కరవుపై చేతులెత్తేసిన ముఖ్యమంత్రి
ప్రెస్ మీట్ పెట్టి తన వైఫల్యాన్ని చెప్పుకున్న సీఎం
రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతోనే ఈ దుస్థితి
రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు ఇవ్వడంతో పాటు ఇన్సూరెన్స్ చేయించాలి
రాష్ట్రం కరవులో ఉంటే సీఎం యాదాద్రి పవర్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తున్నడు
పవర్ మ్యాక్స్ కంపెనీతో ఉన్న ఒప్పందం ఏమిటో బయట పెట్టాలి
-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) :
ఎల్ నినోతో కరవు వస్తుందని శాస్త్రవేత్తలు ముందే హెచ్చరించినా ముందస్తు చర్యలు చేపట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణసేన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది జనవరి నుంచే ఎల్ నినో ఎఫెక్ట్ తో తీవ్రమైన కరవు వచ్చే ప్రమాదముందని హెచ్చరించినా కనీస చర్యలు చేపట్టలేదన్నారు. దొంగలు పడిన ఆరు నెలలకు ఏమో అన్నట్లుగా ఇప్పుడొచ్చి రైతులు త్యాగాలు చేయాలని నీతులు వల్లించడం సిగ్గుచేటు అన్నారు. కరవు విషయంలో తాను ఏమీ చేయలేనని సీఎం రేవంత్ రెడ్డి నిస్సహాయతను వ్యక్తం చేస్తూ చేతులెత్తేశారని మండిపడ్డారు. పాలకుడికి దూరదృష్టి ఉండాలని.. సీఎంలో అది లోపించిందని అన్నారు. పరిస్థితి మొత్తం చేయి దాటి పోయిన తర్వాత వచ్చి రైతులు త్యాగాలు చేయాలని మాట్లాడటం దారుణమన్నారు. ఆగస్టులో 28 శాతం లోటు వర్షపాతం నమోదు అయ్యిందని.. అప్పుడే అప్రమత్తమై ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. పక్క రాష్ట్రాలు కరవు మండలాలను ప్రకటించి కేంద్రానికి ఇప్పటికే నివేదిక పంపాయని గుర్తు చేశారు. తెలంగాణ సీఎం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇప్పుడు నింపాదిగా రివ్యూలు అంటూ కాలం వెళ్లదీసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం, ముఖ్యమంత్రి ముందే మేల్కొని ముందస్తుగా చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు తప్పేవన్నారు. మన ముఖ్యమంత్రికి ప్రజల మీద శ్రద్ధ, సమస్యల మీద ఫోకస్ లేదని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు అవుతుందని.. ఇప్పటి వరకు పాలమూరు-రంగారెడ్డి పూర్తి చేయలేదని, మేడిగడ్డ బ్యారేజ్ ను కూడా రిపేర్ చేయలేదని అన్నారు. వాటిని పూర్తి చేసి ఉంటే ఇవ్వాళ రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1.86 లక్షల కోట్లు ఖర్చు చేసినా ప్రాజెక్టులు పూర్తి కాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 26 వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఒక్క ఎకరానికి కూడా కొత్తగా నీళ్లు ఇవ్వలేదన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్లు చేసుకోవడానికి ఇదే సరైన సమయమని.. వచ్చే వర్షాకాలంలోగా ఆ పనులు పూర్తి గోదావరి నీళ్లను వినియోగంలోకి తేవాలని డిమాండ్ చేశారు. ఇంకా ఎన్నాళ్లు గత ప్రభుత్వాన్ని తిడుతూ టైమ్ చేస్తారని ప్రశ్నించారు. తిట్టుడు బంద్ చేసి కట్టుడు షురూ చేయాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఏడాదికి కృష్ణా నీళ్ల ఒప్పందం కుదుర్చుకుంటే ఆ వంకతో తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా ఏపీకి కృష్ణా నీటి ధారాదత్తం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు బిడ్డ అయి ఉండి కనీసం భీమా, నెట్టంపాడు ప్రాజెక్ట్ లను కూడా పూర్తి చేయకపోవటం అన్యాయమన్నారు. బీఆర్ఎస్ తప్పులను ఎత్తి చూపి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అవే తప్పులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి శాపంగా సీఎం అనుభవ లేమి
