• తెలంగాణ భవిష్యత్ మార్చే దారి దీపం కాబోతున్నాం
  • సర్వోదయ తెలంగాణ మా లక్ష్యం
  • తెలంగాణలో మాదే నంబర్ వన్ పార్టీ అవుతుంది
  • ఢిల్లీలో లాబీయింగ్ చేయగలను..గల్లీలో కష్టపడగలను

-తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

(తెలంగాణ జాగృతి కార్యాలయం, నిజామాబాద్)

తెలంగాణ జాగృతి సంస్థను రాజకీయ పార్టీగా మార్చబోతున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఏప్రిల్ 25 వ తారీఖున మేడ్చల్ లోని మునీరాబాద్ వేదికగా పార్టీ ఆవిర్భవ సభ ఉంటుందన్నారు. అదే రోజు పార్టీ జెండా, అజెండా ప్రకటిస్తామని చెప్పారు. శ్రీరామ నవమి సందర్భంగా తన మెట్టినిల్లు నిజామాబాద్ నుంచి కవిత ఈ ప్రకటన చేశారు. తెలంగాణ భవిష్యత్ ను మార్చే దారిదీపంలా జాగృతి పార్టీ ఉంటుందన్నారు. సర్వోదయ తెలంగాణ కోసం తాము పనిచేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతియే మన రాష్ట్ర ప్రాంతీయ పార్టీగా, ప్రతి ఒక్కరి ఇంటిపార్టీగా ఉంటుందన్నారు. కొత్త పార్టీ ఏర్పాటు చేయగానే ఎవరికో బీ టీమ్ అంటూ విమర్శలు చేసే సంస్కృతి ఉండటం బాధాకరమని చెప్పారు. తమ పార్టీ ఎవరికీ బీ టీమ్ కాదని…తమదే తెలంగాణలో నంబర్ వన్ పార్టీ అవుతుందని స్పష్టం చేశారు. కుల, మత, వర్గాలకు అతీతంగా సర్వజనుల కోసం పనిచేస్తామని చెప్పారు. సర్వజనుల్లో వెలుగులు నింపేలా సర్వోదయ తెలంగాణ కోసం తమ పార్టీ పనిచేస్తుందన్నారు. తమ అజెండా ప్రాక్టికల్ గా, ప్రజల ఆమోదం పొందే విధంగా ఉంటుందన్నారు. ఇప్పటికే 50 కమిటీలు వేయటంతో పాటు మేధావులతోనూ చర్చలు జరుపుతున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలు కూడా కొత్తగా ఏర్పాటు చేయబోయే తమ పార్టీ ఏ విధంగా పనిచేయాలో సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. తమ ఫోకస్ అంతా కూడా తెలంగాణ మీదనే ఉంటుందని కవిత స్పష్టం చేశారు. రాజకీయ పార్టీకి ఈగో ఉండకూదన్నారు. గతంలో తనను విమర్శించిన వారైనా సరే తెలంగాణ కోసం పనిచేసే ఉద్దేశం ఉంటే కలిసి రావాలని పిలుపునిచ్చారు. తాను ఏదైనా పని పట్టుకుంటే ఫలితం వచ్చే వరకు కూడా వదిలి పెట్టనని… తెలంగాణ కోసం ఏర్పాటు చేసే రాజకీయ పార్టీ ద్వారా కూడా తెలంగాణ భవిష్యత్ ను మార్చే వరకు పోరాడుతానని చెప్పారు. అవసరమైతే ఢిల్లీలో లాబీయింగ్ చేయగలనని…గల్లీలో కూడా కష్టపడతానని కవిత చెప్పారు. శ్రీరామనవమి సందర్భంగా ఆ శ్రీరాముడి స్ఫూర్తితో పార్టీ ప్రకటన చేస్తున్నానని అన్నారు. పాలన పై ప్రజాభిప్రాయం తీసుకొని వైఫల్యాలను మార్చుకున్న వ్యక్తి శ్రీరామచంద్రుడని కవిత గుర్తు చేశారు. శ్రీరామనవమి రోజు చేసిన పార్టీ ప్రకటన నుంచి పార్టీ ఆవిర్భావం నాటికి ఇంకా 28 రోజులు ఉన్నాయని అన్నారు. ఈ 28 రోజుల్లో అభ్యుదయ, సామాజిక తెలంగాణ కోసం మేధావులతో చర్చలు చేస్తామన్నారు. పార్టీ ఆవిర్భావసభ నాటికి కాశీకి వెళ్లి శివుడికి అభిషేకం చేస్తామని చెప్పారు. ఆ తర్వాత పార్టీ ఆవిర్భాన సభ ఉంటుందన్నారు. తాను ముహుర్తాలను నమ్ముతానని…అందుకే శ్రీరామనవమి రోజు పార్టీ ప్రకటన చేశానన్నారు. కాలనుగుణంగా పనులు చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందని నమ్ముతున్నానని కవిత చెప్పారు. 

