కొడంగల్ లో కర్నాటక ఓటర్లు
కొడంగల్ లో 22 వేల డూప్లికేట్ ఓట్లు ఉంటే, 11 వేలు కర్ణాటక ఓటర్లు ఉన్నారు.
సీఎంకు ఈసీ ఫేవర్ చేసిందా?
కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బులు మాత్రమే కాదు.. ఓట్లు కూడా ట్రాన్స్ ఫర్ చేశారా?
వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ ఓటు అనే విధానమే బెస్ట్
-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
(తెలంగాణ రక్షణసేన, బంజారాహిల్స్)
వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ ఓటు అనే పరిస్థితికి ఎన్నికల కమిషన్ పటిష్ఠ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ లో కర్నాటక ఓటర్లే 11 వేల మంది నమోదై ఉన్నారని విమర్శించారు. ఎన్నికల కమిషన్ సీఎం రేవంతుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదా అన్న అనుమానం వస్తున్నదన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై సోమవారం తెలంగాణ రక్షణసేన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వేల కోట్లు ఖర్చు చేసి నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియతో దేశంలో డూప్లికేషన్ ఓట్లు ఉండకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించే పరిస్థితి రావాలన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పై చాలా అనుమానాలున్నాయని కవిత చెప్పారు. సాధారణంగా ఎస్ఐఆర్ కు రిఫరెన్స్ ను ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి తీసుకోవాలని సూచించారు. కానీ 2025 జనవరి నుంచి వీళ్లు ఎస్ఐఆర్ కు రిఫరెన్స్ పాయింట్ తీసుకుంటున్నారని చెప్పారు. ఏటా నిర్వహించే ఎస్ఎస్ఆర్ రిఫరెన్స్ పాయింట్ అయిన జనవరి 1 వ తేదీనే తీసుకోవాలని సూచించారు.
కానీ అలా కాకుండా గతేడాది జనవరి 1 తేదీని ఎస్ఐఆర్ కు రిఫరెన్స్ పాయింట్ చేశారన్నారు. ఐతే మా బోధన్ లో పరిస్థితి ఎలా ఉందని తెలుసుకుంటే అక్కడ 7 వేలకు పైగా ఓట్లను తీసేశారని తెలిపారు. వాళ్లు షిప్ట్ అయ్యారా, చనిపోయారా.. డూప్లికేషన్ ఓట్లా అనేది ఈసీ చెప్పటం లేదన్నారు. 2025, జనవరి 1 నుంచి ఇప్పటి వరకు ఏడాదిన్నరలో ఒక్క బోధన్ నియోజకవర్గంలో 7 వేల ఓట్లు డిలీట్ అయ్యాయన్నారు. ఈ 7 వేల ఓట్లకు సంబంధించి స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలని ఈసీని కోరారు. సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ కు మూడు రాష్ట్రాల్లో ఓటు ఉందని చెబుతున్నారని కవిత చెప్పారు. ఆ ఓట్లను తొలగించేందుకు ఏడు ఏండ్లు పడితే బోధన్ లో మాత్రం ఏడాదిన్నరలో 7 వేల ఓట్లు తొలగించారని విమర్శించారు. ఒక నియోజకవర్గంలో 2 శాతం కన్నా ఎక్కువ ఓట్లను తొలగించాల్సి వస్తే తొలిగించే ప్రతి ఓటరుకు మూడుసార్లు నోటీసులు ఇవ్వాలని ఈసీ నిబంధన ఉందని తెలిపారు. కానీ ఆ విధంగా ఎవరికీ నోటీసు ఇవ్వలేదని.. ఇస్తే ఈసీ దీని గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అక్రమ ఓట్లే గెలిపిస్తున్నాయా
