- ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
- బీఆర్ఎస్ లో ఉండి న్యాయం చేయలేకపోయా
- ఆనాటి ప్రభుత్వ పాపంలో నాకూ భాగం ఉంది. నన్ను క్షమించండి
- ఏజెన్సీలకు ప్రభుత్వం కొమ్ము కాస్తూ 5 లక్షల మందికి అన్యాయం చేస్తున్నది
ఇందిరా పార్క్ వద్ద ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నాలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత
(ధర్నా చౌక్, ఇందిరా పార్క్, హైదరాబాద్)
ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి రెండు రోజుల సమయమిస్తున్నామని…ఈ లోగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నాచౌక్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి పై ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే అసలు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల ఊసే ఉండదని భావించామని చెప్పారు. కానీ విచిత్రంగా ఉన్న పర్మినెంట్ ఉద్యోగాలనే ఔట్ సోర్సింగ్ గా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉన్నానని…ఆనాటి పాపంలో తనకూ భాగం ఉందని చెప్పారు. అప్పుడు మీకు న్యాయం చేయలేకపోయినందుకు మీ సోదరిగా క్షమాపణలు కోరుతున్నానన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పట్టించుకోవటం లేదనే కాంగ్రెస్ ను గెలిపిస్తే వాళ్లు కూడా పట్టించుకోవటం లేదన్నారు. కోదండరాం, హరగోపాల్ లాంటి వాళ్లు చెబితేనే తెలంగాణ ఉద్యమంలో లేని రేవంత్ రెడ్డికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మద్దతు పలికారని చెప్పారు. ఇవ్వాళ కోదండరాం, హరగోపాల్ లాంటి మేధావుల మౌనం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పాలిట శాపంగా మారిందన్నారు.

మరో తెలంగాణ ఉద్యమం
రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన ఈ ఉద్యమం మరో తెలంగాణ ఉద్యమంలా ఉందని కవిత అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ ఏ విధంగా చేశామో…అలాగే హాఫ్ మిలియన్ ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు హైదరాబాద్ వీధుల్లో మార్చ్ చేపట్టాలని పిలుపునిచ్చారు. అప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వం స్పందిస్తుందన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానం కారణంగా కేవలం 9 వందల ఎజెన్సీలు మాత్రమే లాభం పొందుతున్నాయన్నారు. వాటికి కూడా జీఎస్టీ 18 నుంచి 5 శాతానికి తగ్గిస్తే ఆ ప్రయోజనం కూడా ఉద్యోగులకు దక్కేలా ప్రభుత్వం ఏమీ చేయటం లేదని విమర్శించారు. రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై రూపాయి భారం పడకుండా సమస్య పరిష్కారించే అవకాశం ఉన్నప్పటికీ ఎజెన్సీలకు ఎందుకు కొమ్ము కాస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ధర్నా చౌక్ ఎత్తివేసి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తే…కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎన్ని రోజులైనా ధర్నా చేసుకొని మీ చావు మీరు చావండన్నట్లుగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. సమస్యపై పోరాటం మాత్రమే కాదు…పరిష్కారమయ్యే వరకు కొట్లాడటం తెలంగాణ బిడ్డల లక్షణమని చెప్పారు. ఖమ్మం వెలుగుమట్ల బాధితుల విషయంలో తాను, విశారదన్ మహారాజ్ కలిసి అన్నం ముట్టకుండా వారికి న్యాయం చేసే వరకు పోరాటం చేశామన్నారు. అది శాంపిల్ మాత్రమేనని భవిష్యత్ లోనూ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఇలాగే పోరాటం చేస్తామని కవిత స్పష్టం చేశారమా అధికారంలో అందరూ రెగ్యులర్ ఉద్యోగులే

తాము త్వరలోనే రాజకీయ పార్టీగా అవతరించబోతున్నట్లుగా కవిత తెలిపారు. ఈ లోపే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. లేదంటే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానం ఇప్పటికీ కొనసాగటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా జాగృతి అధికారంలోకి వస్తే అసలు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అనే విధానాన్నే లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందించేందుకు ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థ మాత్రమే ఉండాలన్నది తమ విధానమని తెలిపారు.








