పార్టీ ఆవిర్భావంపై కవిత సమాలోచనలు
జాగృతి శ్రేణులతో చర్చలు
బుధవారం నుంచి మూడురోజులు వరుస సమావేశాలు
(హైదరాబాద్)
రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో తెలంగాణ జాగృతి క్యాడర్ తో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమాలోచనలు జరుపనున్నారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు వరుసగా ఉమ్మడి జిల్లాల వారిగా నాయకులు, కార్యకర్తలతో చర్చలు జరుపనున్నారు. పార్టీ ఏర్పాటు కోసం వివిధ వర్గాల ప్రజల సమస్యలు, వాటికి పరిష్కారాలు, తెలంగాణ రాష్ట్ర స్వయం సమృద్ధి కోసం రూపొందించాల్సిన బ్లూ ప్రింట్ పై 50 కమిటీలు ఏర్పాటు చేసి స్టడీ చేసిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇప్పుడు క్యాడర్ నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. జాగృతి నాయకులు, కార్యకర్తలతో కవిత సమావేశాల షెడ్యూల్ ను మంగళవారం జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి విడుదల చేశారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు సమావేశాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 1న బుధవారం హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. గురువారం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలు, శుక్రవారం నల్గొండ మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారని తెలిపారు.








