ప్రొఫెసర్ అన్సారీని పరామర్శించిన కవిత
రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వలేని ప్రభుత్వమంటూ విమర్శ
(హైదరాబాద్)
బంజారాహిల్స్ లోని వెల్ నాక్స్ రిహాబిలిటేషన్ సెంటర్ లో చికిత్స పొందుతున్న ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మహ్మద్ అన్సారీని సోమవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. అన్సారీని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన అనారోగ్యానికి దారి తీసిన పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితి, అందిస్తున్న చికిత్స గురించి డాక్టర్లు, కుటుంబ సభ్యుల వద్ద ఆరా తీశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..అన్సారీ ప్రొఫెసర్ గా, అంతకు ముందు విద్యార్థిగా వర్సిటీలో జరిగిన అక్రమాలను బయటికి తీశారన్నారు. విద్యార్థుల కోసం పని చేయడం.. ప్రభుత్వ విధానాలపై పోరాటలు చేయడానికే తన వృత్తిగత జీవితాన్ని అంకితం చేశారన్నారు. 2023 లో ఆయన రిటైర్ అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం రిటైర్ మెంట్ బెన్ ఫిట్లు ఇవ్వలేదని విమర్శించారు. ఆయన తీవ్ర ఆనారోగ్యం పాలైతే ట్రీట్ మెంట్ కోసం క్రౌడ్ ఫండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని కవిత మండిపడ్డారు. ఇదే విధంగా దాదాపు 143 మంది ప్రొఫెసర్లు రిటైర్ మెంట్ బెన్ ఫిట్ల కోసం ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. ప్రొఫెసర్లు మాత్రమే కాదు రిటైరైన టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా రిటైర్ మెంట్ బెన్ ఫిట్స్ కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. వీలైనంత తొందరగా వారికి రావల్సిన ప్రయోజనాలను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిటైర్ మెంట్ బెనిఫిట్ల కోసం వేచి చూస్తున్న వారికి ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని కవిత సూచించారు.








