చేనేత కార్మికుల పొట్టకొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
విద్యార్థుల యూనిఫాంల ఆర్డర్‌ను ఏకపక్షంగా రద్దు చేయడం దుర్మార్గమైన చర్య
కావల్సిన వారికి మేలు చేసేందుకు చేనేత కార్మికులకు అన్యాయం
-తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
(హైదరాబాద్) :
రేవంత్ రెడ్డి సర్కార్ చేనేత కార్మికుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసే కుట్రలు చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉన్న విద్యాశాఖ ఆధ్వర్యంలోని యూనిఫాంల తయారీ ఆర్డర్ ను ఏకపక్షంగా రద్దు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆర్డర్లపై ఆధారపడిన చేనేత కార్మికుల పొట్ట కొట్టే దుర్మార్గం చేస్తున్నారని విమర్శించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏటా సుమారు రూ. 105 కోట్ల విలువైన యూనిఫాంల ఆర్డర్ ను రాష్ట్రంలోని 393 చేనేత సహకార సంఘాలకు ఇస్తుంటారని, దీని ద్వారా సహకార సంఘాల్లోని వేల మంది చేనేత కార్మికులు ఉపాధి పొందుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా విద్యాశాఖ యూనిఫాంల ఆర్డర్ రద్దు చేయటంతో ఇప్పుడు కార్మికులు వీధిన పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ శాఖలు, ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన రూ. 200 కోట్ల విలువైన దుప్పట్లు, ఇతర దుస్తుల పంపిణీకి సంబంధించిన ఆర్డర్ ను కూడా టెస్కోకు ఇప్పటికీ ఇవ్వకపోవడం కార్మికులను సంక్షోభంలోకి నెట్టివేయడమేనన్నారు. గడువు ముగిసినప్పటికీ టెస్కోకు ఆర్డర్లు ఇవ్వకుండా ఆ సంస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కావల్సిన ప్రైవేట్ వ్యక్తులకు ఈ ఆర్డర్లను ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. చేనేత కార్మికులకు అన్యాయం చేసే ఈ చర్యను వెంటనే ఉపసంహరించుకోవాలని కవిత ప్రభుత్వానికి సూచించారు. లేదంటే కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.








