రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి
కమీషన్ల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను బలితీసుకుంటున్నాయి
రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలతో కలిసి ఆందోళన చేస్తాం
తెలంగాణ రక్షణ సేన నాయకులు, మాజీమంత్రి బోడ జనార్థన్
(తెలంగాణ రక్షణ సేన కార్యాలయం, బంజారాహిల్స్)
తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నాయని తెలంగాణ రక్షణ సేన నాయకులు, మాజీమంత్రి బోడ జనార్థన్ విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన ప్రధాన కార్యాలయంలో ఆదివారం టీఆర్ఎస్ నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, గొంగళ్ల రంజిత్, మంచాల వరలక్ష్మితో కలిసి బోడ జనార్థన్ మీడియా సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తే ఇప్పటి వరకు అందులో సగం కూడా కొనుగోలు చేయలేదని వెల్లడించారు. మంత్రులు కమీషన్ల కోసం కక్కుర్తి పడి ధాన్యం కొంటలేరని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారన్నారు. మంత్రులు మాత్రం మిగతా రాష్ట్రాల్లో కన్నా ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశామంటూ సంబరపడిపోతున్నారని దుయ్యబట్టారు. కానీ ప్రభుత్వం పంట కొనుగోలు చేయటం లేదని రైతులు చనిపోతున్నారని చెప్పారు. పంటను తగలబెడుతున్నారని, ప్రభుత్వాన్ని తిడుతూ.. తడిసిన ధాన్యం సంగతేంటనీ ప్రశ్నిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 20 వేలకు కొనుగోలు కేంద్రాలు పెట్టామని చెబితే కేంద్రం మాత్రం ఏడు వేల కేంద్రాలు మాత్రమే ఉన్నాయంటోందని తెలిపారు. గోనె సంచులు లేకపోవటం, గోడౌన్ల కొరత, ట్రాన్ పోర్ట్ ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని జనార్థన్ విమర్శించారు. కేవలం కమీషన్ల కోసమే కేంద్ర, రాష్ట్ర నాయకులు పోటీ పడుతున్నారని తెలిపారు. రైతులు ఇబ్బందులు పడుతున్నా సరే వారిని పట్టించుకోవటం లేదని, అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ప్రభుత్వాలకు రైతులపై ప్రేమ లేదని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన టార్గెట్ కు మించి కొన్నామని ప్రభుత్వం చెబుతోందని, పండించిన ధాన్యంలో ఇంకా సగానికి పైగా కొనుగోలు చేయాల్సి ఉందని, వాటిని ఎవరు కొంటారని ప్రశ్నించారు. పైగా 50 కిలోల బస్తాలో 5 కిలోలు తరుగు పేరుతో తీస్తున్నారని మండిపడ్డారు. రైస్ మిల్లర్లు, దళారులతో కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు ఎంత పంట పండిస్తే అంత పంటను కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. లేదంటే ఊరుకునేది లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేసేలా చేస్తామని స్పష్టం చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను పెంచి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జనార్థన్ డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ వ్యాప్తంగా రైతన్నలతో కలిసి తెలంగాణ రక్షణ సేన ఆందోళన చేస్తుందని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరగవద్దని…ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని టీఆర్ఎస్ అధినేత్రి కవితమ్మ స్పష్టంగా చెప్పారని, రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేసే వరకు తెలంగాణ రక్షణ సేన పోరాటం కొనసాగుతుందని చెప్పారు.








