లేబర్ కోడ్ చట్టాలు కార్మికులకు వ్యతిరేకం
వాటిని అమలు చేయమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి
-టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
(తెలంగాణ రక్షణసేన, శ్రీరాంపూర్)
లేబర్ కోడ్ చట్టాలు వస్తే కార్మికులకు హక్కులు లేకుండా పోతాయని హెచ్చరించారు. యూనియన్లు ఉండవు.. కార్మికులకు కష్టాలు వస్తే ఎవరికీ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉంటుందని చెప్పారు. టీఆర్ఎస్ సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి వర్క్ షాప్ ను సందర్శించి కార్మికులతో కవిత మాట్లాడారు. కార్మిక చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కవిత సూచించారు. వాటిలో సింగరేణి కార్మికుల రక్షణకు సంబంధించి చాలా అంశాలు ఉంటాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 27 చట్టాలను కుదించి 4 చట్టాలు చేశారని కవిత చెప్పారు. బెంగాల్, కేరళం, తమిళనాడు ప్రభుత్వాలు వాటిని అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానాలు చేశాయని తెలిపారు. మన తెలంగాణలో కూడా ఆ చట్టాలను అమలు చేయమని తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పనిచేస్తుందని తెలిపారు. అండర్ గ్రౌండ్ మైనింగ్ తగ్గించి ఓపెన్ కాస్ట్ మైనింగ్ పెంచాలని కుట్ర చేస్తున్నారని, సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. అండర్ గ్రౌండ్ మైనింగ్ ఉంటేనే ఇక్కడ వారికి ఎంప్లాయి మెంట్, సెక్యూరిటీ ఉంటుందని చెప్పారు. తెలంగాణ వచ్చాక ప్రైవేట్ వారిని రాకుండా చేశామని చెప్పారు. ప్రైవేట్ వాళ్లు టెండర్లు వేయకుండా అడ్డుకున్నామని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారని, రెండు బ్లాకులను ఎండీవో ఇచ్చి ప్రైవేట్ పరం చేశారని విమర్శించారు. ఇప్పుడు దాన్ని మరింత విస్తరించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సంస్థను ప్రైవేట్ పరం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కొట్లాడుతామని ప్రకటించారు.
విద్య, వైద్యం ప్రభుత్వ బాధ్యత
తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని కల్వకుంట్ల కవిత చెప్పారు. ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు కట్టలేని స్థితి ఉందన్నారు. కార్పొరేట్ స్థాయిలో ప్రజలకు ఉచిత విద్య, వైద్యం ఇవ్వాలన్నారు. ఎంత ఖర్చైనా సరే ప్రభుత్వమే దాన్ని భరించాలని సూచించారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్ని రంగాల్లో సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయిందని తెలిపారు. వారందరికీ ఈక్వల్ రైట్స్ రావాలన్నారు. వాటి కోసం టీఆర్ఎస్ ఫైట్ చేస్తుందని ప్రకటించారు. సింగరేణితో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తు చేశారు.
కార్మికులకు కష్టం ఉందంటే రియాజ్ అన్న ముందు ఉంటారని, హెచ్ఎంఎస్ తో కలిసి సింగరేణి కార్మికుల కోసం టీఆర్ఎస్ పోరాటం చేస్తుందని తెలిపారు. సింగరేణి ఎన్నికల్లో హెచ్ఎంఎస్ కు మద్దతిచ్చి గెలిపించాలని కోరారు. మీకు ఏ కష్టం వచ్చినా ముందుండి కొట్లాడుతామన్నారు.








