జూన్ 2 లోగా హామీలు నెరవేర్చాలి

జూన్ లోనే ప్రైవేట్ స్కూల్స్ ఫీజు దోపిడీ నియంత్రణకు చట్టం చేయాలి

సన్న వడ్లకు బోనస్ ఎగ్గొట్టేందుకు గ్రేడ్ బీ అంటూ మోసం చేస్తున్న కర్కోటక సర్కార్ ఇది

వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, సన్న వడ్లకు బోనస్ ఇవ్వాలి

లేదంటే ప్రభుత్వంపై ఉద్యమం తప్పదు

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

కుత్బుల్లాపూర్ లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ. పార్టీ లోకి భారీగా చేరికలు

హైదరాబాద్:
తెలంగాణ అమరవీరులకు, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు జూన్ 2 లోగా నెరవేర్చకపోతే మరో ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ప్రైవేట్ విద్య సంస్థల ఫీజు దోపిడీని నియంత్రించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీలో చేరికల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మైనార్టీ నేత అహ్మద్ తో పాటు పెద్ద ఎత్తున ఆయన అనుచరులు టీఆర్ఎస్ లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కవిత. ఈ సందర్భంగా మాట్లాడారు. కుత్బుల్లాపూర్ నుంచే టీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చాక తామిచ్చిన పాంచజన్యం హామీలను అమలు చేస్తామన్నారు. కుత్బుల్లాపూర్ లో 20 ఏళ్ల క్రితం నిర్మించిన అమరుల స్థూపాన్ని జూన్ 2 లోగా ఆవిష్కరించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. లేదంటే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అమరుల స్థూపాన్ని తామే ఆవిష్కరిస్తామని హెచ్చరించారు.

జూన్ 2 లోగా హామీలు అమలు చేయాలి

తెలంగాణ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను జూన్ 2, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లోగా నెరవేర్చాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయటం చేతకాక కేకే కమిటీ పేరుతో కాలయాపన చేసేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని ఆమె మండిపడ్డారు. జూన్ 2 రోజు జెండా ఎగురవేసే కార్యక్రమం సందర్భంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించాలని అల్టిమేటం జారీ చేశారు. లేదంటే ఈ ప్రభుత్వం మీద మరో ఉద్యమం తప్పదని కవిత హెచ్చరించారు. ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీ మీద కూడా ప్రభుత్వం వెంటనే చట్టం చేయాలని కోరారు. ఇప్పటికే ఈ అంశంపై పలుమార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఫీజు దోపిడీ నియంత్రణ జరగాలంటే జూన్ లో కచ్చితంగా ఫీజు నియంత్రణ చట్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

TRS Chief Kalvakuntla Kavitha issued a strong warning to the Telangana government over pending promises to martyrs, fee regulation for private schools and bonus payments for fine rice farmers. She said another public movement is inevitable if commitments are not fulfilled before June 2.

కుత్బుల్లాపూర్ నుంచే జైత్రయాత్ర

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకుంటామని కవిత ధీమా వ్యక్తం చేశారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో తమ అభ్యర్థులు పోటీ లో ఉంటారని చెప్పారు. కుత్బుల్లాపూర్ లో మొట్ట మొదటగా జెండా ఎగురవేసుకున్నట్లే ఇక్కడి నుంచే తొలి ఎమ్మెల్యే ను గెలిచుకొని జైత్రయాత్ర ప్రారంభిస్తామన్నారు. ఈ నియోజకవర్గంలో 20 ఏళ్ల క్రితమే నిర్మించిన అమరుల స్థూపాన్ని ఇప్పటికీ కూడా ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ పార్టీ అని చెప్పుకునే పార్టీని గెలిపించినప్పటికీ అమరుల స్థూపాన్ని ఆవిష్కరించలేదని చెప్పారు. జూన్ 2 లోగా ప్రభుత్వం అమరుల స్థూపాన్ని ఆవిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో తామే స్థూపాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు.

అన్ని వర్గాలు ప్రతిబింబిచేలా జెండా రూపకల్పన

తెలంగాణ రక్షణ సేన జెండాలోని పసుపు రంగు సౌభాగ్యానికి సూచిక అని కవిత చెప్పారు. పసుపంటే మన తంగేడు పువ్వు అని గుర్తు చేశారు. ఆదివాసీ, బీసీ లను సూచించేది పసుపు అని చెప్పారు. జెండాలోని మరొక రంగు నీలిరంగు అన్నారు. నీలి రంగు అంటే కూలీ, నాలీ చేసే కార్మికులు,ఎస్సీ, ఎస్టీ, ఆడబిడ్డలని చెప్పారు. ఇక పచ్చ రంగు పర్యావరణానికి సూచిక అని చెప్పారు. మైనార్టీలను కూడా పచ్చ రంగు సూచిస్తుందన్నారు. అన్ని వర్గాలను ప్రతిబింబిచేలా తెలంగాణ రక్షణ సేన జెండాను రూపొందించామన్నారు. తెలంగాణ ప్రజల హక్కుల రక్షణ కోసం పుట్టిన పార్టీయే తెలంగాణ రక్షణ సేన అని చెప్పారు.ఈ ప్రాంతం దుఖం పోయేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలంతా సైనికుల మాదిరిగా పోరాడాలని సూచించారు.

పాంచజన్యం అమలు చేస్తాం

తెలంగాణలో విద్య, వైద్యం కోసం చేస్తున్న ఖర్చు కారణంగా ప్రజల ఇళ్లు గుల్ల అవుతున్న పరిస్థితి ఉందన్నారు. ప్రజలకు మంచి చేయాలంటే కార్పొరేట్ స్థాయి వైద్యం, విద్యను పూర్తిగా ఉచితంగా అందించాల్సి ఉందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే విద్య, వైద్యం విషయంలో ప్రజలపై పైసా భారం పడనివ్వమని కవిత చెప్పారు. రైతులను ఈ దుర్మార్గపు, కర్కోటక ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఒక్క రైతు కూడా సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవటంతోనే ధాన్యం కుప్పలపై రైతులు చనిపోతున్న పరిస్థితి ఉందన్నారు. సన్న వడ్లకు బోనస్ ఎగ్గొట్టేందుకు గ్రేడ్ బీ అంటూ రాస్తున్నారని కవిత మండిపడ్డారు. రైతుల పక్షాన తాము పోరాడుతామని భరోసా ఇచ్చారు. యువతకు రూ. 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు వారు వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు ఇస్తామని చెప్పారు. రాష్ట్ర యువతపై నమ్మకం ఉంచి వారి కలలను సాకారం చేసేందుకు తాము ప్రోత్సహం అందిస్తామన్నారు. సామాజిక న్యాయ తెలంగాణ కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు అన్ని వర్గాలకు న్యాయం చేసేలా పోరాటం చేస్తామని చెప్పారు. నేను మీ బిడ్డను మీకు ఏం కావాలో నాకు తెలుసు అంటూ ప్రజలను ఉద్దేశించి కవిత వ్యాఖ్యనించారు.