బీసీ బిల్లుల ఆమోదం కోసం ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి పెంచాలి

ప్రతిపక్ష పాత్ర మేమే పోషిస్తున్నం

-తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

(ఖైరతాబాద్)

బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పెండింగులో ఉన్న బీసీ బిల్లులకు ఆమోదం లభించేలా ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి పెంచాలని సూచించారు. ట్యాంక్ బండ్ పై ఐమాక్స్ ఎదురుగా ఉన్న లేక్ వ్యూ పార్కులో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటు పనులను కల్వకుంట్ల కవిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రెండున్నరేళ్లుగా పూలే గారి విగ్రహం అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని జాగృతి పోరాటం చేస్తోందని చెప్పారు. జాగృతి వరుస పోరాటాల ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చిందని వెల్లడించారు. ట్యాంక్ బండ్ మీద విగ్రహం ఏర్పాటు చేయటం పాక్షిక విజయమేనని, పూలే విగ్రహం అసెంబ్లీలో కూడా ఉండాలన్నది మా డిమాండ్ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనిచేయకపోతే జాగృతి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తప్పకుండా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ట్యాంక్ బండ్ పై విగ్రహ ఏర్పాటు కోసం పనులు చేస్తున్నా ఒక్క పూలే విగ్రహం మాత్రమే పెడుతారా.. సావిత్రీబాయితో కలిపి విగ్రహం ఏర్పాటు చేస్తారా అనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదని కవిత అన్నారు. ఫూలే విగ్రహం ఏర్పాటు తర్వాత ఎవరైనా ఎప్పుడైనా నివాళులు అర్పించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ చుట్టు పక్కల ఉన్న విగ్రహాలకు ధీటుగా ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు.

42 శాతం రిజర్వేషన్లతో ప్రాదేశిక ఎన్నికలు

బీసీ రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కవిత ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించలేదని, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనైనా 42 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పరీక్షలను కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం వరుస ఎన్నికలు నిర్వహిస్తోందని, తద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా చేస్తోందని ఆరోపించారు. బడ్జెట్ లో ఏటా బీసీలకు రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని, గత రెండు బడ్జెట్లలో బీసీలకు తక్కువ కేటాయించి అందులో 30 శాతం కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. 

బీసీల్లో చైతన్యం

కార్పొరేషన్ల పదవులు కూడా అగ్రకులాల వారికే ఇస్తున్నారని కవిత చెప్పారు. ఎన్నికల్లో గెలవలేని బీసీ, మహిళ, మైనార్టీలకు కార్పొరేషన్ పదవులు ఇవ్వాలని కోరారు. ఆర్. కృష్ణయ్య, తెలంగాణ జాగృతి లాంటి సంస్థల పోరాటం ఫలితంగా బీసీల్లో చైతన్యం పెరిగిందని, మొన్న జరిగిన ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ స్థానాలు దక్కేందుకు ఆ చైతన్యమే కారణమని స్పష్టం చేశారు. రాజకీయ రిజర్వేషన్లకు అడ్డంకులు ఉన్నాయే తప్ప బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. వెంటనే ఆ రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. 

కాంగ్రెస్ తల్లిని ఒప్పుకోరు

వినాశ కాలే విపరీత బుద్ది అన్నట్లు కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కవిత విమర్శించారు. బతుకమ్మ లేని తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ తల్లి కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం పెట్టే కాంగ్రెస్ తల్లి బొమ్మకు ప్రజల ఆమోదం లభించదని చెప్పారు. బలవంతంగా ఒక ప్రతీకను ప్రజల మీద రుద్దే ఏ ప్రభుత్వాన్ని ప్రజలు హర్షించరన్నారు. 

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని కవిత కోరారు. ప్రభుత్వం స్థలం ఇస్తే జయశంకర్ సార్ విగ్రహ ఏర్పాటుతో పాటు నిర్వహణకు అయ్యే ఖర్చు జాగృతి భరిస్తుందని ప్రకటించారు. జయశంకర్ సార్ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరామని గుర్తు చేశారు. ఫూలే జయంతి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కోరుతామని చెప్పారు.

జాగృతే అసలైన ప్రతిపక్షం

రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిపక్షాలుగా విఫలమయ్యాయని కల్వకుంట్ల కవిత విమర్శించారు. అందుకే కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండానే ఎక్కువ స్థానాలు గెలుచుకుందని విశ్లేషించారు. రాష్ట్రంలో చాలా చోట్ల ప్రజలు ఏ పార్టీకి మెజార్టీ ఇవ్వలేదని, అన్ని పార్టీలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. హంగ్ వచ్చిన చోట కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను మేమే పోషిస్తున్నామని కవిత వెల్లడించారు.