• విద్యుత్ ఒప్పందంపై ‘శ్వేతపత్రం’ విడుదల చేయాలి
  • రూ. 27 లక్షల టర్నోవర్ ఉన్న అల్ట్ మిన్ సంస్థలో ₹2,250 కోట్ల పెట్టుబడులా?
  • ఈ రెండు ఒప్పందాలతో సింగరేణి కార్మికుల కష్టాన్ని దోచుకుంటున్నారు 

సింగరేణి జాగృతి నాయకుడు సిద్ధంశెట్టి సాజన్

(రామగుండం)

రాజస్థాన్ తో విద్యుత్ ఒప్పందం, ఆల్ట్ మిన్ సంస్థలో పెట్టుబడుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల శ్రమను దోచుకుంటున్నదని సింగరేణి జాగృతి నాయకుడు సిద్ధంశెట్టి సాజన్ ఆందోళక వ్యక్తం చేశారు. హెచ్ఎంఎస్ నాయకులతో కలిసి ఆదివారం రామగుండం హెచ్ఎంఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజస్థాన్ తో సింగరేణి సంస్థ రూ.16 వేల కోట్లతో కుదుర్చుకున్న ఒప్పందంలో చాలా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఒప్పందంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న రాజస్థాన్ జెన్ కో, ట్రాన్స్ కో లకే విద్యుత్ సరఫరా బాధ్యతలు అప్పగించారని తెలిపారు. రాజస్థాన్ జెన్ కో, ట్రాన్స్ కో లు అప్పులు చెల్లించలేని స్థితిలో ఉంటే ఏంటీ పరిస్థితి అని ప్రశ్నించారు. రూ.16 వేల కోట్ల ఒప్పందంలో రాజస్థాన్ ప్రభుత్వం వాటా, సింగరేణి వాటా ఎంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఒప్పందంలో భాగంగా రాజస్థాన్ జెన్ కో, ట్రాన్స్ కో సంస్థలు సక్రమంగా చెల్లింపులు జరుపుతాయని గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే  లక్షా 15 వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న ఆ సంస్థలు ఒక వేళ డబ్బులు చెల్లించకపోతే ఎలా అని అడిగారు. సింగరేణికి రావల్సిన నిధుల భద్రత కోసం ఎస్క్రో ఖాతా (Escrow Account) ఏర్పాటు చేశారా? అని నిలదీశారు. విద్యుత్‌ను సరఫరా చేసే క్రమంలో అయ్యే వీలింగ్ ఛార్జీల భారం ఎవరు భరిస్తారు? సుదూర ప్రాంతాలకు విద్యుత్ చేరవేసేటప్పుడు జరిగే ట్రాన్స్‌మిషన్ నష్టాలు (Transmission Loss) ఎవరు భరిస్తారో చెప్పాలన్నారు.  ఒకవేళ రాజస్థాన్ ట్రాన్స్‌కో (Transco), జెన్‌కో (Genco) సంస్థలు బకాయిలు చెల్లించకపోతే, సింగరేణి కార్మికుల ప్రయోజనాలకు భంగం కలగదా  అని ప్రశ్నించారు. ఈ మొత్తం ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. 

27 లక్షల అల్ట్ మిన్ సంస్థలో ₹2,250 కోట్ల పెట్టుబడా?

రూ. 27 లక్షల విలువైన అల్ట్ మిన్ అనే సంస్థలో రూ. 2,250 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించటాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇంత చిన్న సంస్థలో ఇన్ని వేల కోట్లు ఎలా పెట్టుబడులు పెడుతున్నారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని దీని వెనుక ఉన్న వారి పేర్లను బయట పెట్టాలని కోరారు. లిథియం బ్యాటరీల టెక్నాలజీ కనుమరుగు అవుతున్న ఈ దశలో లిథియం బ్యాటరీల తయారీ పేరుతో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎందుకు పెడుతున్నారో చెప్పాలన్నారు. సింగరేణిలో 15 వేల మంది కొత్త ఉద్యోగులను తీసుకుంటే భారీగా భారం పడిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెబుతున్నారని… కానీ ఇలా ఊరు, పేరు లేని కంపెనీల్లో వేల కోట్ల పెట్టుబడులు పెట్టటం సంస్థ ప్రయోజనాలను దెబ్బ తీయటం కాదా అని సాజన్ ప్రశ్నించారు. 

పెద్ద ఎత్తున ఉద్యమం

ఈ రెండు ఒప్పందాలకు సంబంధించిన అన్ని వివరాలను ప్రభుత్వం బయట పెట్టాలని సాజన్ కోరారు. లేదంటే ఈ అంశంపై జాగృతి, హెచ్ఎంఎస్ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. ప్రతి సింగరేణి కార్మికుడికి ఈ ఒప్పందాలతో జరిగే నష్టాన్ని వివరిస్తామని ఆయన చెప్పారు. సింగరేణి కార్మికుల చెమట, కష్టాన్ని ఇలా అక్రమాలకు వాడుకుంటామంటే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. మీడియా సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు పార్వతీ రాజిరెడ్డి, భువన చంద్ర, నవీన్, కార్తీక్, శ్రీకాంత్, శ్రీనివాస్, శ్రవణ్ పాల్గొన్నారు.