కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఎస్టీలకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే
నోటిఫికేషన్లలో దీన్ని విస్మరించారు
ప్రభుత్వ నిర్లక్ష్యానికి 400 మంది ఎస్టీకి అన్యాయం
వెంటనే నోటిఫికేషన్ మార్చకుంటే ప్రభుత్వంపై పోరాటం తప్పదు
-తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత
(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) :
ఏజెన్సీ ప్రాంతాల్లోని కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఎస్టీలకు దక్కాల్సిన 75 శాతం రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ ఏడాది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్లో ఏజెన్సీ ప్రాంతాల ఎస్టీ రిజర్వేషన్లను పూర్తిగా విస్మరించారని చెప్పారు. ఇది ఎస్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయమంటూ మంగళవారం ఎక్స్ లో ఆమె పోస్ట్ చేశారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 1988లో జారీ చేసిన జీవో 109తో పాటు, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2018లో ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ 49 ప్రకారం ఏజెన్సీ ఏరియా కానిస్టేబుల్ పోస్టుల్లో ఎస్టీలకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించడం చట్టబద్ధంగా తప్పనిసరంటూ గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన 2015, 2018, 2022 కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్లలో ఈ రిజర్వేషన్లను యథావిధిగా అమలు చేశారన్నారు. కానీ ఈ ఏడాది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన తాజా నోటిఫికేషన్లో ఏజెన్సీ ప్రాంతాల ఎస్టీ రిజర్వేషన్లను విస్మరించారని మండిపడ్డారు.
ఎస్టీ యువత 400 ఉద్యోగాలు కోల్పోతారు
పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూలు, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన ఆదివాసీ, గిరిజన యువత తీవ్రంగా నష్టపోతారని కవిత చెప్పారు. అర్హులైన నిరుద్యోగులు దాదాపు 400కు పైగా కానిస్టేబుల్ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉంటుందన్నారు. గత నోటిఫికేషన్లలో ఇచ్చిన హక్కును ఈ నోటిఫికేషన్లో తొలగించడమంటే గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కులను హరించడమే అవుతుందన్నారు. ఈ విషయంపై హోంమంత్రిగానూ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంత గిరిజన యువతకు న్యాయం జరిగేలా కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్లోమార్పులు చేయాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఎస్టీలకు దక్కాల్సిన 75 శాతం రిజర్వేషన్ల నిబంధనను పునరుద్ధరించాల్సిందేనని ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే ఎస్టీ యువత కలిసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు.








