భూదాన్ భూములను ఆక్రమించుకునేే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది? -కల్వకుంట్ల కవిత

జాగృతి కార్యాలయంలో కొనసాగుతున్న దీక్ష

(హైదరాబాద్)

వెలుగుమట్లలో పేదవాళ్ల ఇళ్లను కూల్చి…పెద్దవాళ్లకు ఆ భూమిని అప్పగించేందుకు జరుగుతున్న కుట్రను ఐక్యంగా అడ్డుకోవాలని తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. పేదలు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. వెలుగుమట్ల బాధితుల కోసం హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతున్న కవిత ప్రభుత్వ తీరును ఎండగట్టారు. వెలుగుమట్లలో కూల్చిన ఇళ్ల స్థానంలోనే కొత్త ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కవిత దీక్షకు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం పేదల పక్షాన నిర్ణయం తీసుకునే వరకు నిరాహార దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

Kalvakuntla Kavitha continues hunger strike at Jagruthi office after arrest

బాధితుల పట్ల ఇంత నిర్లక్ష్యమా

“వెలుగుమట్లలో భూదాన్ భూమి 30 ఎకరాలు ఉంది. ఆక్రమణకు గురైన మరో 30 ఎకరాల భూదానం భూమి ఉంది. మొత్తంగా 62 ఎకరాల భూమి ప్రభుత్వానికి అందుబాటులో ఉంది. భూదాన్ భూమి అంటేనే పేదవాళ్లకు ఇచ్చిన భూమి. పేదవాళ్లకు ఇచ్చిన భూమిలో ప్రభుత్వం, కలెక్టర్ కర్కషంగా వ్యవహరించారు. టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ ఉండే ఇలాంటి సమయంలో అర్ధరాత్రి బుల్డోజర్లతో 750 ఇళ్లను కూలగొట్టారు. విద్యార్థుల హాల్ టికెట్లు ఉన్న ఇళ్లను కూడా కూల్చేశారు. ఇప్పుడు ఆ విద్యార్థులు ఎగ్జామ్స్ ఎలా రాయాలి?బాధితులందరినీ అంబేడ్కర్ భవన్ లో పెట్టారు. నిజంగా ఒక పశువుల కొట్టంలోకి తోలినట్లు వారందరినీ తోలారు. అక్కడ పిల్లలకు దద్దుర్లు వస్తున్నాయి. వారి ఆరోగ్యం పాడయ్యే పరిస్థితి ఉంది. బాధితులంతా కూలీ పని చేసుకునే వాళ్లే. ఎన్నో ఏళ్లు కష్టపడి ఇళ్లు కట్టుకుంటే నిమిషాల్లో కూల్చేశారు. వారి పరిస్థితి చూస్తుంటే చాలా ఆవేదన కలిగింది. ప్రభుత్వ తీరు అత్యంత అన్యాయం. వారికి కనీసం భోజనం కూడా పెట్టటం లేదు. తినటానికి కూడా దాతలపై ఆధారపడే పరిస్థితి ఉంది. మేము నిన్న ధర్నా చేస్తూ బాధిత శిబిరాన్ని కలెక్టర్ విజిట్ చేయాలని కోరాం. అదేదో అప్రజాస్వామికం అన్నట్లుగా ప్రభుత్వం, కలెక్టర్  పంతం పట్టి మమ్మల్ని అరెస్ట్ చేశారు. బాధితుల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, జాగృతి, ధర్మసమాజ్ పార్టీ విశారదన్ సంయుక్తంగా ఆందోళన చేశాం. దాదాపు నాలుగు గంటల పాటు ఖమ్మంలో ట్రాఫిక్ ను స్తంభింపజేసి ధర్నా చేశాం. ప్రభుత్వం నుంచి కనీసం ఏదైనా ప్రకటన వస్తుందేమోనని భావించి…అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా నిరాహార దీక్ష చేపట్టాం. నిన్నటి నుంచి దీక్ష కొనసాగిస్తుంటే ఇవ్వాళ ఉదయం 6 వందల మంది పోలీసులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారు. మేమేదో టెర్రరిస్టులమన్నట్లుగా మమ్మల్ని హైదరాబాద్ కు తీసుకొచ్చారు. విశారదన్ ను ఎక్కడకు తీసుకెళ్లారో తెలియదు. అచూకీ తెలిశాక ఆయన కూడా పోరాటం చేస్తారు. నా వంతుగా జాగృతి కేంద్ర కార్యాలయంలో నేను నా దీక్షను కొనసాగిస్తున్నా.” 

పట్టాలిచ్చి లాక్కుంటారా

Protest for Velugumatla displaced families reaches Hyderabad

“వెలుగుమట్లలో 30 ఎకరాల భూదాన్ భూమిలో ఉన్న ఇళ్లను కూలగొట్టి ఆ ప్రాంతం మొత్తాన్ని చదును చేశారు. వెలుగుమట్లలో భూమి విలువ పెరిగితే ఆ భూమిని ప్రభుత్వం పేదవాళ్లకు కాకుండా  చేస్తోంది. రాహుల్ గాంధీ మాట్లాడితే రాజ్యాంగం పట్టుకొని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతారు. తెలంగాణలో పేదల మీద కాంగ్రెస్ ప్రభుత్వమే కర్కషంగా వ్యవహరిస్తే ఎందుకు మాట్లాడటం లేదు. నిజంగా ఇక్కడ ఏం జరిగిందో రాహుల్ గాంధీ తెలుసుకోవాలి. ఇండిపెండెంట్ జ్యుడీషియల్ ఎంక్వైరీ వేసి నిజాలు తెలుసుకోవాలని రాహుల్ గాంధీని కోరుతున్నా. భూదాన్ భూమిలో ఉన్న ఇళ్లను ఎందుకు కూల్చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. భూదాన్ బోర్డు పేదలకు ఇచ్చిన స్థలాలకు పట్టాలు కూడా ఇచ్చింది. జీవో 58 కింద వాళ్లంతా రెగ్యులరైజ్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. ప్రభుత్వ భూమి కాని చోట నోటీసులు కూడా ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారు? భూదాన్ భూమిని ఆక్రమించుకునే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది? ఈ రాష్ట్రంలో ప్రభుత్వమే పేదల భూములను కబ్జా చేస్తోంది. దీనిపై మేము న్యాయపరంగానూ పోరాటం చేస్తాం. పేదలంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేకుండా పోయింది. అడిగే వాళ్లు లేరని అనుకుంటున్నారా? ఖమ్మంలో మాత్రమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం జులుం చేస్తోంది. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చేస్తూ….పెద్దల బిల్డింగుల జోలికి వెళ్లటం లేదు. ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదు. ఈ కూల్చివేతల వెనుక ముగ్గురు మంత్రుల హస్తం ఉందని భావించాల్సి వస్తుంది. ఒక వేళ అలా కాకుంటే ముఖ్యమంత్రి వెంటనే చర్యలు చేపట్టి…బాధితులకు న్యాయం చేయాలి. వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు అక్కడే ఇళ్లను కట్టించి ఇవ్వాలి. అప్పటి వరకు కూడా నా దీక్ష కొనసాగుతుంది.”