Kavitha inviting people to attend April 25 party formation meeting in Medchal

సబ్బండ వర్గాలు సభకు విచ్చేయండి

ఏప్రిల్ 25 న జరిగే పార్టీ ఆవిర్భావసభకు సబ్బండ వర్గాలు రావాలంటూ కవిత ఆహ్వానించారు. తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా నీళ్లు, నిధులు, నియామకాలను సంపూర్ణంగా సాధించుకోలేకపోవటం బాధాకరమన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఆ తర్వాత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కూడా ఇంకా మనం మౌలిక సదుపాయాల కోసం కూడా పోరాటం చేసే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి కూడా బస్సు ప్రమాదాలు, కుక్క కాట్లు, మక్క కొనుగోలు సెంటర్లు వంటి వాటి కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఏంటి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయ్యే వరకు ఒక విధంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక విధంగా ప్రవర్తించటం కొత్త రాజకీయ ఒరవడిగా మారిందన్నారు. ఈ పరిస్థితిని మార్చాలంటే ప్రజల్లో చైతన్యం రావల్సిన అవసరముందన్నారు. ఇచ్చిన మాట అమలు చేయకపోయినా సరే ప్రజలు పట్టించుకోరన్న ధైర్యం రాజకీయ నాయకుల్లో ఉందన్నారు. ఆ విధానం పోవాలంటే ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరముందని చెప్పారు. ప్రతిపక్షంలో ఉంటే క్రిటిసిజం, అధికారంలోకి వస్తే ఎస్కేపిజం అన్నట్లుగా రాజకీయ నాయకుల వైఖరి ఉందని విమర్శించారు. ఇలాంటి రాజకీయాల నుంచి తెలంగాణ భవిష్యత్ ను మార్చాల్సిన అవసరముందని ఆమె చెప్పారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల కోసం జాగృతి 20 సంవత్సరాలుగా పనిచేసిందని కవిత గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ప్రజల కోసం పనిచేసేందుకు అన్ని వర్గాల ఆశీర్వాదం కావాలని ఆమె కోరారు. ఏప్రిల్ 25 న జరిగే పార్టీ ఆవిర్భావ సభకు ప్రతి ఒక్కరూ విచ్చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

ఫలితం వచ్చే వరకు పట్టు వదలను

ఏదైనా పని పట్టుకుంటే ఫలితం వచ్చే వరకు తాను వదలనని కవిత చెప్పారు. 20 ఏళ్లుగా జాగృతి సంస్థ పనిచేస్తున్నదని గుర్తు చేశారు. రాష్ట్రం వచ్చాక, రాకముందు…బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా తాను ప్రజల కోసం పనిచేశానని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 350 మంది రైతులకు జాగృతి సంస్థ తరఫున నాలుగేళ్ల పాటు నెలకు రూ. 2500 పెన్షన్ ఇచ్చామని గుర్తు చేశారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో నిజామాబాద్, పెద్దపల్లి రైల్వే లైన్ ను మూడేళ్లలో పూర్తి చేయించానని కవిత చెప్పారు. 25 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పనిని తాను చేయిస్తానని చెబితే అంతా నవ్వారని కానీ తాను ఆ పనిని పూర్తి చేశానని చెప్పారు. నిజామాబాద్ ప్రజల ఆశీర్వాదంతో ఎంపీగా పార్లమెంట్ కు వెళ్లానని…వారి దయతోనే ఎన్నో పనులు చేసే అవకాశం, ఎందరో పెద్దవాళ్లు పరిచయమయ్యారన్నారు. ప్రజల కోసం అవసరమైతే ఢిల్లీలో లాబీయింగ్ చేస్తానని…గల్లీలో కష్టపడతానని చెప్పారు. నిజామాబాద్ వేదికగా పుట్టిన ఏ ఆలోచన అయినా సరే సక్సెస్ అయ్యిందని…తమ పార్టీ ఆలోచన కూడా కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ కోడలిగా తనకు ఇందూరు ప్రజల ఆశీర్వాదం కావాలన్నారు. తెలంగాణ సోయి లేకపోవటంతోనే బీఆర్ఎస్ ఆదరణ కోల్పోయిందని చెప్పారు. తమ ఫోకస్ అంతా కూడా తెలంగాణ కోసమేనని చెప్పారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే కచ్చితంగా తెలంగాణ రాజకీయాలను మార్చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారుల అనుభవాన్ని రాష్ట్ర అభివృద్ది కోసం ఉపయోగించుకుంటామని అన్నారు. అదే విధంగా వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరె వరకు పోరాటం చేస్తామని చెప్పారు. మన జీవితాన్ని శాసించే రాజకీయాల్లోకి ప్రతి ఒక్కరూ అడుగు పెట్టాలని కవిత కోరారు. రాజకీయాలు రాకెట్ సైన్స్ కాదని అందరూ రాజకీయాల్లోకి వచ్చి మార్పు తెచ్చేందుకు కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాజకీయాల్లో మార్పు తెచ్చే వరకు కూడా పట్టువదలకుండా పోరాటం చేస్తానని ఆమె చెప్పారు.

సీతారామకల్యాణంలో కవిత దంపతులు

నిజామాబాద్ ఖిలా రాం మందిర్ ఉత్సవాలకు హాజరు

శ్రీరామనవమి సందర్భంగా మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత దేవనపల్లి అనిల్ దంపతులు నిజామాబాద్ లోని శ్రీ రఘునాథ ఆలయం (ఖిల్లా రాంమందిర్) లో శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. కవిత దంపతులకు ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం శ్రీ సీతారాముల కల్యాణంలో పాల్గొన్నారు.