టీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

సబ్బండ తెలంగాణ వర్గాల గతి మారే అభివృద్ధి ప్రణాళిక తయారు చేస్తున్నాం

 -కల్వకుంట్ల కవిత

(తెలంగాణ రక్షణ సేన కార్యాలయం, బంజారాహిల్స్)

సబ్బండ తెలంగాణ వర్గాల గతి మారే అభివృద్ధి ప్రణాళిక తయారు చేస్తున్నామని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. ఆ అభివృద్ధి ప్రణాళిక  రాష్ట్రంలో విప్లవాత్మక మార్పు తెస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సీనియర్ నాయకులు బోడ జనార్థన్ గురువారం తెలంగాణ రక్షణ సేనలో చేరారు. టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు సుమారు 500 మంది జనార్ధన్ అనుచరులు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కవిత జనార్ధన్ తో వారి అనుచరులను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బోడ జనార్థన్ చాలా చిన్న వయసులో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపారు. చాలా చిన్న వయసులోనే ఆయన కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారన్నారు. ఆర్టీసీ ఛైర్మన్ గా కూడా పనిచేసిన అనుభవం ఆయనకు ఉందన్నారు. 

ఈ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఒరవడి తేవాలని వచ్చిన టీఆర్ఎస్ లో బోడ జనార్థన్ చేరిక నూతన బలాన్ని ఇస్తుందని చెప్పారు. వారి హోదాకు తగిన విధంగా పార్టీలో ప్రాధాన్యం ఇస్తామన్నారు. సమసమాజ స్థాపన కోసం ఏర్పడిన టీఆర్ఎస్ కచ్చితంగా ఈ రాష్ట్ర ఇంటి పార్టీగా మారుతుందని కవిత స్పష్టం చేశారు. ఈ ముఖ్యమంత్రి కార్మికులకు మినిమమ్ వేజేస్ ఫిక్స్ చేశామంటూ గతంలో ఎవరూ ఇలా చేయలేదని చెబుతున్నారన్నారు. కానీ ఆయన కార్మికులను చాలా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆరేళ్ల క్రితమే మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు కార్మికులకు మినిమమ్ వేజేస్ రూ. 20 వేలు ఉండాలని అప్పటి సీఎంకు లేఖ రాశారన్నారు. ఆయన ఏదైతే కేటగిరీ చెప్పారో ఆ కేటగిరీకి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి రూ. 16 వేల వేతనం ఫిక్స్ చేశారన్నారు. అంటే ఆరేళ్ల తర్వాత నాలుగు వేలు తగ్గించి రూ. 16 వేల వేతనం ఇస్తామని గొప్పగా చెబుతున్నారని ఎద్దెవా చేశారు. ఇది కార్మికులను ఘోరంగా మోసం చేయటమేనని విమర్శించారు. ఇక సింగరేణిలో బీభత్సమైన అవినీతికి తెరలేపారని చెప్పారు. ఒక రూపాయితో అయ్యే పనికి పది రూపాయలు ఖర్చు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని తెలిపారు. 

ప్రశ్నిస్తే శిక్షిస్తారా

సింగరేణి కార్మికుల చెమట, రక్తాన్ని పీల్చుకొని తింటున్నారన్నారని కవిత ఆరోపించారు. 

