- నియామకాలపై కాదు సింగరేణిలో మీ అవినీతిపై ఎంక్వైరీకి సిద్ధమా , తెలంగాణ ప్రభుత్వానికి కల్వకుంట్ల కవిత సవాల్
- రాజస్థాన్ తో సోలార్ ఒప్పందంలో, లిథియం రిఫైనరీ కోసం అల్ట్ మిన్ అనే చిన్న సంస్థతో అగ్రిమెంట్ లో అడ్డగోలు అవినీతి
- అల్ట్ మిన్ కంపెనీ తో రూ. 2250 కోట్ల ఒప్పందంపై శ్వేతపత్రం విడుదల చేయాలి. దీని వెనుకున్న బడా బాబుల పేర్లు బయటపెట్టాలి
- నైనీ కోల్ బ్లాక్ అవినీతిని ప్రశ్నిస్తే కార్మికులపై ఆక్రోషం పెంచుకున్నారు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫైర్
“సేవ్ సింగరేణి” రౌండ్ టేబుల్ సమావేశంలో ఐదు తీర్మానాలు
సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు అవసరమైతే మరో ఉద్యమం
(తెలంగాణ జాగృతి కార్యాలయం, హైదరాబాద్) :
సింగరేణిలో డిపెండెంట్ కార్మికుల నియామకాల జోలికి వస్తే ప్రభుత్వం తాట తీస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కార్మికుల నియామకాలపై విజిలెన్స్, ఏసీబీ విచారణ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల అసెంబ్లీలో ప్రకటించటంపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల నియామకాలపై కాదు మీ ప్రభుత్వ అవినీతిపై విచారణకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. నైనీ బ్లాక్ అవినీతి బాగోతాన్ని బయటపెటట్టంతోనే కార్మికులపై భట్టి విక్రమార్క ఆక్రోషం పెంచుకున్నారని వారిపై కక్ష తీర్చుకునేందుకే విచారణ అంటూ డ్రామా మొదలు పెట్టారని మండిపడ్డారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివారం “సేవ్ సింగరేణి” రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సింగరేణి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు జరిగిన నష్టాన్ని కొంత పూడ్చేందుకు గత ప్రభుత్వం కొన్ని సడలింపులతో 20 వేలమంది కార్మికులకు ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వ పాలసీపై ఎంక్వైయిరీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణకు ప్రాణప్రదాయని అయిన సింగరేణిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి భావోద్వేగం, ప్రేమ, అవగాహన లేవంటూ మండిపడ్డారు. అందుకే వారికి కార్మికుల సమస్యలు పట్టటం లేదన్నారు.

సోలార్, లిథియం రిఫైనరీ ఒప్పందాలపై విచారణకు సిద్ధమా?
సింగరేణిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాల చిట్టాను కవిత బయటపెట్టారు. రాజస్థాన్ ప్రభుత్వంతో సింగరేణి సంస్థ రూ. 11 వేల కోట్ల ఒప్పందం చేసుకుందని చెప్పారు. ఒక మెగావాట్ విద్యుత్ కు అయ్యే ఖర్చుకు మూడు రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారన్నారు. అదే విధంగా లిథియం రిఫైనరీ అంటూ అల్ట్ మిన్ అనే చిన్న కంపెనీతో రూ. 2250 కోట్ల ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. రూ. 27 లక్షలు కూడా ఆదాయం లేని సంస్థతో రూ. 2250 కోట్ల ఒప్పందం ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు. ఈ రెండు ఒప్పందాల్లో అడ్డగోలుగా అవినీతి ఉందన్నారు. వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని…ఈ ఒప్పందాల వెనుక ఉన్న బడా బాబుల పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఇచ్చే జీతాల కారణంగా సంస్థపై భారం పడుతుందన్నట్లుగా డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నారని…కానీ ప్రభుత్వం చేతగానీ తనంతో సింగరేణిని సర్వనాశనం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. డీజిల్ కుంభకోణంలో రూ. 250 కోట్లు, అదనపు ఛార్జీలు వసూలు చేయలేక వెయ్యి కోట్లకు పైగా, లీకేజీ కారణంగా రూ.24 కోట్లు, నిబంధనల ఉల్లంఘనల కారణంగా రూ.74 కోట్లు సింగరేణికి నష్టం చేశారని కవిత చెప్పారు. ఈ విషయం తాను కాదు కాగ్ నివేదిక వెల్లండించిందన్నారు. సింగరేణి ఓబీ కాంట్రాక్టర్లు, నాయకులు, అధికారులు, సింగరేణిలో బొగ్గు మింగిన వాళ్లపై ముందు విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.
