించాం. కానీ ఆ విధంగా జరగకపోవటం చాలా బాధ కలిగించే అంశం. మన తెలంగాణ అనేది నిత్యం పోరాటాల గడ్డనే. మానవాళి పుట్టినప్పటికీ నుంచి మన గడ్డకు ఎంతో చరిత్ర ఉంది. తెలంగాణలో పుట్టినందుకు గర్వపడుతున్నా. ఎన్ని జన్మలు ఉన్న సరే మళ్లీ తెలంగాణలోనే పుట్టాలని కోరుకుంటున్నా.
మన నేలకు పునీతమైన, పురాతనమైన చరిత్ర ఉంది. 1860 లోనే రామ్ జీ అనే గోండు బిడ్డను ఆయన అనుచరులను వెయ్యి మందిని ఒకే చెట్టుకు బ్రిటిష్ వాళ్లు ఉరి తీశారు.
ఆ తర్వాత మరో గోండు బిడ్డ కొమురం భీమ్ కూడా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారు.
1942 జులై 4 వ తేదీన దొడ్డి కొమురయ్య అమరుడైతే తెలంగాణ మొత్తం అగ్గి అయ్యింది.
అప్పటి దురాగతాలకు వ్యతిరేకంగా తెలంగాణ ఒక్కటైంది. 1942 కు ముందే మన ప్రాంతంలో భూ పోరాటాల ఫలితంగా పేదలకు భూ పంపిణీ జరిగింది. స్వాతంత్ర్యం రాకముందు వరకు కూడా రజాకార్లు, సైన్యం చేసిన ఘోరాతి దురాగతలను భరించాం.

మనకు ఎప్పుడు కూడా శాంతి, సంతోషం లేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మనం పోరాటం చేయాల్సి వచ్చింది. 1956 లో ఆంధ్రాతో మనల్ని కలిపారు. కానీ కొన్ని సంవత్సరాలకే వాళ్లపై పోరాటం చేశాం. 1962 లో ఇడ్లి, సాంబార్ గో బ్యాక్ ఉద్యమం చేశాం. 1969 లో తెలంగాణ ఉద్యమం చేశాం. 1969 లో తెలంగాణ ఉద్యమం చేసిన మన 369 మంది పిల్లలను కాసు బ్రహ్మనంద రెడ్డి పొట్టనపెట్టుకున్నాడు. కానీ ఇప్పటికీ కూడా హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ కు అదే పేరు ఉంది. అందుకే మనకు బాధ. ఏ చేదు గుర్తులు ఉండకూడదని అనుకున్నామో ఆ గుర్తులు ఇంకా ఉండటమే మనకు బాధ.
ద్రోహులకే అగ్రతాంబూలమిచ్చిన కేసీఆర్
నక్సల్ ఉద్యమం చేసిన మన వాళ్లను రాజ్యం ఘోరాతి ఘోరంగా పొట్టన పెట్టుకుంది. వరంగల్ లోని పద్మాక్షి గుట్ట ఇప్పటికీ నెత్తురోడుతోంది. 1995లో వరంగల్ డిక్లరేషన్ తో మా తెలంగాణ మాకు కావాలని నినదించారు. గద్దర్ సహా చాలా మంది మేధావులు అప్పుడు తెలంగాణ కోసం పోరాడారు. అప్పటి వరకు కూడా మన విప్లవకారులు, మేధావులు, తెలంగాణ భావాజాలాన్ని కాపాడారు. ఇక 2001లో కేసీఆర్ వచ్చి తెలంగాణ ఉద్యమంలో అగ్గి రాజేశారు. మొత్తం సమాజం కూడా ఆయన వెంట ఉండి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. స్వరాష్ట్రంలో కొంత మంది ఉద్యమకారులకే అవకాశాలు వచ్చాయి. అవకాశాలు వచ్చిన వాళ్లు ఉద్యమకారుల భుజాలు తడుతారని భావించాం. కానీ అవకాశం వచ్చిన వాళ్లే ఉద్యమకారులను అవమానించే పరిస్థితి వచ్చింది. మనవాడే మనల్ని పురుగుల్ని చూసినట్లు చూసి అవమానించాడు. ఇక ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచారో, మనల్ని ఉద్యమంలో కొట్టించారో వాళ్లే కేసీఆర్ చుట్టూ చేరారు. కేసీఆర్ అనాలనే ఉద్దేశం ఎవరికీ లేదు. కానీ పదేళ్లు అవకాశం ఇస్తే ఎందుకు న్యాయం చేయలేదన్నది అడగాల్సిందే. కేశవరావ్ జాదవ్ చనిపోతే ఎందుకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపలేదు?ఈ ప్రాంతం కాని ఎంతో మందికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. కేబీఆర్ పార్క్ వద్ద జయశంకర్ సార్ విగ్రహం పెట్టాలని అప్పటి మున్సిపల్ మినిస్టర్ ను ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాను. ట్యాంక్ బండ్ పై కూడా జయశంకర్ సార్ విగ్రహం పెట్టుకోలేకపోయాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి హైదరాబాద్ కూడళ్లలో ఎవరెవరివో విగ్రహాలు పెడుతున్నారు. గద్దర్, బిరుదురాజు రామరాజు, సుద్దాల హన్మంతు లాంటి వాళ్ల విగ్రహాలు రవీంద్ర భారతిలో ఉండాలి. కానీ ఎవరి విగ్రహాలు పెడుతున్నారో చూస్తూనే ఉన్నాం కదా? ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఉద్యమ సోయి లేదు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావటం మన దౌర్భాగ్యం. కానీ మన చేతిలో ఉన్నప్పుడు మనం ఎందుకు చేసుకోలేకపోయాం? మనం పోరాటం చేస్తేనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థం అవుతున్నది. ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేయాల్సిన అవసరమున్నది. ఉద్యమకారులకు బుల్లెట్ తగలాలంటే ముందు నన్ను దాటి వెళ్లాల్సిందే. మీరు బయట ఉండి బాధపడితే నేను బీఆర్ఎస్ లో ఉండి బాధపడ్డాను. జీ హుజుర్ అంటే అక్కడే ఉండేదాన్ని, క్యా హుజుర్ అన్నందుకు ఇక్కడ ఉన్నా. కేసీఆర్ హయాంలో నిరుద్యోగులకు న్యాయం జరగలేదు. ఇప్పుడు కూడా వారికి న్యాయం జరగటం లేదు. ఈ ముఖ్యమంత్రి బతుకమ్మను తీసేసి తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాడు. ఆయనకు ఉద్యమ సోయి లేదు. ఉద్యమకారులకు ఏం చేస్తామని చెప్పారో కాంగ్రెస్ అవన్నీ చేయాలి.

కోదండరాందే బాధ్యత
ఈ నెల 26 నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ఆ బడ్జెట్ లో ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రొవిజన్ పెట్టాలి. లేదంటే ఊరుకునేది లేదని ప్రొఫెసర్ కోదండరాం ను హెచ్చరిస్తున్నా. తెలంగాణ సోయి లేని రేవంత్ రెడ్డికి మీరు మద్దతిస్తేనే ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు కోదండరాం ఏమీ మాట్లాడటం లేదు. కాంట్రాక్టర్లకు రూ.5 వేల కోట్ల ధారబోస్తే మాట్లాడటం లేదు. ఆకునూరి మురళి, కోదండ రాం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. విద్యాకమిషన్ నివేదిక ఏం ఇచ్చింది? ఈ ప్రభుత్వం దాన్ని పాటించిందా? గురుకులాల్లో పిల్లలు చనిపోతే విద్యా కమిషన్ ఏం చేస్తున్నది? ఉద్యమకారులకు, తెలంగాణకు ఇచ్చిన హామీలపై మీ వెంటపడుతాం. హైదరాబాద్ లో ఎన్నో కంపెనీలు వచ్చినప్పటికీ మన వాళ్లకు ఉద్యోగాలు రావటం లేదు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల్లో మన వాళ్లకు 20 శాతం రిజర్వేషన్ల కోసం జాగృతి పోరాటం చేస్తుంది. ఉద్యమకారుల పిల్లలు ఎవరికీ కూడా పెద్ద సంస్థల్లో ఉద్యోగాలు రాలేదు. ఇప్పుడున్న అధికారులు ఉద్యమకారులు అంటే ఎవరు అని అడుగుతున్నారు. అంటే ఉద్యమకారులు ఎవరో కూడా