పండిత, పామరులను అలరించే తెలంగాణ భాష

‎ -తెలంగాణ జాగృతి ఫౌండర్, తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

భాషా మాధుర్యాన్ని భవిష్యత్ తరాలకు అందించే కృషి గొప్పది- అనన్య నాగళ్ల

‘సరస్వతీరాజ్-హరిదా అంతర్జాతీయ ఉత్తమ తెలంగాణ కథా పురస్కారం – 2026’ పోటీల పోస్టర్ ఆవిష్కరణ

(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) :

‎తెలంగాణ భాష జీవభాష అని, తెలంగాణ భాషలో వచ్చిన సాహిత్యం పండిత పామరులను ఒకే విధంగా ఆనందింపజేస్తుందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆ మాధుర్యాన్ని తరతరాలకు అందించే విధంగా హరిదా రచయితల సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు. శనివారం బంజారాహిల్స్ లోని జాగృతి  కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘సరస్వతీరాజ్ – హరిదా అంతర్జాతీయ ఉత్తమ తెలంగాణ కథా పురస్కారం – 2026’ పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ భాషలోని సోయగాన్ని, పదబంధాలను, నుడికారాలను, సామెతలను కథల ద్వారా ముందు తరాలకు అందించడం మంచి ప్రయత్నమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ భాషలో కథల పోటీ నిర్వహించడం ఆదర్శనీయమని, తెలంగాణ భాషలో కథను రాయగలిగిన రచయితలందరికీ ఇదొక గొప్ప అవకాశమన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. 

భాష గొప్పతనం కథల ద్వారే తెలుస్తుంది- అనన్య నాగళ్ల

ఏ భాష గొప్పతనమైనా కథల ద్వారానే తెలుస్తుందని సినీ నటి అనన్య నాగళ్ల అన్నారు. కథలు ఆ ప్రాంతం భాష, సంస్కృతులను భవిష్యత్  తరాలకు అందజేసేందుకు సరైన సాధనాలని చెప్పారు. హరిదా రచయిత సంఘం కథ పోటీల ద్వారా రచయితల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఎంతో మంచి ప్రయత్నం చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమాన్ని రచయితలంతా తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు. 

తెలంగాణ భాష, సంస్కృతి వైభవాన్ని చాటేందుకే- ఘనపురం దేవేందర్

తెలంగాణ భాష, సంస్కృతుల వైభవాన్ని భవిష్యత్ తరాలకు అందించే ఉద్దేశంతోనే ఈ అంతర్జాతీయ స్థాయి కథల పోటీలను నిర్వహిస్తున్నామని హరిదా రచయితల సంఘం అధ్యక్షులు ఘనపురం దేవేందర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ భాషలో కథలు రాసే రచయితలందరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కథల పోటీల నిబంధనలను వివరిస్తూ… తెలంగాణ ఆత్మ, జీవితం, సంస్కృతి, భాష, జీవన విధాన వైభవాన్ని చాటిచెప్పే ఏదైనా అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని కథను తెలంగాణ భాషలోనే రాయాలని వివరించారు. కథలో తెలంగాణతనం తప్పనిసరిగా ప్రతిబింబించాలని, ఎక్కడా ప్రచురితం కాని, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయని, ఇతర పోటీలకు పంపని సరికొత్త కథలను మాత్రమే పంపాలని స్పష్టం చేశారు. రచన అనువాదం, అనుకరణ లేదా అనుసరణ కాకూడదని పేర్కొన్నారు. కథలను అక్షర దోషాలు లేకుండా యూనికోడ్ (Unicode) 14 సైజు ఫాంట్‌లో టైప్ చేసి, ఏ4 సైజులో గరిష్ఠంగా ఎనిమిది పేజీలకు మించకుండా పంపాలని సూచించారు. కథ రాసిన పేజీలపై రచయిత పేరు రాయకూడదని, నిబంధనలను అంగీకరిస్తూ విడిగా జతచేసే హామీపత్రంపై మాత్రమే రచయిత పేరు, చిరునామా, ఫోన్ నంబరు, ఈ-మెయిల్ ఐడీ వివరాలను పొందుపరచాలని కోరారు. విజేతల ఎంపికలో న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. 

మొదటి ఉత్తమ కథకు రూ. 10, 000

పోటీల్లో మొదటి ఉత్తమ కథకు రూ. 10,000/- నగదు పురస్కారం, తర్వాతి తొమ్మిది ఉత్తమ కథలకు ఒక్కొక్కరికి రూ. 1,000/- నగదు పురస్కారంతో పాటు సముచిత సత్కారం ఉంటుందని నిర్వహకులు తెలిపారు. ఈ పురస్కారాలను డిసెంబర్ 4వ తేదీన నిజామాబాద్‌లోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్‌లో జరిగే హరిదా రచయితల సంఘం మహాసభలో ప్రదానం చేస్తామన్నారు. ‎అర్హత, ఆసక్తి ఉన్న కథా రచయితలు తమ కథను, హామీ పత్రాన్ని అక్టోబర్ 30వ తేదీ లోపు haridaasaraswathiraj@gmail.com ఈ-మెయిల్ ఐడీకి పంపాలని కోరారు. ఇతర వివరాల కోసం 9030033331 నంబరును సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు రంగు నవీనాచారి, లకావత్ రూప్ సింగ్, శరత్ తదితరులు పాల్గొన్నారు.