తెలంగాణ వచ్చాక మనం డిపెండెంట్ ఉద్యోగాలు సాధించుకున్నామని, కానీ కాంగ్రెస్ వాటిని పోగొట్టే పనిచేస్తున్నదని విమర్శించారు. ఐఎన్ టీయూసీ, దాని తోక పార్టీతో అధికారం చెలాయిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. సింగరేణిలో కొత్త గనులు తెచ్చి మన వాళ్లకు ఉద్యోగాలు రావాలని ప్రయత్నిస్తే వాటిని కూడా రాకుండా చేస్తున్నారని చెప్పారు. బోడ జనార్థన్ రాకతో హెచ్ఎంఎస్ కు సింగరేణిలో మరింత బలం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన సహకారంతో సింగరేణి కార్మికుల కోసం ప్రభుత్వంపై మరింత గట్టిగా పోరాటం చేస్తామని వెల్లడించారు. ఈ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను కూడా మోసం చేస్తున్నదని విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో  విలీనం చేస్తామని చెప్పి…రెండేన్నరేళ్లు మొద్దు నిద్రపోయిందన్నారు. రాజుగౌడ్ అనే ఆర్టీసీ డ్రైవర్ ఆత్మబలిదానం చేసుకునే వరకు ఆ ఊసే ఎత్తలేదని దుయ్యబట్టారు. పెట్రోల్ ధరలపై ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకులను ముందు వడ్ల కొనాలని సూచించిన ఆర్టీసీ డ్రైవర్ ను ఉద్యోగంలోంచి తీసేశారని మండిపడ్డారు. మళ్లీ మనమంతా పోరాటం చేయటంతో వెనక్కి తగ్గారని కవిత వివరించారు. ప్రశ్నిస్తే తట్టుకోలేని కర్కోటక పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్నదని విమర్శించారు. అందుకే తెలంగాణ రక్షణ సేన ప్రశ్నించటం, పోరాడటం, పరిష్కరించటం అనే విధానంతో ముందుకు వెళ్తోందని తెలిపారు. కొంతమంది ప్రశ్నిస్తారు.. మరికొంతమంది పోరాటం చేస్తారు.. కానీ మనం ప్రశ్నించి, పోరాడి, పరిష్కరించే వరకు ఊరుకోమని స్పష్టం చేశారు. జనంబాట ద్వారా  ప్రజల్లోకి వెళ్లిన కారణంగా దాదాపు 25 సమస్యలను ప్రభుత్వం తీర్చిందని కవిత వివరించాారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును టీఆర్ఎస్ ప్రశ్నిస్తేనే ముఖ్యమంత్రి రివ్యూ చేశారని గుర్తు చేశారు. ఉద్యమాలు చేయకండి మేము పనులు ప్రారంభిస్తామని చెప్పారని తెలిపారు. నల్గొండలో 35 ఏళ్లుగా పెండింగులో ఉన్న బ్రిడ్జి పనులను జనంబాటలో ప్రస్తావించడంతో ఇప్పుడు ఆ బ్రిడ్జి పనులను ప్రభుత్వం ప్రారంభించిందని కవిత చెప్పారు.

ఎన్టీఆర్, కేసీఆర్ కన్నా మంచి ఆలోచన

  బోడ జనార్థన్, మాజీ మంత్రి

ఒక మహిళా నాయకురాలు పార్టీ పెట్టి ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తానని ముందుకు రావటం చాలా ధైర్యంతో కూడిన విషయమని మాజీమంత్రి బోడ జనార్ధన్ అన్నారు. అప్పట్లో ఎన్టీఆర్ కూడు, గూడు, గుడ్డ అనే మూడు అంశాలతో అధికారంలోకి వచ్చారని, ఆ తర్వాత కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ మూడు అంశాలతో అధికారంలోకి వచ్చారని  గుర్తు చేశారు. కానీ కవితమ్మ పాంచజన్యం అంటూ ఐదు కీలకమైన అంశాలను తీసుకున్నారని,  ఎన్టీఆర్, కేసీఆర్ కంటే కూడా ఉన్నతంగా కవితమ్మ ఆలోచించారని ప్రశంసించారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని ఏళ్లు గడిచినా సరే పేదరికం అలాగే ఉందని, అందుకే కవిత పేదలకు ఉచిత విద్య, వైద్యం, సామాజిక న్యాయం అని ముందుకు వచ్చారని చెప్పారు. ఒక మహిళా ముఖ్యమంత్రి అయితే కచ్చితంగా రాష్ట్రం బాగుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కవిత తెచ్చిన మేనిఫెస్టో ఎంతో బాగుండటంతో టీఆర్ఎస్ లోకి వచ్చానన్నారు. రేపటి నుంచి కాంగ్రెస్ పై పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని పిలుపునిచ్చారు. గ్రామగ్రామాన టీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు కష్టపడి పనిచేస్తానని మాటిచ్చారు.