రాష్ట్రం ఎజెండా మార్చేందుకే టీఆర్ఎస్
ఒక్క హామీ అమలు చేయకుండా మళ్లీ గెలుస్తానని రేవంత్ రెడ్డి కలలు కంటున్నడు
ఫీజు రీయింబర్స్ మెంట్ కు పైసలు లేవ్ గానీ.. లక్ష కోట్లతో మూసీ బాగు చేస్తావా?
టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తాం
-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) :
తెలంగాణలో రాజకీయ పార్టీల ఎజెండా మారాల్సిన అవసరముందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. పెద్దవాళ్ల కోసం కాకుండా పేదవాళ్ల బతుకులు మారేలా పార్టీల ఆలోచన విధానం ఉండాలన్నారు. బుధవారం సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండిలో టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ వస్తే అందరి జీవితాలు మారిపోతాయని భావించామని కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే పేదలు, మధ్య తరగతి జీవితాలు మారేలా పరిపాలన సాగిస్తామని…వారికి ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు.
ఎజెండా మారాలి
తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీలుండగా కొత్త పార్టీ అవసరం ఏంటని చాలా మంది అనుకుంటున్నారని.. కానీ ఆయా పార్టీలు అసలు పేదల గురించి ఆలోచించడం లేదని కవిత చెప్పారు. పేద, మధ్యతరరగతి ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తే వారి జీవితాల్లో మెరుగైన మార్పు వస్తుందన్నారు. కానీ ఆ దిశగా ఇప్పుడున్న ఏ పార్టీ కూడా ఆలోచన చేయడం లేదన్నారు. ప్రజల కష్టాలు తెలిసిన ఆడబిడ్డగా వారి జీవితాల్లో మార్పు రావాలన్న గట్టి సంకల్పంతోనే పార్టీ పెట్టానని చెప్పారు. ఆడబిడ్డగా పార్టీ పెట్టి జెండా ఎత్తాను.. పేదల జీవితాల్లో మార్పే ఎజెండాగా పెట్టుకున్నానని ఆమె చెప్పారు. తమ పార్టీ రాకతో రాష్ట్రంలో అన్ని పార్టీలు తమ అజెండా మార్చుకోవల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇన్నాళ్లు మగ రాజకీయ నాయకులు చేసిన రాజకీయం చూశారని.. ఇప్పుడు ఆడబిడ్డ చేసే రాజకీయాలు చూడాలని కోరారు. ఒక్కసారి తనను ఆశీర్వాదిస్తే పేద, మధ్య తరగతి ప్రజలు విద్య, వైద్యం కోసం పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చేస్తానని చెప్పారు. అదే విధంగా యువత ఉపాధి కోసం వారికి రూ. 2 లక్షల నుంచి 20 కోట్ల రూపాయల వరకు తమ ప్రభుత్వం ఋణం అందిస్తుందన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తీర్చేలా టీఆర్ఎస్ నాయకులు పనిచేయాలని వారికి కవిత సూచించారు. ప్రజల కోసం పనిచేసే వారికే పార్టీలో గౌరవం ఉంటుందన్నారు.
రేవంత్ మళ్లీ నిన్ను సీఎం చేస్తారా?
సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశాడని కవిత అన్నారు. ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని ఆయన చెబుతుండటం చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా, కొత్త పెన్షన్లు ఇవ్వకుండా, ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా ఎట్ల గెలుస్తావ్ అని ప్రశ్నించారు. పేదలను వదిలి మెట్రో, మూసీ అనుకుంటా పెద్దవాళ్ల కోసమే ఆయన పనిచేస్తున్నాడని కవిత మండిపడ్డారు. పేదలకు మంచి చేసేందుకు డబ్బులు లేవు గానీ లక్ష కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తాడంట అని ఎద్దెవా చేశారు. ఉద్యమకారులకు ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మోసం చేశారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేలా గురువారం ఉప్పల్ భగాయత్ లో పెద్ద ఎత్తున భూపోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకోని ఉద్యమకారులకు భూ పంపిణీ చేస్తామని చెప్పారు.
హార్డ్ వర్క్ నే నమ్ముకోండి
సక్సెస్ కు షార్ట్ కట్ లేదని హార్డ్ వర్క్ నే నమ్ముకోవాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత యువతకు సూచించారు. మెహదీపట్నం లోని కింగ్స్ ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు ఆమె చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. 1500 కంపెనీ లతో వేలాది మందికి ఉద్యోగాలు వచ్చేలా జాబ్ మేళా ఏర్పాటు చేసిన నిర్వహకులను అభినందించారు. యువత ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలో అబద్దాలు చెప్పవద్దని.. తెలియనిది తెలియదనే చెప్పాలన్నారు. యూఎస్ లో తన మొదటి జాబ్ ఎక్స్ పీరియన్స్ ను ఈ సందర్భంగా కవిత షేర్ చేసుకున్నారు. 2001లో యూఎస్ లో జాబ్ కోసం వెళ్లిన ఇంటర్వ్యూలో తనకు తెలియని విషయాలను తెలియదని.. కాస్త టైమ్ ఇస్తే స్కిల్స్ నేర్చుకుంటానని చెప్పానన్నారు. ఆ విధంగా టైమ్ తీసుకొని స్కిల్స్ నేర్చుకొని ఉద్యోగం సాధించానని అన్నారు. యువత కూడా స్కిల్స్ నేర్చుకోని ధైర్యంగా ముందుకు వెళ్లాలని అన్నారు.