సీఎం రేవంత్ రెడ్డి అనుభవలేమి రాష్ట్రానికి శాపంగా మారిందని మండిపడ్డారు. నీళ్ల విషయంలో, కరవును ఎదుర్కొనే విషయంలో సీఎం ఏమాత్రం ముందు చూపుతో వ్యవహరించలేదన్నారు. రైతులను త్యాగాలు చేయాలంటున్న ముఖ్యమంత్రి వారికి పరిహారం ఏం ఇస్తారో మాత్రం చెప్పడం లేదన్నారు. పంట నష్టపోయిన వారికి ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని లీకులు ఇస్తున్నారే తప్ప ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయడం లేదన్నారు. యాసంగిలో పంటలు సాగు చేయకపోతే రైతు కూలీలు ఆగమయ్యే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కూలీలే కాదు, రైతులు సైతం పనులు లేక పట్ణణాలకు వలస వెళ్లే పరిస్థితి ఉందని.. పట్టణాల్లో సరైన ఉపాధి అవకాశాలు లేవన్నారు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వడంతో పాటు వారి కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రైతు కూలీలకు ఏమైనా అయితే వారి కుటుంబాలకు ఆగమవుతాయని అన్నారు. స్థానికంగా ఉపాధి లేక జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలానికి చెందిన 20 మంది కూలీలు పనికోసం కర్ణాటక వెళ్తుండగా ప్రమాదం జరిగి ఇద్దరు చనిపోయారని చెప్పారు. వారి కుటుంబాలకు ఆధారం లేకుండా పోయిందన్నారు. ఉపాధి హామీ పథకంలో రైతు కూలీలకు పని కల్పిస్తామని చెప్తున్నప్పటికీ కేంద్రంతో మాట్లాడకుండా అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఉపాధి హామీలో పని దినాలు పెంచడం కోసం ఇప్పుడు కమిటీ వేస్తే ఎప్పుడు కేంద్రానికి నివేదిక ఇస్తారని.. వాళ్లు ఎప్పుడు ఆమోదిస్తారని ప్రశ్నించారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్ర
రాష్ట్రం ఇంత సంక్షోభం ఉంటే సీఎం తన కుటుంబానికి సంపదను దోచేపెట్టే పనిలో ఉన్నారని కవిత మండిపడ్డారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లో కొన్ని కాంపొనెంట్లను ప్రైవేటీకరించి దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. పవర్ మ్యాక్స్ అనే కంపెనీతో ముఖ్యమంత్రికి ఉన్న సంబంధాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కరెంట్ విషయంలో ప్రభుత్వానికి అధికారం ఉండాలని గతంలో మాట్లాడిన సీఎం.. ఇప్పుడు ప్రైవేటీకరణకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. రైతులకు నీళ్లు, కరెంట్ ఇవ్వగలిగే పరిస్థితి ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదని.. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. రాష్ట్రంలో కరెంట్ సంక్షోభం ఉంటుందని ముందే గ్రహించి తాము ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నామని గుర్తు చేశారు. సర్ ప్లస్ కరెంట్ ఉన్న రాష్ట్రాలతో ముందే ఒప్పందం కుదుర్చుకొని ఉంటే కరెంట్ సమస్య వచ్చేది కాదన్నారు. అడుక్కుంటారో, కొనుక్కుంటారో గానీ నవంబర్ నెలాఖరు వరకు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. లేదంటే బోర్లపై ఆధారపడిన రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. కరెంట్ కష్టాలను అధిగమించేందుకు అవసరమైతే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను కలుస్తామని.. ఢిల్లీకి వెళ్లి కేంద్రం పెద్దలతో మాట్లాడతామని చెప్పారు.
హైదరాబాద్ నీటి కష్టాలకు కాంగ్రెస్సే కారణం
హైదరాబాద్ లో నీటి కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని కవిత చెప్పారు. ఎల్ నినో ఎఫెక్ట్ తో పాటు నగరంలో పెద్ద ఎత్తున చెరువులు కబ్జా చేయటంతో నీళ్ల కష్టాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8 వేల చెరువులు మాయం చేశారని చెప్పారు. దీంతో నగరంలో భూగర్భ జలాలు అడుగంటాయని తెలిపారు. చెరువులను కాపాడాల్సిన హైడ్రా ఏం చేస్తుందని నిలదీశారు. కరువు బారిన పడిన రాష్ట్రాన్ని వదిలేసి తన కుటుంబానికి దోచి పెట్టేందుకు ముఖ్యమంత్రి రోజు అన్నదమ్ములతో మీటింగ్ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ దోపిడీకి కేటాయించిన సమయంలో కొంత రాష్ట్ర ప్రజల కోసం కేటాయించి ఉంటే ఈ కష్టాలు వచ్చేవి కావన్నారు.