మనమే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేసులున్న వారే ఉద్యమకారులంట, మరి నాపై కూడా కేసు లేదు. ఉన్న కేసులను కోర్టు కొట్టివేసింది. కేసులు లేకుండా కూడా ఎంతో మంది ఉద్యమం చేశారు. ప్రెస్ మిత్రులకు కూడా న్యాయం జరగాల్సి ఉంది. ఎంతో మంది పేపర్లు పెట్టి, తెలంగాణ సాహిత్యాన్ని ప్రచురించి ఆస్తులు అమ్ముకున్నారు. వారందరికీ కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఉద్యమకారులను గుర్తించేందుకు మనం యాప్ సిద్ధం చేశాం. యాప్ లో ఎన్ రోల్ చేసుకొని మన ఐడెంటిటీని మనమే గుర్తించుకుందాం. అప్పుడు కూడా ప్రభుత్వం గుర్తించకపోతే కోదండరాం, ఆకునూరి మురళిని పట్టుకుందాం. యాప్ లో ఎన్ రోల్ చేసుకున్న ప్రతి ఉద్యమకారుడి కుటుంబానికి జాగృతి తరఫున హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తాం. మమ్మల్ని చూసైనా ప్రభుత్వానికి సిగ్గు రావాలన్నదే మా చిరు ప్రయత్నం.
ఉద్యమకారుల ఎజెండా రాజకీయ పార్టీ

పొలిటికల్ పార్టీ పెడతానని నేనంటే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అప్పుడు, ఇప్పుడు ఎప్పుడు కూడా నా పక్కన ఉద్యమకారులే తప్ప.. పైరవీ కారులు లేరు. తెలంగాణ పేరు, అస్తిత్వాన్ని కాపాడుకునే విధంగా మా పార్టీ ఉంటుంది. మాది ఫక్తు రాజకీయ పార్టీ కాదు. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడే రాజకీయ పార్టీ. ఉద్యమకారుల అజెండాతోనే మా పార్టీ ముందుకు పోతుంది.ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేశాం. వాటికి ఎంతో మంది సహకారం చేశారు. కానీ రాష్ట్రం వచ్చాక వాళ్లకు ఏమాత్రం న్యాయం జరగలేదు. తెలంగాణలో ఉన్న చిన్న కాంట్రాక్టర్లకు లాభం జరగలేదు. కానీ మేఘా కృష్ణారెడ్డి అపర కుబేరుడయ్యాడు. తెలంగాణ వచ్చాక అన్ని పార్టీల నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ప్రజాస్వామ్య విలువలు మొత్తం కాలరాయబడ్డాయి. ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టినా, యూట్యూబ్ లో వీడియో పెట్టినా అరెస్టులు చేసి కేసులు పెట్టారు. అహంకారం, సహనశీలత లేకపోవటంతోనే బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. మంచితనం, సహనశీలత, భోళాతనమే తెలంగాణ తత్వం. అవి కోల్పోతే మనల్ని మనం కోల్పోయినట్లే. కేసీఆర్ ఉద్యమకారులకు అన్యాయం చేశారని చెప్పి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. కానీ మీరు కూడా న్యాయం చేయకపోతే మిమ్మల్ని బిల్డింగ్ నుంచి బయటకు గుంజుతారు. తెలంగాణ వచ్చాక కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారు? ఈ ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేయాల్సి ఉంది. ధర్మం వైపే ఉండాలని శ్రీ కృష్ణుడు ఎప్పుడో చెప్పారు. తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల వైపే ధర్మం ఉంది. తెలంగాణ జాగృతి వారి కోసం పోరాటం చేస్తూనే ఉంటుంది. చాకలి ఐలమ్మ, మారోజు వీరన్న లాంటి ఉద్యమకారుల స్ఫూర్తితో మేం ముందుకు సాగుతాం.








