- దీక్ష విరమించిన కల్వకుంట్ల కవిత, విశారదన్ మహారాజ్
- బాధితులకు ప్రభుత్వం టోకన్లు జారీ చేయడంతో నిర్ణయం
- నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన జస్టిస్ ఈశ్వరయ్య
- ప్రైవేట్ ప్రాపర్టీలోకి వచ్చి ఇళ్లను కూల్చేసేందుకు ప్రభుత్వానికి ఎంత ధైర్యం?- కవిత
- రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ…మీ ప్రభుత్వంపై గట్టి చర్యలు తీసుకోవాలి
(సోమాజి గూడ ప్రెస్ క్లబ్)
ఖమ్మం వెలుగుమట్ల బాధితుల ఇళ్లు కూల్చేసిన చోటనే ఇండ్ల స్థలాలు, ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారం సాయంత్రం విరమించారు. ప్రభుత్వం ఆక్రమణదారులు అంటూ వెలుగుమట్లలో ఇండ్లు కూల్చేసిన వారినే ఈ రోజు ఆ స్థలాలకు యజమానులుగా పేర్కొంటూ టోకెన్లు జారీ చేయడంతో రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఈశ్వరయ్య సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. వెలుగుమట్ల బాధితులకు ఇండ్లు కూల్చేసిన చోటనే కొత్త ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఖమ్మంలో కవిత, విశారదన్, బాధితులు మహాధర్నా చేపట్టారు. అదే రోజు రాత్రి నిర్వాసితులతో కలిసి అంబేద్కర్ భవన్ లో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. మంగళవారం ఉదయం కవిత, విశారదన్ సహా ఉద్యమకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత, డీ ఎస్ పీ ఆఫీస్ లో విశారదన్ దీక్ష కొనసాగించారు. దీక్షకు ఇది విరామమే అని వెలుగుమట్లలో మిగతా బాధితులకు న్యాయం జరిగే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని కవిత, విశారదన్ ప్రకటించారు. అనంతరం కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు.

సంయుక్త కార్యాచరణ-కవిత
“వెలుగుమట్లలో జరిగిన సంఘటనపై రాష్ట్ర ప్రజలంతా బాధగా ఉన్నారు. అసలు రాష్ట్రంలో ప్రజస్వామ్యం అనేది ఉందా అనే అనుమానం వచ్చే విధంగా అర్థరాత్రి పూట బుల్డోజర్లతో పేదల ఇళ్లు కూల్చేశారు. ఆ తర్వాత బాధితులను అవహేళన చేస్తూ వారికి భూమి మీద హక్కులు లేవంటూ మాట్లాడారు. సంఘటన తర్వాత చాలా పార్టీలు టూరిస్టుల మాదిరిగా బాధితుల వద్దకు వెళ్లారు. కానీ వారి సమస్య పరిష్కారమయ్యే విధంగా పెద్ద ఎత్తున పోరాటం చేయలేదు. అన్ని అర్హతలు ఉన్న వారి ఇళ్లు కూలగొట్టే అధికారం అసలు ఈ ప్రభుత్వానికి ఎక్కడిది? పేదల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న వైఖరేంటో తెలిపే సంఘటన ఇది.
ఇలాంటి సంఘటనపై ఎలాంటి పోరాటం చేయాలన్న దానిపై విశారదన్ మహారాజ్ తో మాట్లాడాను. అన్ని పార్టీల మాదిరిగా కాకుండా సమస్యకు పరిష్కారం కోసం కార్యాచరణ చేయాలని భావించాం. ఆ క్రమంలో 9 వ తారీఖున ఖమ్మంలోని బాధితుల వద్దకు వెళ్లాం.
అక్కడ పరిస్థితులను చూస్తే అసలు మనం ఇండియాలో ఉన్నామా లేక అప్ఘానిస్తాన్ లో ఉన్నమా అనే అనుమానం కలిగింది. పేదలను కొట్టి కొంతమంది పెద్దవాళ్లకు ఆ భూమి అప్పగించే కుట్ర చేస్తున్నారని మాకు అర్థమైంది. భూదాన్ భూమి ఎట్టి పరిస్థితుల్లో పేదలకే అప్పగించాలని ఈ సంఘటనను మేము సీరియస్ గా తీసుకున్నాం. ఖమ్మంలో పెద్ద ఎత్తున ధర్నా చేశాం. ఆ తర్వాత అప్పటికప్పుడు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నాం.
అయితే పోలీసులు విశారదన్ మహారాజ్ ను, నన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు.”
ఉపేక్షిస్తే రాష్ట్రాన్ని కబ్జా పెడ్తారు
“పోలీసులు హైదరాబాద్ లో ఎక్కడ మమ్మల్ని వదిలేశారో అక్కడే మేము దీక్ష కొనసాగించాం.
మీడియా, అధికారులు మా పక్షానే ఉన్నారన్న ధీమాతో ప్రభుత్వం పేదల ఇళ్లు కూల్చేసింది.
అందుకే దీక్ష చేయాల్సిన పరిస్థితి వచ్చింది. భూమి ఆక్రమించుకున్నారని మొన్నటి వరకు చెప్పిన మంత్రులు..ఇవ్వాళ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ అర్హులు ఉన్నారని చెబుతున్నారు.
పోలీసు కమిషనరే స్వయంగా ల్యాండ్ ఓనర్లను వెకేట్ చేయించామని ట్వీట్ చేశారు.
ప్రైవేట్ ప్రాపర్టీలోకి వచ్చి పేదల ఇళ్లు కూలగొట్టేందుకు ఈ ప్రభుత్వానికి ఎంత ధైర్యం?
చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ దీనికి బాధ్యత వహించాలి. కచ్చితంగా మీ ప్రభుత్వంపై గట్టి చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ప్రజలను క్షమాపణ అడగాలి.
రాజ్యాంగమంటే ఏదో ఒక హారం కాదు. ఈ దేశాన్ని నడిపించే గ్రంథం. పేద ప్రజలకు అన్యాయం చేసిన ప్రభుత్వంపై చర్యలు తీసుకోకపోతే మీరు రాజ్యాంగాన్ని పట్టుకోవటం వృథా. ప్రజాపాలన పేరుతో మీరు ప్రజా వేదన చేస్తున్నారు. అసలు ల్యాండ్ ఓనర్ల ఇళ్లను కూల్చే ఇలాంటి సంఘటనలను మనం ఉపేక్షిస్తే..ప్రైవేట్ ప్రాపర్టీలో కూల్చివేతలకు ప్రభుత్వానికి అధికారం ఇచ్చినట్లవుతుంది. ఆ తర్వాత ఇలాంటి సంఘటనలే తెలంగాణ మొత్తం జరుగుతాయి. ప్రజల ఇళ్లు కూల్చేసిన ప్రభుత్వం నిస్సిగ్గుగా న్యాయం చేస్తున్నామని చెబుతున్నది. ఇవ్వాళ మంత్రులు 311 మందికి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని ప్రకటించారు. డిసెంబర్ 9 న ముఖ్యమంత్రి వచ్చి గృహప్రవేశం చేస్తారని భట్టి విక్రమార్క చెబుతున్నారు. కానీ మీరు ఇచ్చిన టోకెన్ ల పై మాకు ఇంకా అనుమానం ఉంది. లే ఔట్ చేసి ఫిజికల్ ప్రాపర్టీని ప్రతి కుటుంబానికి చూపించాలి. అంతవరకు పోరాటం చేస్తాం.”

పూర్తి నష్టపరిహారం ఇవ్వాలి
“మీరు కూల్చిన ఇళ్లను కొంతమంది పది లక్షలతో కొంతమంది 20 లక్షలతో కొంతమంది 30 లక్షలతో కట్టుకున్నారు. కానీ మీరు మాత్రం అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెబుతున్నారు. రూ.5 లక్షల మాత్రమే ఇస్తే వారి మిగతా నష్టం ఎవరు భరిస్తారు? బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగిందా లేదా అన్నది మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసుకుంటాం. జస్టిస్ ఈశ్వరయ్య సమక్షంలో మళ్లీ బాధితులతో వెళ్లి మాట్లాడుతాం. వారందరికీ సంపూర్ణ న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. పేదలకు న్యాయం చేసే పోరాటంలో ఎక్కడ కూడా తగ్గేదే లేదు. ప్రగతిశీల శక్తులతో కలిసి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. భవిష్యత్ లోనూ పేదల కోసం చేసే పోరాటంలో కలిసి వచ్చే ప్రగతి శీల శక్తులను కలుపుకొని పోతాం. ఖమ్మంలో భూదాన్ భూముల్లో ఉన్న కూల్చివేతలను ప్రభుత్వం ట్రయల్ గా పరీక్షించింది. ఇక్కడ ఎలాంటి వ్యతిరేకత, అడ్డంకులు రాకపోతే రాష్ట్రంలోని భూదాన్ భూముల్లో ఇదే పని చేయాలని భావించింది. రాష్ట్రంలో ఉన్న లక్షా 74 వేల ఎకరాల భూదాన్ భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడింది. వాటిని కాజేసే కుట్ర వెలుగుమట్ల నుంచి ప్రారంభించారు. అందుకే భూదాన్ భూముల లెక్కపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఆ భూములన్నీ కూడా పేదలకు చెందినవే. వాటిని వారికి పంపిణీ చేయాలి. లేదంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములను పేదలకు పంచుతాం. ప్రతిపక్షాలు మూడేళ్ల తర్వాత న్యాయం చేస్తామని బాధితులకు చెప్పాయి. కానీ అన్యాయం జరిగిన వెంటనే న్యాయం జరగాలి.”
బాధితుల చైతన్య ఫలితమే
” ఇవ్వాళ వెలుగుమట్ల ఆడబిడ్డల చైతన్యం కారణంగానే తక్షణ న్యాయం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, ధర్మసమాజ్ పార్టీ, జాగృతి కార్యకర్తలు చేసింది మామాలు ఫైట్ కాదు. వారి పోరాటం కారణంగా రాష్ట్రంలో ఇవ్వాళ రెవల్యూషన్ వచ్చింది. ఈ పోరాటానికి ప్రస్తుతం విరామం మాత్రమే. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదిక తర్వాత మళ్లీ పోరాటం కొనసాగిస్తాం. ల్యాండ్ ఓనర్ల ఇళ్లు కూల్చేసి వాళ్లను ఖాళీ చేయించామని పోలీస్ కమిషనర్ ఒప్పుకున్నాడు. అలాంటప్పుడు పేద ప్రజలు, ల్యాండ్ ఓనర్ల మీదకు వెళ్లి వాళ్ల ఇళ్లను కూల్చేసిన అధికారులపై కేసులు పెట్టాలి. పేదల భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేసిన అధికారులపై కచ్చితంగా కేసులు నమోదు చేయాలి. కానీ బాధితులకు అండగా నిలిచిన జాగృతి కార్యకర్తలపై కేసులు పెట్టారు. నాపై, విశారదన్ పై పెట్టిన కేసులు ఎత్తివేయకపోయినా పర్వాలేదు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, జాగృతి కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. మా దీక్ష సందర్భంగా ఎన్నో ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. వారందరికీ కృతజ్ఞతలు.”








