ఖమ్మం బాలికకు నిమ్స్ లో కవిత పరామర్శ

బాధితురాలి ఆరోగ్య పరిస్థితి.. చిన్నారికి అందిస్తున్న వైద్య సేవల గురించి డాక్టర్లతో ఆరా

బాధితురాలి తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పిన టీఆర్ఎస్ చీఫ్

(నిమ్స్, హైదరాబాద్)

ఖమ్మంలో 12 ఏళ్ల బాలిక పై జరిగిన ఘటన హృదయ విదారకరమైందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. నిందితుడిపై కఠినమైన చట్టాలు ప్రయోగించి త్వరితగతిన శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఖమ్మం అత్యాచారయత్నం బాధితురాలిని శనివారం కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితురాలి కుటుంబం సభ్యులతో మాట్లాడారు. 12 ఏళ్ల తన బిడ్డ జీవితాంతం మంచానికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితురాలి తల్లి ఆవేదనతో చెబుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితికి కారణమైన నిందితుడిని ఉరి తీయాలని బాధితురాలి తల్లి కోరుతున్నారని కవిత చెప్పారు. దురదృష్టమేమిటంటే ప్రభుత్వ పెద్దలే ఈ కేసు వాపసు తీసుకోవాలని ఒత్తిడి తేవడం విచారకరమన్నారు. ఇందులో ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. శిక్ష పడటం ఎంత లేటు అయితే అంత భయం లేని పరిస్థితి ఉంటుందని చెప్పారు. అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకున్న బిడ్డ…బిల్డింగ్ పై నుంచి పడి నడవలేని స్థితికి చేరటం బాధాకరమన్నారు. జీవితాంతం కూడా ఆ బిడ్డ మంచానికే పరిమితమయ్యే పరిస్థితి ఉందన్నారు. బాధితురాలి తల్లితండ్రులు ఇద్దరు కూలీలేనని, బాలికను జీవితాంతం పసిబిడ్డలా చూసుకోవల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కానీ ఆ కుటుంబానికి అంత ఆర్థిక స్థోమత లేదని కవిత తెలిపారు. వారికి ఇళ్లు కూడా లేదని, వెంటనే ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒకేసారి డబ్బు డిపాజిట్ చేయటమో, లేదంటే నెలనెలా రూ.50 వేల పెన్షన్ వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితుడు బెయిల్ పై వచ్చి మళ్లీ బాధిత కుటుంబంపై దాడి చేసే పరిస్థితి కూడా లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే బాధితురాలి కుటుంబానికి భద్రత కల్పించాలని సూచించారు. ఈ సంఘటనలో ప్రభుత్వం కచ్చితంగా మానవీయకోణంలో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మైనర్లపై ప్రతిరోజు 5 అఘాయిత్యాలు జరుగుతున్నాయని కవిత వెల్లడించారు. ముఖ్యమంత్రే హోంమంత్రిగా ఉన్నారని, కానీ ఈ దారుణాల గురించి పట్టించుకోవటం లేదని కవిత విమర్శించారు. 

వెంటనే రివ్యూ చేసి ఇలాంటి ఘోరాలు జరగకుండా మహిళ లోకానికి భరోసా ఇవ్వాలని కోరారు.