తెలంగాణపై బీజేపీది సవతి తల్లి ప్రేమ

కాళేశ్వరం బీఆర్ఎస్ కు ఏటీఎం..బీజేపీకి ఎన్నికల ఎజెండా

సగం మంది బీజేపీ ఎంపీలు రేవంత్ తో కుమ్మక్కయ్యారు

టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నెమలికొండ వేణుమాధవ్

(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్):

తెలంగాణ ప్రజలను మభ్య పెట్టి, మోసం చేయడం బీజేపీ జాతీయ నాయకత్వానికి అలవాటుగా మారిందని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు వేణు మాధవ్ మండిపడ్డారు. బీజేపీ జాతీయాధ్యక్షులు నితిన్ నబీన్ తెలంగాణకు వచ్చి ఉట్టి మాటలు చెప్పారే తప్ప చేసిందేమీ లేదన్నారు. మంగళవారం బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణకు వచ్చినప్పుడల్లా కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ పదే పదే వల్లె వస్తారని…కానీ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆయన ప్రశ్నించారు. సీబీఐ ఎంక్వైరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరి పది నెలలు గడిచినా ఇప్పటికీ దానిపై ఏం నిర్ణయం తీసుకోలేదన్నారు. కాళేశ్వరం అవినీతి పై చర్యలు తీసుకోకుండా మాయ మాటలు చెబితే తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. కాళేశ్వరమనే అంశం బీఆర్ఎస్ కు ఏటీఎంగా ..బీజేపీకి ఎన్నికల ఎజెండాగా మారిందని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణకు బీజేపీ చేసిన అభివృద్ధి ఏంటని వేణుమాధవ్ ప్రశ్నించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు వరంగల్ కు ఏదైనా నిధులు ప్రకటిస్తారని భావించామని కానీ మళ్లీ అవే ఒట్టి మాటలు చెప్పారని మండిపడ్డారు. కాజీపేట రైల్వే కోచ్ మ్యాన్ ఫాక్చర్ యూనిట్ లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించే దానిపై గానీ మమూనూర్ ఎయిర్ పోర్ట్ ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. 

బీజేపీది సవతి తల్లి ప్రేమ

తెలంగాణ మీద బీజేపీది సవతి తల్లి ప్రేమ అని వేణు మాధవ్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు ఎనిమిది ఎంపీ సీట్లు ఇస్తే ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. దమ్ముంటే తెలంగాణకు ఇచ్చిన నిధులు, కేంద్రం కల్పించిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. బీజేపీ ఎంపీల్లో సగం మంది రేవంత్ రెడ్డి తో కుమ్మక్కై తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నాయకులకు తెలంగాణ పర్యటన ఒక పొలిటికల్ టూర్ అయ్యిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ తెలంగాణకు వచ్చి ఆంధ్రా నాయకులను కలుస్తాడని…ఆ పార్టీ నాయకులు వలస పాలకుల చేతిలో నలుగుతున్నారని వేణు మాధవ్ అన్నారు. ఇకనైనా తెలంగాణకు వచ్చే ముందు ఈ ప్రాంతానికి ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.