బకాయిలు చెల్లించకపోవటంతోనే
ప్రభుత్వం చేతగాని తనంతోనే సింగరేణి కి ఇబ్బందులు తలెత్తాయని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ప్రభుత్వం దాదాపుగా రూ.47 వేల కోట్లు సింగరేణికి బకాయి ఉందని కవిత గుర్తుచేశారు. ఈ బకాయిలు చెల్లించకపోవటంతోనే సంస్థ నిర్వహణ భారంగా మారిందన్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తే ఆ డబ్బుతో వచ్చే వడ్డీతో సంస్థ సజావుగా సాగుతుందన్నారు. చెమట చిందించి సింగరేణిని లాభాల బాట పట్టిస్తున్న కార్మికులకు లాభాల్లో వాటా ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెళ్లి ప్రభుత్వంతో మాట్లాడగానే సింగరేణిలో బొగ్గు ప్రొడక్షన్ తగ్గించారని కవిత చెప్పారు. సింగరేణి విషయంలో ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదని…కార్మికుల సమస్యలపై ప్రభుత్వానికి అవగాహన లేదని అన్నారు. సింగరేణిలో డింపెండెంట్ ఉద్యోగాలు, అలియాస్ పేర్ల అంశం, పాత వీఆర్ఎస్ స్కీమ్ ను కొనసాగించటం, మెడికల్ బోర్డు ఏర్పాటు, గతంలోనే వైద్య పరీక్షల్లో పాసైన 350 మంది అభ్యర్థులకు పోస్టింగులు, ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కవిత డిమాండ్ చేశారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికులది లైఫ్ రిస్క్ సెక్టార్ కనుక వారికి ఇన్ కం ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలన్నారు. 2015 లోనే పార్లమెంట్ లో ఈ అంశాన్ని ప్రస్తావించానని ఈ సందర్భంగా కవిత గుర్తు చేశారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో ఐదు తీర్మానాలు
సేవ్ సింగరేణి రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యంగా ఐదు తీర్మానాలు చేశారు. 1. కేంద్రం లేబర్ కోడ్ కు సంబంధించి తెచ్చిన నాలుగు నల్ల చట్టాలను అమలు చేసేది లేదని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి. అసెంబ్లీలో తీర్మానం చేయాలి. 2. మెడికల్ బోర్డును మానవతా దృక్పథంతో ఆలోచించి వెంటనే ఏర్పాటు చేయాలి. పెండింగ్ కేసులు పరిష్కరించాలి. 3. అలియాస్ నేమ్స్ సమస్యను పరిష్కరించాలి. వీటికి లీగాలిటీ వర్తించదు. పొలిటికల్ విల్ ఉంటే సమస్య పరిష్కారం చేయవచ్చు. 4. సింగరేణి సంస్థ అల్ట్ మిన్ కంపెనీతో కంపెనీతో రూ. 2250 కోట్లతో చేసుకున్న ఒప్పందంపై శ్వేత పత్రం విడుదల చేయాలి. 5. నైనీ, తాడిచర్ల వంటి బొగ్గు గనులను కొత్త వచ్చే గనులను కూడా సింగరేణి సంస్థయే ఆపరేట్ చేయాలి. వీటిని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రూపంలో పంపిస్తామని కవిత తెలిపారు. లేబర్ కోడ్ కు సంబంధించి కేంద్రం తెచ్చిన నాలుగు నల్ల చట్టాలను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ రాష్ట్రంలో అమలు చేసేది లేదని తేల్చిచెప్పారని గుర్తు చేశారు. అలాంటి నిర్ణయం తీసుకున్న దీదీకి సెల్యూట్ చేస్తున్నానన్నారు. కేరళం, తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ చట్టాలను అమలు చేయటం లేదని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణలో ఎందుకు ఈ చట్టాలను అమలు చేయమని చెప్పటం లేదని ప్రశ్నించారు. తాము చేసిన ఐదు తీర్మానాల విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

మరో ఉద్యమానికి సిద్ధం.
సింగరేణి తెలంగాణకు ప్రాణప్రదాయని అని కవిత అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సంస్థను కాపాడుకుంటామన్నారు. అవసరమైతే మరో ఉద్యమానికి కూడా సిద్దమని చెప్పారు. మరో 20 రోజుల్లో రాజకీయ శక్తిగా తాము రాబోతున్నామన్నారు. ఈ లోపు ప్రభుత్వం సింగరేణి సమస్యలు పరిష్కరించకపోతే బొగ్గుబాయి బాట పడతామని హెచ్చరించారు. తెలంగాణలో ప్రజల కోసం, కొత్త తరహాలో చేసే రాజకీయాలు ఎలా ఉంటాయో చూపిస్తామన్నారు.
ప్రభుత్వాన్ని వదలిపెట్టం
సింగరేణి సంస్థను నాశనం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ హెచ్చరించారు. అవసరమైతే మరో ఉద్యమం ద్వారా సంస్థను కాపాడుకుంటామన్నారు. సింగరేణి సంస్థ కోసం జాగృతి, హెచ్ఎంఎస్ చేసే ఏ పోరాటానికైనా తమ మద్దతు ఉంటుందని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సెంట్రల్ కమిటీ మెంబర్ ప్రసాద్ చెప్పారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ ప్రతినిధులు, సింగరేణి కార్మిక సంఘాల నాయకులు హాజరయ్యారు.