అఖిలపక్షం ఇప్పుడు గుర్తొచ్చిందా?
కరవును ఎదుర్కొనే విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని కవిత అన్నారు. కరువు విషయంలో అఖిలపక్ష మీటింగ్ పెడతామని అంటున్నారని కానీ దానితో ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. ఈ పని ముందే చేయాల్సిందని అన్నారు. బీసీ బిల్లు విషయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్లలేదని నిలదీశారు. అవసరమైన విషయాల్లో సైలెంట్ గా ఉండి ఇప్పుడు తాను చేసిన తప్పుకు అందరినీ భాగస్వాములు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు అఖిలపక్షం గుర్తొచ్చిందా అంటూ మండిపడ్డారు. కవులు, కళాకారులు, ప్రతిపక్షాలు, సినిమా స్టార్లను కరవు విషయంలో ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరుతున్నారని.. కానీ గతంలో వారిని ఇబ్బంది పెట్టిన సంగతి ఏమిటని ప్రశ్నించారు. కష్ట కాలంలో రైతులకు తాము అండగా ఉంటామని, వారికి తమ తరఫున చేయగలిగిన సాయం చేస్తారని చెప్పారు. అదే సమయంలో ఈ ప్రభుత్వం చేతగాని తనం కారణంగా వచ్చిన కరువు ముప్పును కూడా ప్రజలకు వివరిస్తామన్నారు.
సొంత మనుషులపై ఉడుకు నీళ్లు పోసే నైజం కేటీఆర్ ది
విదేశీ బొగ్గు కొనుగోలు ఒప్పందాలపై విచారణ పేరుతో ప్రతిమ శ్రీనివాస్ రావుకు వ్యతిరేకంగా కేటీఆర్ లేఖ రాయడంపై కవిత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉద్యమకాలంలో బీఆర్ఎస్ కు పూర్తి అండగా ఉన్న శ్రీనివాస్ రావుపై విచారణ కోరడం అంటే నమ్మినోళ్లను నట్టేట ముంచడమేనన్నారు. సాయం చేసిన వాళ్లను, కుల బంధువులను ఇబ్బంది పెట్టడం.. ఇంటి మనిషినైనా తనను కిరాయి మనుషులతో తిట్టించే నైజం కేటీఆర్ ది అని మండిపడ్డారు. తెలిసి చేశాడో తెలియక చేశాడో గానీ లేఖ రాయడం ఆయన అజ్ఞానాన్ని తెలియజేస్తుందన్నారు. తెలియక చేసి ఉంటే ఆయనకు ఏమీ తెలియదని తాను చెప్పే మాటలు నిజమని.. తెలిసి చేసి ఉంటే అదే కేటీఆర్ నైజమని అన్నారు. సొంత మనుషులపై ఉడుకు నీళ్లు పోసే వ్యక్తి కేటీఆర్ అన్నారు. ప్రతిమ శ్రీనివాస్ ను సీఎం ఎందుకు కాపాడుతున్నాడని ప్రశ్నించారు. తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాలని కానీ సాయం చేసిన వాళ్లపైనే విచారణ కోరుతూ లేఖలు రాయడమే కేటీఆర్ వ్యక్తిత్వమన్నారు. సింగరేణి కార్మికుల కష్టాలేవి కేటీఆర్ కు తెలియదన్నారు. సింగరేణిలో బీఆర్ఎస్ సభ పెట్టి బల ప్రదర్శన చేయడానికి ప్రయత్నించారు తప్ప కార్మికుల కష్టాలను కనీసం ప్రస్తావించలేదన్నారు. తమ పోరాటాలతోనే ప్రభుత్వం దిగి వచ్చి సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహిస్తుందని గుర్తు చేశారు. కార్మికుల కోసం పనిచేస్తున్న హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ కూటమే సింగరేణి ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.