బోధన్ లో 7 వేల ఓట్లు తొలగించటంతో తాము మిగతా నియోజకవర్గాల్లో అలాగే జరిగిందా అన్న అనుమానంతో కొడంగల్ లో చెక్ చేశామని కల్వకుంట్ల కవిత. అక్కడ కేవలం 808 ఓట్లు మాత్రమే డిలీట్ చేశారని వివరించారు. బోధన్ లో ఏడు వేలు ఎలా..? కొడంగల్ లో 8 వందలు మాత్రమే ఎలా తీసేస్తారని ప్రశ్నించారు. కొడంగల్ లో దాదాపు 22,433 డూప్లికేట్ ఓట్లు కూడా ఉన్నాయని, అందులో దాదాపు వెయ్యి వరకు ప్రింట్ తీయించి పెట్టామన్నారు. 2018 లో కొడంగల్ లో ఉన్న ఓట్ల సంఖ్యతో పోల్చుకుంటే 2023 నాటికి దాదాపు 30 వేల ఓట్లు పెరిగాయని వివరించారు. పైగా కొడంగల్ కు పక్కనే ఉన్న కర్ణాటకలోని సెడం అనే నియోజకవర్గం నుంచి 11 వేల మంది ఓటర్లు కొడంగల్ లో ఉన్నారని చెప్పారు. సెడంలోనూ కొడంగల్ లోనూ 11 వేల మంది ఓటర్లు ఎలా ఉంటారని ప్రశ్నించారు. కొడంగల్ లో ఉన్న డూప్లికేషన్, అదే విధంగా సెడంకు సంబంధించిన 11 వేల ఓట్లు కలిపితే 33 వేల ఓట్లు అవుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ లో దాదాపు 33 వేల ఓట్ల మెజార్టీతోనే గెలిచారని గుర్తు చేశారు. అంటే డూప్లికేట్, అక్రమంగా రిజస్టర్ చేసుకున్న ఓట్లతో గెలుపు, ఓటములు నిర్ణయించబడుతున్నాయని ఆరోపించారు. దీన్ని బట్టి చూస్తే ఎన్నికల సంఘం ముఖ్యమంత్రికి ఏమైనా ఫేవర్ చేసిందా అనే అనుమానం వస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలోని రెండు నియోజకవర్గాల్లోనే ఇలా ఉంటే మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటన్నారు. కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బులు మాత్రమే కాదు.. ఓట్లు కూడా ట్రాన్స్ ఫర్ అయ్యాయా అన్న అనుమానం కలుగుతున్నదని కవిత చెప్పారు.

ఒక ఇంటి ఓట్లు ఒకే బూత్ లో..
వేరే దేశంలో ఉండే వాళ్లకు మన దేశంలో ఓట్లు ఉండవద్దని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంటున్నారని, దానికి టీఆర్ఎస్ సమ్మతిస్తుందని తెలిపారు. కానీ ఒక రాష్ట్రంలో ఓటు ఉన్న వాళ్లకు మరొక రాష్ట్రంలో ఉండవచ్చా అని ప్రశ్నించారు. మీరు ఒక రాష్ట్రంలో వేరే దేశ పౌరుడి ఓటు తొలగిస్తే వాళ్లు మరొక రాష్ట్రానికి వచ్చి నమోదు చేసుకోరా అని అనుమానం వ్యక్తం చేశారు. అసలు ఇంటర్ స్టేట్ లో ఓట్ల డూప్లికేషన్ ను ఏరివేసేందుకు ఈసీ దగ్గర మెకనిజమే లేదని కవిత చెప్పారు. అలాంటప్పుడు 1400 కోట్లు పెట్టి ఎస్ఐఆర్ చేయటం వల్ల ప్రయోజనం లేదన్నారు. కచ్చితంగా ఇంటర్ స్టేట్ మైగ్రేషన్, డూప్లికేషన్ అంశంపై దృష్టి పెట్టాలని సూచించారు. అదే విధంగా దేశంలో ఉండే సంచార జాతుల వాళ్లకు ఏ విధంగా ఓటు ఇస్తారో చెప్పాలన్నారు. ఒక ఇంట్లో ఉండే వాళ్లందరికీ ఓకే బూత్ లో ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్ఐఆర్ ద్వారా ఇంటర్ స్టేట్ డూప్లికేషన్ ఓట్లను కూడా కట్ చేయాలని చెప్పారు. లేదంటే ఎస్ఐఆర్ కు అర్థం ఉండదన్నారు. ఎస్ఐఆర్ అనేది పర్మినెంట్ సొల్యుషన్ గా ఉండాలని టీఆర్ఎస్ భావిస్తున్నదని కవిత తెలిపారు. తమలాంటి కొత్త పార్టీకి ఇది చాలా ముఖ్యమన్నారు. కచ్చితంగా ఫెయిర్ గా ఎన్నికల జాబితా సిద్ధం చేయాలని ఈసీని కోరారు.








