అమరులు కోరుకున్న సమాజాన్ని నిర్మించాలి
సబ్బండ వర్గాలకు అధికారంలో వాటా దక్కాలి
-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
(తెలంగాణ రక్షణసేన, చందుర్తి/వేములవాడ) :
అమరులు కోరుకున్న సమాజాన్ని నిర్మించడమే వారికి మనమిచ్చే సరైన నివాళి అని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. చందుర్తి మండలం సనుగులలో మంగళవారం నిర్వహించిన అమరుల యాది కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సబ్బండ వర్గాలు, కులాలకు అధికారంలో భాగస్వామ్యం దక్కినప్పుడే అమరుల త్యాగాలకు ఫలితం ఉంటుందన్నారు. సమాజం కోసం ఓ వ్యక్తి తన ప్రాణాలు లెక్క చేయకుండా పోరాటం చేస్తుంటే ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందో తనకు తెలుసన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ నిమ్స్ లో 11 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కుటుంబ సభ్యులుగా ఎంత నరకయాతన అనుభవించామో తనకు మాత్రమే తెలుసన్నారు. కేసీఆర్ తో ఇప్పుడు రాజకీయంగా విభేదించినా, దారులు వేరైనా సమాజం కోసం ఆయన చేసిన త్యాగాన్ని మాత్రం మర్చిపోవద్దన్నారు. అదే విధంగా తెలంగాణ కోసం అమరులైన వారిని, మంచి సమాజం కోసం అప్పట్లో ఈ ప్రాంతంలో అసువులు బాసిన మావోయిస్టులను గుర్తు చేసుకోవాల్సిన అవసరముందన్నారు. వారు ఆకాంక్షించిన సమాజాన్ని నిర్మించాల్సి ఉందని చెప్పారు.
అమరుల త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో ఆ ఫలాలు నిజంగా అందరికీ దక్కాయా అన్నది సమీక్షించుకోవాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ వచ్చి 13 ఏళ్లు గడిచినప్పటికీ ఇప్పటికీ పేదవాళ్లు మెరుగైన విద్య, వైద్యం కోసం పోరాడుతునే ఉన్నారని.. ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ అని ప్రశ్నించారు. ఆనాడు భూస్వాములు, దొరలపై పోరాడితే.. ఇప్పుడు అధికారం అడ్డం పెట్టుకొని దోచుకుంటున్న వాళ్లపై పోరాటం చేస్తున్నామన్నారు. దోపిడీ విధానం మారిందే తప్ప వారిలో ఆ స్వభావం మారలేదని.. అది మారాలంటే నిరంతరం పోరాటం చేయాలన్నారు. యువత, మహిళలు రాజకీయాల్లోకి వస్తేనే పరిస్థితి మారుతుందన్నారు. మాజీ మావోయిస్టులు, అమర వీరుల కుటుంబాలకు న్యాయం జరిగేలా తాము పోరాటం చేస్తామన్నారు.









